Stone Pulling: పుట్టపర్తిలో రాతి దూలం లాగుడు పోటీలు.. ఒంటెద్దు, జోడెద్దులతో పాల్గొన్న రైతన్నలు..
తెలుగు రాష్ట్రాల్లో ఆషాడ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలో రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు ప్రజలు. పోటీల్లో పాల్గొన్నవారికి బహుమతులు అందజేశారు నిర్వాహకులు.
ఆషాడ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటక నాగేపల్లిలో గ్రామస్తుల ఆధ్వర్యంలో రాతిదూలం లాగుడు పోటీలు ఘనంగా నిర్వహించారు. అట్టహాసంగా జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా నలుమూలల నుంచి ఆసక్తిగల రైతులు.. తమ ఎద్దులను తీసుకొచ్చి పోటీల్లో పాల్గొన్నారు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగిన ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు పెద్దయెత్తున తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది.
అంతేకాదు.. ఒంటెద్దు, జోడెద్దులతో రెండు రకాల పోటీలు నిర్వహించారు గ్రామస్తులు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఎద్దులతో పోటీలు నిర్వహించడం పట్ల పలువురు రైతన్నలు సంతోషం వ్యక్తం చేశారు. కనుమరుగైపోతున్న గ్రామీణ సంప్రదాయాలను ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇక.. పోటీల్లో గెలుపొందిన ఎద్దుల యజమానులకు బహుమతులు అందజేశారు.
గ్రామీణ సంస్కృతిని మరిపించేలా ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు ప్రజలు. రాతిదూలం లాగుడు పోటీలు ఎంతోగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటక నాగేపల్లిలో ప్రతి సంవత్సరం రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాలకు కొత్త శోభ వస్తుందని చెప్పుకొచ్చారు. ఇక.. ఆషాడ పౌర్ణమి సందర్భంగా పలు ఆలయాల్లో విశేష సేవలు జరిగాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..