2024 ఎన్నికలు టీడీపీ భవిష్యత్తును డిసైడ్ చెయ్యబోతున్నాయా? చంద్రబాబు సీఎం కాకపోతే మున్ముందు పార్టీ పరిస్థితి ఏంటి?

ఏపీలో మే 13న జరగబోయే ఎన్నికలు చంద్రబాబు రాజకీయ భవిష్యత్తునే కాదు ఆయన పార్టీ భవిష్యత్తును కూడా నిర్ణయించబోతున్నాయా..?. ఈ విషయం ఆయనకు కూడా బాగా తెలుసా...? అందుకేనా అంతగా కష్టబడుతున్నారు..? ఒక వేళ ఆయన అనుకున్న ఫలితం రాకపోతే... వాట్ నెక్ట్స్...?

2024 ఎన్నికలు టీడీపీ భవిష్యత్తును డిసైడ్ చెయ్యబోతున్నాయా? చంద్రబాబు సీఎం కాకపోతే మున్ముందు పార్టీ పరిస్థితి ఏంటి?
చంద్రబాబునాయుడు(TDP WEBSTE)
Follow us

|

Updated on: Apr 25, 2024 | 12:20 PM

నారా చంద్రబాబు నాయుడు… టీడీపీ అధినేత… ఏపీ రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లో కూడా సుదీర్ఘ అనుభవం ఉన్న నేత. తన రాజకీయ చాణక్యంతో ఎన్నో సంక్షోభాల నుంచి పార్టీని కాపాడుకుంటూ వచ్చిన ఆయన… ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, అలాగే విభజన తర్వాత కూడా తనదైన శైలిలో పాలించిన  నేత. అయితే ఇన్నాళ్లు ఆయన ఎదుర్కొన్న పరీక్షలు వేరు.. మరి కొద్ది రోజుల్లో ఆయన ఎదుర్కోబోతున్న పరీక్ష వేరు. నిజానికి మే 13న జరగబోయే ఎన్నికలు ఆయన పార్టీ భవిష్యత్తునే కాదు, ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించబోతున్నాయి. మరి ఈ విషయం ఆయనకు కూడా తెలుసా…? అందుకేనా అంతగా కష్టబడుతున్నారు..? ఒక వేళ ఆయన అనుకున్న ఫలితం రాకపోతే… వాట్ నెక్ట్స్…?

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర…

నారా చంద్రబాబు నాయుడు… టీడీపీ అధినేతగా దేశం మొత్తం తెలిసిన పేరు.  పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా.. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి. ఎన్డీఏ కన్వీనర్‌గా… దేశానికి రాష్ట్రపతిగా ఎవరుండాలి ? ఎవరు లోక్ సభకు స్పీకర్‌గా ఉండాలి… ఏ పార్టీని అప్పటి ఎన్డీఏలోకి ఎలా తీసుకురావాలి…? ఇలా కేవలం రాజకీయాలు మాత్రమే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సందర్భంలో హైటెక్ సిటీ నిర్మాణంతో, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి మహా మహుల్ని హైదరాబాద్ రప్పించిన ముఖ్యమంత్రిగా… విజన్ 2020, జన్మభూమి, ఆర్థిక సంస్కరణలు ఒక్కటి కాదు రెండు కాదు.. అటు రాజకీయంగా, ఇటు పాలనా పరంగా.. దేశ వ్యాప్తంగా ఏపీ పేరును, మరీ ముఖ్యంగా హైదరాబాద్ పేరు మారు మోగించిన వ్యక్తిగా కూడా ప్రఖ్యాతి చెందిన వ్యక్తే. ఆయనంటే నచ్చని వాళ్లు… ప్రత్యర్థులు ఆయన గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు, అది వేరే విషయం.

CHANDRABABUNAIDU

చంద్రబాబు జీవితంలో ముఖ్య ఘట్టాలు

నిజానికి ముఖ్యమంత్రి పదవి ఆయనకు కొత్త కాదు… అప్పట్లో అంటే ఆయన దేశ రాజకీయాల్లో పెత్తనం చెలాయించిన రోజుల్లో ప్రధానిగా కూడా పగ్గాలు చేపట్టే ఛాన్సొచ్చిందని అయినా రాష్ట్రం కోసం కాదనుకున్నారని సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు చెబుతుంటారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా పని చేశారు. విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పని చేశారు.

