AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corruption: వేరుశెనగ విత్తనకాయల పంపిణీలో రూ. 33 లక్షల గోల్‌మాల్.. అసలు విషయం వెలుగులోకి రావడంతో..

Corruption: కంచే చేను మేస్తే ఎలా ఉంటుంది. కట్టడి చేయాల్సిన అధికారయంత్రాంగమే అక్రమాలకు తెగబడితే ఏమవుతుందనే దానికి నిదర్శనమే..

Corruption: వేరుశెనగ విత్తనకాయల పంపిణీలో రూ. 33 లక్షల గోల్‌మాల్.. అసలు విషయం వెలుగులోకి రావడంతో..
Groundnut Seeds
Shiva Prajapati
|

Updated on: Jul 03, 2021 | 1:25 PM

Share

Corruption: కంచే చేను మేస్తే ఎలా ఉంటుంది. కట్టడి చేయాల్సిన అధికారయంత్రాంగమే అక్రమాలకు తెగబడితే ఏమవుతుందనే దానికి నిదర్శనమే ఈ ఘటన. జిల్లాలోని వేరుశెనగ విత్తనకాయలు రాయితీ పంపిణీ వ్యవహారంలో దాదాపు 33 లక్షల రూపాయల గోల్ మాల్ జరిగింది. ప్రభుత్వ సొమ్మును లక్షలలో కాజేసేందుకు మండల అధికారి ఏఓ నాగ మధుసూధన్ పన్నాగం పన్నిన ఘటన గాలివీడు మండలంలో చర్చనీయాంశంగా మారింది. అసలు వేరుశెనగ విత్తనకాయలు పంపిణీ లో జరిగిన గోల్ మాల్ ఏంటి? ఆ విషయం వెలుగులోకి ఎలా వచ్చాయో ఓ సారి చూద్దాం..

రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై వేరుశెనగ విత్తనకాయలను పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వేరుశేనగ విత్తన కాయలను రాయితీతో గత రబీ(2020-21)లో మంజూరు చేసింది. ఏపీ సీడ్స్‌ ద్వారా జిల్లాకు వచ్చిన కాయలను జిల్లా అధికారులు అవసరానికి తగ్గట్టుగా మండలాలకు కేటాయించారు. అలా గాలివీడు మండలానికీ కూడా వేరుశెనగ విత్తనకాయలు ఇచ్చారు. రాయితీ పోను మిగిలిన డబ్బును రైతులు చెల్లిస్తే.. అక్కడున్న ఆర్బికే ఇంచార్జ్ లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సొమ్మును ఆర్బీకే ఖాతాలో జమ చేసి ఏపీ సీడ్స్‌ ఖాతాకు పంపాల్సి ఉంటుంది. కానీ రైతులు డబ్బులు ఇచ్చినప్పటికీ గత అయిదు నెలలుగా ఏపీ సీడ్స్‌కు డబ్బులు రాలేదు. గాలివీడు మండలంలోని ఆర్బీకేల్లోని ఇంచార్జ్ లకు ఏపీ సీడ్స్‌ అధికారులు వివరణ కోరగా తామెప్పుడో మండల అధికారి ఏవో నాగ మధుసుధన్ కి ఇచ్చినట్లు తెలిపారు. అలా ఇవ్వకూడదని జిల్లా అధికారులు చెప్పడంతో సిబ్బంది అవాక్కయ్యారు. అప్పటి నుంచి ఆర్బికే ఇంచార్జ్ లు మండల అధికారి నాగ మధుసూధన్‌‌ని డబ్బులు అడుగుతున్నా పట్టించుకోకపోవడంతో ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. దాంతో వారు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

