Andhra Pradesh: వ్యవసాయ క్షేత్రంలో సందడి చేసిన మంత్రి, కలెక్టర్.. స్వయంగా వరి విత్తనాలు వెదజల్లుతూ..
Konaseema News: ఒకరేమో ఏపీ మంత్రి.. మరొకరేమో జిల్లా కలెక్టర్.. ప్రభుత్వ కార్యక్రమాలతో ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఉండే వీరిద్దరూ రైతన్న అవతారమెత్తారు. ఇద్దరూ కలిసి వ్యవసాయ క్షేత్రంలో సందడి చేశారు.. స్వయంగా వరి విత్తనాలను వెదజల్లారు.

Konaseema News: ఒకరేమో ఏపీ మంత్రి.. మరొకరేమో జిల్లా కలెక్టర్.. ప్రభుత్వ కార్యక్రమాలతో ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఉండే వీరిద్దరూ రైతన్న అవతారమెత్తారు. ఇద్దరూ కలిసి వ్యవసాయ క్షేత్రంలో సందడి చేశారు.. స్వయంగా వరి విత్తనాలను వెదజల్లారు. దాదాపు ఎకరం పొలంలో విత్తనాలను వెదజల్లి రైతులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బిజీబిజిగా ఉండే మంత్రి, కలెక్టర్ సామాన్య వక్తుల్లా మారి వరి విత్తనాలను వెదజల్లడం అందరినీ ఆకట్టుకుంది. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామంలో సోమవారం ఉదయం మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో వరి విత్తనాలు వెదజల్లే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పినిపే విశ్వరూప్, కలెక్టర్ హిమాన్షు శుక్లా యేళ్ల దుర్గారావు పొలంలో వరి విత్తనాలను వెదజల్లారు.

Konaseema
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ.. రైతాంగంలో నూతన ఒరవడే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తనదైన తరహాలో ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నూతన వరవడి తెచ్చే విధంగా రైతులకు లబ్ది చేకూర్చుతూ ఎనలేని కృషి చేస్తున్నట్లు వివరించారు. రైతులకు ఆర్బికేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడంతోపాటు వైయస్సార్ యంత్ర పరికరాలు అందిస్తున్నామన్నారు. దీని ద్వారా రైతుల్లో విశ్వాసం పెంపొందించే విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జూన్ ఒకటో తేదీన సాగునీరు విడుదల చేశాన్నారు. భూమిని నమ్ముకున్న రైతు తమ కష్టసుఖాల్లో తాము పాలుపంచుకునే విధంగా తాను, జిల్లా కలెక్టర్ నేరుగా వరి విత్తనాలు వెదజల్లే కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.

Konaseema
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ.. తాను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి వరి నాట్ల సమయంలో రైతులతో కలిసి పొలాల్లో వరి విత్తనాలు చల్లడం (నారుమడులు వేయడం) ఆనందంగా ఉందన్నారు. రైతుకు కష్టం కలగకూడదని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్యక్రమాలను పూర్తిస్థాయిలో రైతాంగానికి చేరువ అయ్యే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు.




ఈ వరి విత్తనాలు వెదజల్లే కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఓలేటి బోసు బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..