Gannavaram Politics: ఒకే పార్టీనేతల మధ్య వర్గ పోరు.. వంశీ, యార్లగడ్డ వర్గీయుల మధ్య ఆగని మాటల యుద్ధం..
గన్నవరానికి సిట్టింగ్ ఎంఎల్ఏ వంశీ ఉంటారని.. ఆయనకు సపోర్టు చేయాల్సిందే అని సీఎం జగన్చే స్పష్టం చేశారు. అటు యార్లగడ్డ వర్గీయులు, ఇటు వంశీ వర్గీయులు కూడా ఈ అంశం పెద్దగా పట్టించుకోలేదన్నది శుక్రవారం జరిగిన ఘర్షణతో స్పష్టమైంది.
Gannavaram Politics: విజయవాడ వేదికగా మళ్ళీఒకే పార్టీకి చెందిన రాజకీయ నేతల మధ్య విబేధాలు మళ్లీ భగ్గుమన్నాయి. గన్నవరం మరోసారి గరం గరంగా మారింది… ఇటీవల సర్దుమణిగాయనుకున్న వర్గ విబేధాలు మరోసారి పొడచూపాయి.. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా జరిగిన ఉత్సవంలో వంశీ వర్గీయులకు, యార్లగడ్డ వర్గీయులకు మధ్య చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.. సీఎం జగన్ గన్నవరం సిట్టింగ్ ఎంఎల్ఏ వంశీ కి సపోర్టు చేయాలని చెప్పినా.. నియోజకవర్గ స్ధాయిలో ఇంకా ఆ ముసలం అలాగే కొనసాగుతోందా.. ఎందుకు ఇంకా గన్నవరం వేడి చల్లారలేదు.. సరిగా యార్లగడ్డ హైదరాబాదు పయనమయ్యాకే గొడవ ఎందుకు జరిగింది.. గన్నవరంలో మరోసారి హీటెక్కిన రాజకీయంపై ఈరోజు తెలుసుకుందాం..
గన్నవరం రాజకీయం విషయంలో ఇటీవల ఇరువర్గాల మాటల యుద్దం చేసుకున్నారు. అయితే.. గన్నవరానికి సిట్టింగ్ ఎంఎల్ఏ వంశీ ఉంటారని.. ఆయనకు సపోర్టు చేయాల్సిందే అని సీఎం జగన్చే స్పష్టం చేశారు. అటు యార్లగడ్డ వర్గీయులు, ఇటు వంశీ వర్గీయులు కూడా ఈ అంశం పెద్దగా పట్టించుకోలేదన్నది శుక్రవారం జరిగిన ఘర్షణతో స్పష్టమైంది. అయితే ఇంకా ఎందుకు కార్యకర్తల స్ధాయిలో సర్దుమణగలేదు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది.. సదరు నేతలే కార్యకర్తల స్ధాయిలో విబేధాలు కంటిన్యూ చేస్తున్నారా.. లేక.. కార్యకర్తలకు తమ నాయకుడు సర్దుకొని పోవడం నచ్చలేదా.. అనేది తేలాల్సి ఉంది.. అంత పెద్ద ఉత్సవంలో ఎంఎల్ఏ లేకపోవడం కారణంగానే ముగ్గురు మాత్రమే పోలీసులను బందోబస్తుకు పంపడం కూడా విమర్శలకు తావిస్తోంది. అసలే గన్నవరం అందునా రెండు వర్గాలు ఒకేచోట కలిసే ఉత్సవం.. పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందనేది బాహాటంగా వినిపిస్తున్న విమర్శ.
సాయంత్రం నాలుగు గంటల తరువాత ఉత్సవం ప్రాంభించిన వెంటనే యార్లగడ్డ హైదరాబాదు వెళ్ళిపోయారు. యార్లగడ్డ ఉన్నంతసేపు మిన్నకుండిపోయిన కార్యకర్తలు.. యార్లగడ్డ అటు వెళ్ళగానే ఇటు వంశీ వర్గంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. అయితే ఎంత మాట్లాడినా.. వంశీ సైతం హైదరాబాదులో ఉండటంతో వంశీ వర్గం కొంత సంయమనంతో ఉన్నారనే చెప్పాలి.. హైవే పై ఉన్న వంశీ కార్యాలయం వద్దకు ఉత్సవం రాగానే కార్యాలయం లోకి వెళ్ళిన కార్యకర్తలను.. యార్లగడ్డ వర్గీయులు మరోసారి మాటలతో రెచ్చగొట్టారని వంశీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయితే యార్లగడ్డ వర్గీయులపై ఎక్కువగా దాడి జరిగిందని.. వంశీ వర్గీయులే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారని యార్టగడ్డ వర్గం ఆరోపిస్తున్నారు.
ఒకరిపై ఒకరు కర్రలతో, రాళ్ళతో దాడి చేసుకున్నారు.. ఈ దాడిలో రక్తాలు కారేలా కొట్టుకున్నారు. వంశీ వర్గానికి చెందిన మహేష్ అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయం కావడంతో ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. గాయాలైన వారందరికి చికిత్స అందిస్తున్నారు.. మహేష్ ఇచ్చిన కంప్లైంట్ తో యార్లగడ్డ వర్గీయులపై కేసు నమోదు చేసారు. అయితే అసలు నేతలు అందుబాటులో లేకపోయినా ఇలా విబేధాలు తారాస్ధాయికి చేరడం.. ఆకతాయిగా మాట్లాడుతూ.. పెద్ద గొడవగా మారడం చూస్తే ఇంకా గన్నవరంలో ఆ గరం గరం వాతావారణం చల్లారలేదనే తెలుస్తుంది. పోస్టు కోవిడ్ రికవరీ కోసం వల్లభనేని వంశీ హైదరాబాదుకే పరిమితం కావడం.. ఉత్సవం ప్రారంభించిన యార్లగడ్డ వెంటనే హైదరాబాడు వెళ్ళిపోవడంతో కార్యకర్తల గొడవ సర్దుమణిగేలా చేయడం పోలీసులకు తలనొప్పిగానే మారింది.
ఏదేమైనా… గన్నవరంలో వర్గవిబేధాలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయనడానికి నిన్నటి గొడవే తార్కాణంగా కనిపిస్తుండటంతో.. అటు నియోజకవర్గ నేతలు.. ఇటు పార్ఠీ అధిష్ఠానం ఎలా రియాక్టవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..