Udaya Krishna Reddy : కానిస్టేబుల్ టూ IPS.. మనుష్యులందు నీ కధ… మహర్షిలాగ సాగదా..
పట్టుదల అతని ఆశయాన్ని నెరవేర్చింది... మెరైన్ కానిస్టేబుల్‌గా ఉన్న సమయంలో పై అధికారి అవమానించాడన్న కసితో ఉద్యోగానికి రాజీనామా చేసి UPSC పరీక్షలు రాసి IPS అయ్యాడు. చిన్నతనంలో తల్లిని కోల్పయిన అతనికి యుక్తవయస్సు వచ్చే సమయానికి తండ్రి కూడా చనిపోవడంతో నాయనమ్మ దగ్గరే పెరిగాడు. కూరగాయలు అమ్ముకుంటూ వచ్చే డబ్బుతోనే చదువుకుంటూ తొలి ప్రయత్నంలోనే మెరైన కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు.. ఉద్యోగం చేస్తున్నాడన్న మాటేకాని పై అధికారుల చివాట్లూ, ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న అవమానకర చర్యలతో విసిగిపోయాడు. ఇంట్లో చెప్పకుండానే కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లో UPSC పరీక్షలు రాసేందుకు వెళ్ళాడు. పలుమార్లు ప్రయత్నించిన అనంతరం తను కలలు కన్న ఐపియస్ సాధించి ఇంటికొచ్చాడు... కుటుంబానికి, ఊరికి వన్నె తెచ్చాడు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్‌కృష్ణారెడ్డిది పేద కుటుంబం. తల్లిదండ్రులను కోల్పోయిన కృష్ణారెడ్డిని, అతని తమ్ముడ్ని.. నాయనమ్మ చేరదీసింది. కృష్ణారెడ్డి తొలుత డాక్టర్ కావాలని కలలు కన్నాడు… అయితే ఆ ప్రయత్నం దిశగా తన చదువు సాగకపోవడంతో డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు… మెరైన్ కానిస్టేబుల్‌గా బదిలీ అయి ఉద్యోగం చేస్తున్న సమయంలో మెరైన్ సీఐ ఒకరు తనను ఉద్దేశ్యపూర్వకంగా సిబ్బంది ముందు అవమానిస్తున్నారన్న మనస్థాపంతో తాను కూడా పెద్ద ఆఫీసర్ కావాలని పట్టుదల పెంచుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఉద్యోగానికి రాజీనామా చేసి ఐపియస్ అయ్యేందుకు అవసరమైన యుపియస్‌సి పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు… వరుసగా మూడుసార్లు విఫలమైనా మొక్కవోని దీక్షతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు… నాలుగో ప్రయత్నంలో 780వ ర్యాంకు వచ్చింది… చివరకు ఐదో ప్రయత్నంలో 350వ ర్యాంకు రావడంతో ఐపియస్‌కు సెలెక్ట్ అయ్యాడు.
ఐపియస్ ప్రస్ధానం ఇలా…
కృష్ణారెడ్డి 2019లో తొలిసారి సివిల్స్ పరీక్షలు రాశాడు… తొలి ప్రయత్నంలో ఇంటర్వూ వరకు వెళ్లి ఆగిపోయాడు… 2020లో కరోనా కారణంగా పరీక్షలు రాయలేక పోయాడు… ఆ తరువాత వరుసగా 2021, 2022లో పరీక్షలు రాసినా ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు… అంతే ఇక కసి పెరిగింది… పూర్తిగా సమయం అంతా చదువుకే కేటాయించి 2023లో నాలుగో ప్రయత్నంలో 780వ ర్యాంకు సాధించి ఇండియన్ రైల్వేస్ మేనేజ్‌మెంట్ సర్వీసులో ఉద్యోగం సాధించాడు… అయినా సంతృప్తి చెందలేదు… తాను కలలు కన్న ఐపియస్ సాధించేందుకు ఐదో ప్రయత్నంలో 350 ర్యాంకు రావడంతో ఐపియస్ అయ్యాడు.
అభినందించిన సీఎం…
ఉదయ్‌కృష్ణారెడ్డి విజయ ప్రస్థానాన్ని తెలుసుకున్న ఏపీ సీెం చంద్రబాబు అభినందిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు… సాధారణ కానిస్టేబుల్ నుంచి జిల్లా అత్యున్నత పోలీసు పదవి ఐపియస్ సాధించడాన్ని ప్రస్తావిస్తూ కొనియాడారు… ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలవీరాంజనేయస్వామి తన సొంత నియోజకవర్గం నుంచి ఐపియస్‌కు ఎంపికైన మాజీ కానిస్బేబుల్ కృష్ణారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
Udayakrishna Reddy's journey from Constable to IPS officer proves that no dream is too big when backed by courage and relentless hard work. His story reminds us that determination can break every barrier and script new destinies. The future belongs to those who never give up.…
— N Chandrababu Naidu (@ncbn) April 29, 2025
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




