AP Pegasus Issue: అబద్దాలు ప్రచారం చేస్తున్నారు.. పెగాసస్ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
AB Venkateswara Rao IPS: ఆంధ్రప్రదేశ్‌లో పెగాసస్ స్పైవేర్‌పై రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
AB Venkateswara Rao IPS: ఆంధ్రప్రదేశ్‌లో పెగాసస్ స్పైవేర్‌పై రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ సభ్యుల వినతితో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. అప్పటి టీడీపీ ప్రభుత్వం, కీలక అధికారులపై పలు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. పెగాసస్ పై ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ ఏబీ వెంకటేశ్వరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఫోన్ల గోప్యతపైనా ప్రజలకు అనేక అనుమానాలున్నాయని.. ప్రజల భయం, ఆందోళనకు తెరదించాలంటూ సూచించారు. ఈ విషయంలో తనపై వస్తున్న వార్తలు అవాస్తవమంటూ స్పష్టంచేశారు. నిజాయతీగల వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదంటూ హితవు పలికారు. పెగాసెస్ విషయంపై కొన్ని రోజులుగా మీడియాలో చర్చ జరుగుతుందని.. తనపై వ్యక్తిగత ఆరోపణలు, కథనాలు వస్తున్నాయంటూ ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దీనిపై అందరూ ఆందోళన చెందుతున్నారని.. అందుకే మీడియా ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటిలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన కాలంలో ఏం జరిగిందనే విషయాలను ప్రజలకు చెప్పాలనుకుంటున్నానన్నారు. 2019 మే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ విభాగం కూడా ‘పెగాసస్’ను కొనలేదు.. వాడలేదంటూ ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టంచేశారు. ఏ ఇతర ప్రైవేటు సంస్థలు కూడా పెగాసస్‌ను ఉపయోగించలేదన్నారు. ఎవరి ఫోన్లు కూడా ట్యాప్ కాలేదంటూ పేర్కొన్నారు. 2019 మే తర్వాత ఏం జరిగిందనే దానికి తన దగ్గర సమాచారం లేదని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అయితే.. 2021 ఆగస్టు వరకు పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనలేదని డీజీపీ కార్యాలయం ఇప్పటికే వెల్లడించిందని.. ఈ మేరకు ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చంటూ ఏబీ వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా కొనని, వాడని దాన్ని తీసుకొచ్చి తనకు ముడిపెట్టడం సరికాదంటూ పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సి రావడం తన దౌర్భాగ్యం అంటూ ఏబీ ఆవేదన వ్యక్తంచేశారు. పెగాసస్‌తో ముడిపెట్టి కొందరు తనపై పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. అవన్ని అర్ధరహితమన్నారు. 30 ఏళ్ల పాటు వృత్తి ధర్మం పాటించానని.. తన సర్వీసు మొత్తం వ్యక్తిత్వం కాపాడుకునేందుకు ప్రయత్నించానంటూ ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అసత్యాలు ప్రచారం చేస్తే ఉద్యోగులు ఎలా పనిచేస్తారంటూ ప్రశ్నించారు.
Also Read: