Konaseema Violence: అమలాపురం కుట్ర వెనుక ఆ పార్టీల నేతలు.. ఏపీ మంత్రుల సంచలన వ్యాఖ్యలు..
కోనసీమ జిల్లాకు బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారుల ముసుగులో సంఘ విద్రోహశక్తులు చొరబడి విధ్వసం సృష్టించారని ఏపీ మంత్రులు పేర్కొన్నారు.
Amalapuram Konaseema Violence: అమలాపురంలో కుట్రతోనే విధ్వంసం సృష్టించారని ఏపీ మంత్రులు పలువురు ఆరోపించారు. కోనసీమ అల్లర్ల వెనుక.. టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారంటూ మంత్రులు పేర్కొన్నారు. దీనివెనుక ఎవరున్నా..వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం మంత్రులు ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజా, మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళను తగులబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎపి మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కోనసీమ జిల్లాకు బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఆందోళనకారుల ముసుగులో సంఘ విద్రోహశక్తులు చొరబడి విధ్వసం సృష్టించారన్నారు. కుట్ర పూరితంగా ఈ విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల ఆస్థులను ధ్వంసం చేయడమే కాకుండా పోలీసులపై జరిగిన దాడులు చేయడం హేయమైన చర్య అని ఆదిమూలపు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కానివ్వండి, ఇతర సంఘ విద్రోహశక్తులు కానివ్వండి ఎవరినీ ఉపేక్షించేది లేదంటూ పేర్కొన్నారు. విధ్వంసం సృష్టించిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారని, త్వరలోనే దోషులను కనిపెడతామన్నారు. అంబేద్కర్, పూలే, బాబూ జగ్జీవరామ్, సాహుమహారాజ్ లాంటి నాయకులు జాతీ సంపద లాంటి వారని, వీరిని ఒక వర్గానికి చెందిన నేతలుగా భావించకూడదన్నారు. దళితుల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర పూరితంగా విధ్వంసం సృష్టించారని మంత్రి సురేష్ తెలిపారు.. ఈ కుట్రకు సంబంధించి బలమైన సాక్ష్యాలు ఉన్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతామని సురేష్ స్పష్టం చేశారు.
అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు, పవన్ డిమాండ్ చేశారు.. మంత్రి కొట్టు సత్యనారాయణ
ప్రశాంతంగా ఉండే ప్రాంతంలోనూ కల్లోలం సృష్టించి, విధ్వంసం చేస్తున్నారని.. మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారని చెప్పారు. ప్రజల కోరిక మేరకు పేరు మారిస్తే వారి తప్పుడు నిర్ణయాలు, రాజకీయ పబ్బం గడుపుకోవటానికి టిడిపి, జనసేన వికృత స్వరూపాన్ని బయటపెట్టాయని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసంగా ఉన్నారని కోనసీమలో విధ్వంసం సృష్టించారని తెలిపారు. కాగా.. సిఎం జగన్ దావోస్ పర్యటన విజయవంతమైందని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
ఈ ఘటన వెనుక చంద్రబాబు, పవన్.. మంత్రి దాడిశెట్టి రాజా..
కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో అమలాపురంలో జరిగిన విధ్వంసం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారంటూ మంత్రి దాడిశెట్టి రాజా సంచలన ఆరోపణలు చేశారు. కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన, అన్ని పార్టీలు కోరాయని గుర్తుచేశారు. ఈ ఘటన వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లే ఉన్నారని.. రాష్ట్రానికి చంద్రబాబు విలన్ అంటూ మండిపడ్డారు. ఈ ఘటనలో కుట్రకోణం ఉందని.. తుని ఘటన జరగడానికి కారణం చంద్రబాబే.. ఈ రోజు అమలాపురంలో విధ్వంసానికి కూడా చంద్రబాబే కారణం అంటూ మండిపడ్డారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..