Telangana: ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది.. దెబ్బకు రాత్రికి రాత్రే రూ. 30 లక్షలు మాయం
నిజామాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి చోరీకి ప్రయత్నం చేసే క్రమంలో కొంత డబ్బు కాలి బూడిదగా మారింది. చోరీకి ముందు ఐదుగురు ముఠా సభ్యులు ఏటీఎంల వద్ద రిక్కి నిర్వహించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మొత్తం 30 లక్షల వరకు నగదు అపహరణ జరిగినట్లు పోలీసు కార్యాలయం ప్రకటించింది.

నిజామాబాద్ నగరంలో ఒకేరోజు రెండు ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. యంత్రాలు తెరుచుకోకపోవడంతో దుండగులు వాటిని గ్యాస్ కట్టర్‌లతో తెరిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏటీఎం యంత్రాలు దగ్ధం అయ్యాయి. నగరంలోని సాయి నగర్ ఎస్బీఐ ఏటీఎంలో సుమారు మూడు గంటల ప్రాంతంలో దొంగలు చొరబడ్డారు. మిషన్‌లో నగదు తీసే ప్రయత్నం చేశారు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి నగదు చోరీ చేశారు. ఈక్రమంలో నగదు కొంత కాలి బూడిద అయింది. ఈ ఘటన సమయంలో ఏటీఎంలో 10 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చోరీకి ముందు దుండగులు రిక్కి నిర్వహించిన దృశ్యాలు సిసిటీవీలో రికార్డు అయ్యాయి.
మరోవైపు నగరంలోని ఆర్యనగర్ డీసీబీ బ్యాంక్ ఏటీఎంలో కూడా ఇదే తరహాలో దొంగతనం జరిగింది. ఇందులో 27 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చోరీ జరిగిన రెండు ప్రదేశాలను ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర పరిశీలించారు. రెండింట్లో కలిపి 30 లక్షల వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. మహారాష్టకు చెందిన ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. దొంగల ముఠాను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చోరీ జరిగిన తర్వాత దొంగల ముఠా.. కారులో వెళ్లిన ప్రాంతాల పోలీసులను అలెర్ట్ చేశారు. క్లూస్ టీంతో దర్యాప్తు జరిపారు. చోరీకి పాల్పడ్డ దొంగల ముఠాను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