గాలివీడు మండలంలో 15 ఆర్బీకేలు ఉన్నాయి. అందులో అధిక కేంద్రాల నుంచి రైతులు చెల్లించిన సొమ్మును నేరుగా ఆర్బీకే ఖాతాలో జమ చేసి ఏపీ సీడ్స్‌ ఖాతాకు పంపాలి. కానీ మండల అధికారి మాత్రం తన ఖాతాలో వేసుకుంటున్నట్లు ఆర్బికే ఇంచార్జ్ చెబుతున్నారు. మొత్తం రూ.33 లక్షలు ఏపీ సీడ్స్‌కు వసూలు కావాల్సి ఉంది. అదంతా గాలివీడు మండల అధికారి మధుసూధన్ ఖాతాలోకి వెళ్ళిపోవడంతో ఆర్బికే ఇంచార్జ్ లు ఉన్నత అధికారులకు విషయం చెప్పారు. ఉన్నత అధికారులు విచారణకి ఆదేశించారు. ఈ క్రమంలోనే 5 లక్షల రూపాయల డబ్బును మధుసుధన్ నుంచి రికవరీ చేసుకున్నారు. ఇక మిగితా 28 లక్షల రూపాయల ఇవ్వకపోవడంతో వ్యవసాయ శాఖ జెడి మురళి కృష్ణ నోటీసులు జారీ చేశారు.

గాలివీడు మండలంలోని వేరుశెనగ విత్తనాలు రాయితీ పంపిణీ గోల్ మాల్ విషయంలో వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ ని వివరణ అడగగా.. గాలివీడు మండలంలో వేరుసెనగ విత్తన కాయల పంపిణీ 5 నెలల క్రితం జరిగిందన్నారు. దానికి సంబంధించి రైతులు ఇచ్చిన డబ్బును ప్రభుత్వ ఖాతాలో వేయకుండా 33 లక్షల రూపాయలు సొమ్మును మండల అధికారి ఏవో నాగ మధుసుధన్ వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. డబ్బులు తిరిగి చెల్లించాలని పలుమార్లు చెప్పినా స్పందించకపోవడంతో నోటీసులు జారీ చేశామన్నారు. ప్రస్తుతం రూ. 5 లక్షలు రికవరీ చేశామని, మిగతావి కూడా త్వరలోనే రికవరీ చేసి.. మండల అధికారి పై చర్యలు తీసుకుంటామని జేడీ మురళీ కృష్ణ చెప్పారు.

గాలివీడు మండలానికి సంబంధించి రభి(2020-2021) సీజన్ కు గాను సీడ్ వీలేజ్ ప్రాజెక్ట్ క్రింద వేరుశెనగ విత్తనకాయలు14 రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు విత్తనకాయలను ప్రభుత్వం కేటాయించిన సబ్సిడీ ధరలకే అందించామని ఆర్బికే ఇన్‌చార్జ్‌లు తెలిపారు. అయితే, రైతులు ఇచ్చిన డబ్బుల విషయంలో మండల వ్యవసాయ అధికారి నాగ మధుసూదన్ తాను చెప్పినట్లు వినాలని, సీడ్స్ తన పేరు మిద రావడం జరిగింది కాబట్టి రైతుల ద్వారా వచ్చిన డబ్బులను తన చేతికే ఇవ్వాలని చెప్పినట్లు ఆర్బికే ఇన్‌చార్జ్‌ లు పేర్కొన్నారు. అయితే ఇటువంటి సమస్యలు ఏమైనా వస్తాయనే ఉద్దేశంతోనే ముందుగానే మండల అధికారికి డబ్బులు చెల్లించినట్లు రిసిప్ట్‌లు కుడా తీసుకున్నామన్నారు. కొంతమంది రిషిప్ట్‌లు కూడా ఇవ్వలేదని, తమపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆర్బికే ఇన్‌చార్జ్‌లు వాపోతున్నారు.

సేరి సురేష్, కడప, టీవీ9 రిపోర్టర్.

Also read:

Chicken Manchurian Recipe: ఇంట్లోనే ఈజీగా బోన్ లెస్ చికెన్ తో రెస్టారెంట్ స్టైల్ లో మంచూరియా తయారీ విధానం ఎలా అంటే

Covid-19 vaccine: రెండు డోసులు తీసుకుంటే.. మృత్యు ప్రమాదం తప్పినట్లే.. అధ్యయనంలో కీలక విషయాలు..

Road Stolen: ఇదేం వింత కేసు! మా ఊరిలో రోడ్డు పోయిందంటూ గ్రామస్తుల ఫిర్యాదు.. ఎక్కడంటే?