CHANDRABABUNAIDU

చంద్రబాబు జీవితంలో ముఖ్య ఘట్టాలు

గతం సరే… ఇప్పుడేంటి…?

అయితే ఇది గతం… ఐదేళ్లుగా ఆయన పార్టీ ప్రతిపక్షంలోనే ఉంది. ఆయన చుట్టూ అవినీతి కేసులు చుట్టుముట్టాయి.  జీవితంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా జైలుకెళ్లారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 50 రోజులకు పైగా జైల్లోనే ఉన్నారు. ఎప్పుడూ ఎదుర్కొనంత బలమైన శత్రువు, అదీ అధికారంలో ఉన్న శత్రువు ఆయన పార్టీని అంతమొందిస్తానని శపథం చేసి మరీ బరిలో దిగి సై అంటే సై అంటున్నారు. తనకన్నావయసులో 23 ఏళ్లు తక్కువున్న ఓ యువ నాయుకుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడు తలపడుతున్నారు చంద్రబాబు. ఒకప్పుడు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి దీటైన ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు అంతకన్నా బలమైన నాయకునిగా చెలామణీ అవుతున్న ఆయన బిడ్డ వైఎస్ జగన్‌తో తలపడాల్సి రావడం, అదీ ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం పోరాడాల్సి రావడం..  నిజంగా విధి విచిత్రమే.

CHANDRABABUNAIDU

బహిరంగ సభలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఒకప్పటి రాజకీయం నవడటం లేదు.  కేవలం 2 పార్టీల మధ్య మాత్రమే పోటీ లేదు. అప్పట్లో ఏపీ రాజకీయాలంటే అయితే కాంగ్రెస్, లేదా టీడీపీ ఈ రెండు పార్టీల మధ్యే ఫైట్ ఉండేది. అందుకే పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి కూడా పార్టీని బతికించుకోవడం, తిరిగి అధికారంలోకి తీసుకురాగలగటం చంద్రబాబుకు సాధ్యమయ్యింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.

ఇప్పుడు కాకపోతే వచ్చే ఎన్నికల్లో చూసుకుందాంలే అనుకునేందుకు చంద్రబాబేం జగన్‌లా, పవన్ కల్యాణ్‌లా ఐదు పదుల వయసులో లేరు. ఇప్పుడు ఆయన వయస్సు అక్షరాల 74. అందుకే ఈ ఎన్నికలు టీడీపీకి అంత క్రూషియల్. ఒక వేళ ఇప్పుడు టీడీపీ గెలవకపోతే.. 2024 తర్వాత పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. 2029 ఎన్నికలొచ్చేసరికి చంద్రబాబు వయసు 79కి చేరుకుంటుంది. అందుకే త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం చంద్రబాబుకు ముఖ్యం.

CHANDRABABUNAIDU

చంద్రబాబునాయుడు జీవితంలో మరిన్ని ముఖ్య సంఘటనలు

గెలవకపోతే పరిస్థితి ఏంటి ?

ఇప్పుడు అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్టే. ఇది ఆయన అభిమానులకు, కార్యకర్తలకు కష్టం కల్గించే మాటే అయినా… నమ్మక తప్పని చేదు నిజం. విశేషమేంటంటే… ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. అందుకే ఈ ఎన్నికల్లో విజయం కోసం ఆయన అంతగా కష్టబడుతున్నారు. ఆరేళ్ల క్రితం ప్రత్యేక హోదా పేరుతో ఏ మోదీనైతే తిట్టిపోశారో.. ఇప్పుడు అదే మోదీతో చేతులు కలిపారంటే.. అది కూడా గత ఎన్నికల్లో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే కారణం అదే. గెలుపుకోసం కలిసొచ్చే ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టకూడదనే.

CHANDRABABUNAIDU

పత్తికొండ సభలో చంద్రబాబు

ఇక పార్టీ విషయానికొద్దాం. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఎన్నో రాజకీయ సంక్షోభాలను చూసింది. సాక్షాత్తు పార్టీ పెట్టిన అన్నగారు ఎన్టీఆర్ చేతుల్లోంచే అనుహ్య పరిణామాల మధ్య చేజారిపోయింది. వైస్రాయ్ హోటల్ సాక్షిగా జరిగిన పరిణామాలు.. పార్టీని ఎటు తీసుకెళ్తాయో అనుకున్నారు అభిమానులు. ఆ తర్వాత చంద్రబాబు తన రాజకీయ చాణక్యాన్నంతా ఉపయోగించి పార్టీ మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు ఎదురైనా పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి వైశ్రాయ్ ఎపిసోడ్ టీడీపీ దృష్టిలో, ఆ పార్టీ నేతలు, కార్యకర్తల దృష్టిలో కాలం చెల్లిన కథ. ఆ ఎపిసోడ్ తర్వాత ఆయన సుమారు 9 ఏళ్ల పాటు ఉమ్మడి ఏపీని పాలించారు. 2004లో వైఎస్ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి.  ఆ కష్టాలను చంద్రబాబు తన వస్తున్నా మీ కోసం పాదయాత్రతో అధిగమించగల్గారు.

రంగంలోకి వారసుడు

63 సంవత్సరాల వయసులో 208 రోజుల పాటు నాటి ఉమ్మడి రాష్ట్రంలో 16 జిల్లాలు, 86 అసెంబ్లీ నియోజకవర్గాలు, 162 మండలాలు, 28 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు, 1289 గ్రామాల గుండా 2,817 కిలోమీటర్లు నడిచారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన… అప్పుడే విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను గాడిన పెట్టేందుకు చంద్రబాబు అనుభవం పనికొస్తుందని ఏపీ జనాలు బలంగా నమ్మడం అందుకు పవన్ కల్యాణ్, అటు మోదీ గాలి కూడా దేశ వ్యాప్తంగా వీయడంతో విభజిత ఏపీకి తొలి సీఎంగా చంద్రబాబు రావడం, తిరిగి టీడీపీకి మంచి రోజులు రావడం చక చకా జరిగిపోయాయి. అధికారంలో ఉన్న పార్టీకి అడ్డేముంటుంది..? అందుకే తన వారసుణ్ణి కూడా రంగంలోకి దీంచేశారు. అంతకుముందు 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం ఖాకీ చొక్కా వేసుకొని మెడలో పసుపు కండువా వేసుకొని రాష్ట్రమంతా తిరిగి ఎన్టీఆర్‌ను కాదని, పార్టీలో చంద్రబాబు తనయుడు లోకేష్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మొదలయ్యింది. ఆ విషయంలో విమర్శల్ని చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు.

Nara Lokesh

చంద్రబాబు తనయుడు లోకేష్

అధికారంలో ఉండటంతో అటు జనాలకు ఇటు పార్టీకి లోకేష్‌ను అలవాటు చేసేశారు చంద్రబాబు. అయితే ఆయన తర్వాత పార్టీని నడపే సత్తా లోకేష్‌కి ఎంత మేర ఉందన్నది కాలం చెప్పాల్సిన సమాధానం. లోకేష్ గురించి బాగా తెలిసిన వాళ్లు పాదయాత్ర ముందు లోకేష్.. పాదయాత్ర తర్వాత లోకేష్ అంటూ ఉంటారు. పాదయాత్ర తర్వాత, జనంలోకి వెళ్లిన తర్వాత ఆయన శైలి చాలా వరకు మారిందన్నది ఆయన్ను బాగా దగ్గరగా చూసిన వ్యక్తులు చెప్పే మాట. అదీగాక.. పార్టీకి, చంద్రబాబుకు బాగా సన్నిహితులు.. దేశ, రాష్ట్ర రాజకీయాలపై తనదైన మార్కులో వారం వారం విశ్లేషణ చేసే ఓ ప్రముఖుని వద్ద సుమారు 5-6 నెలల పాటు శిక్షణ తీసుకొని రాటుదేలారని, ఆ తర్వాత లోకేష్‌లో చాలా వరకు మార్పొచ్చిందని కూడా చెప్పుకుంటూ ఉంటారు.

బహుశా ఆ విషయం టీడీపీ ప్రత్యర్థులకు కూడా తెలిసినట్టే కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఆయన్ను రక రకాలుగా హేళన చేసే వాళ్లు (వారు ఉపయోగించిన పదాలను పాత్రికేయ ప్రమాణాల దృష్ట్యా ఇక్కడ ప్రస్తావించడం లేదు.) ఇప్పుడు ఆ తరహా పదాలను పెద్దగా వాడటం లేదు. అయితే రాజకీయంగా ఎంత పరిణితి సాధించినా… చంద్రబాబు అనుభవం, రాజకీయ చాణక్యంతో పోల్చినప్పుడు మున్ముందు లోకేష్ ఎలా తనను తాను నిరూపించుకుంటారన్నది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్. అయితే నిన్న మొన్నటి వరకు పార్టీ పరంగా చాలా యాక్టివ్‌గా ఉన్న లోకేష్ ఇప్పుడు కేవలం తాను పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గానికే పరిమితం అయినట్టు కనిపిస్తోంది. ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పటి నుంచి  లోకేష్ పాత్ర కాస్త పరిమితం అయినట్టు కనిపిస్తోంది. బహుశా మంగళగిరి నుంచి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న ఆయన.. తన దృష్టి మొత్తాన్ని అక్కడే కేంద్రీకరించినట్టున్నారు.

టీడీపీకి అల్లుడి గండం ?

అదే సమయంలో టీడీపీకి అల్లుడి గండం కూడా పొంచి లేదని చెప్పలేం. గతంలో ఎన్టీఆర్‌కి అది అనుభవమయ్యింది. ప్రస్తుతం విజయాలు సాధిస్తూ వెళ్తున్నంత సేపూ టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో ఉన్నా.. లోకేష్ నాయకత్వంలో ఉన్నా పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఈ సారి ఎన్నికల్లో గెలుపు సాధించకపోతే మాత్రం టీడీపీకీ మరోసారి అల్లుడి గండం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నది గత కొన్నేళ్లుగా మీడియాలో తరచు వచ్చే కథనాల బట్టీ అర్థమవుతోంది. అయితే ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండటం, అలాగే తానెంచుకున్న రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా ప్రశంసలందుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. అదే సమయంలో రెండు కుటుంబాల మధ్య కొన్నాళ్లు నడుస్తున్న కోల్డ్ వార్ కొలిక్కొస్తే అది పార్టీకి కూడా మరింత కలిసొచ్చే అంశమే. అలా కాకుండా దూరం మరింత పెరిగితే… భవిష్యత్తులో టీడీపీకి ఆయన అవసరం వస్తే అప్పుడు పరిస్థితి వేరుగా ఉండొచ్చు.

Ntr

జూనియర్ ఎన్టీఆర్

అయితే చంద్రబాబును జైల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ కానీ కనీసం స్పందించలేదు. ఆ పరిణామాలు చూసిన వారికి రెండు కుటుంబాల మధ్య సంబంధాల విషయంలో మరింత అనుమానాలు మొదలయ్యాయి.

ఇప్పటికే ఓ సారి జనంలోకెళ్లి తన రాజకీయంగా సత్తా ఏంటో జూనియర్ చూపించారు కూడా. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకే తన సమాయన్ని కేటాయించినా… ఒక వేళ రాబోయే ఎన్నికల్లో టీడీపీ చతికిలపడితే మాత్రం… పరిస్థితులు ఇప్పుడున్నట్టు ఏ మాత్రం ఉండకపోవచ్చన్నవాళ్లూ లేకపోలేదు. చంద్రబాబు తర్వాత ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. లోకేష్-ఎన్టీఆర్ మధ్యలో పోలిక వచ్చినప్పుడు మాత్రం పార్టీలో పరిణామాలు ఎటు నుంచి ఎటు మారుతాయో కూడా చెప్పలేం. అందుకే చంద్రబాబు ఈ ఎన్నికలు అత్యంత కీలకం. కచ్చితంగా గెలవాలి. గెలిచి తీరాలి. లేదంటే  ఆ తర్వాత పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందో.. అందరికన్నా ఆయనకే ఎక్కువ తెలుసు.

Latest Articles