Vijayawada: తొలిసారి ఓ మహిళను నగర బహిష్కరణ చేసిన బెజవాడ పోలీసులు.. ఎందుకో తెల్సా..?
కుర్రాళ్లు గంజాయి మత్తులో పడి బంగారంలాంటి భవిష్కత్‌ను పాడు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో విజయవాడలో గంజాయి వినియోగం విపరీతంగా పెరిగింది. సరుకు ఎక్కడ పడితే అక్కడ విరివిగా దొరకుతుంది. దీంతో బెజవాడ పోలీసులు సీరియస్ ఫోకస్ పెట్టారు.
నగర బహిష్కరణ. ఈమాట తరచూ వింటూనే ఉంటాం. రౌడీషీటర్లు, అసాంఘీక శక్తులకు చెక్ పెట్టేందుకు పోలీసులు ఈ అస్త్రాన్ని వాడుతుంటారు. బెజవాడలో తొలిసారిగా ఓ లేడీ కిలాడీకి ఇలాంటి నగర బహిష్కరణ శిక్ష విధించారు. పైన ఫోటోలో ఉన్న మహిళ పేరు సారమ్మ అలియాస్ శారద. పేరు సాఫ్ట్‌గానే ఉన్నా ఈవిడ మాత్రం ఖతర్నాక్. పోలీసుల కళ్లుగప్పి దందాలు చేయడంలో దిట్ట. ఇప్పటికే సారమ్మపై అజిత్‌సింగ్ నగర్ పీఎస్‌లో 13 కేసులున్నాయి. గంజాయి అమ్మడం మొదలు చాలా వివాదాల్లో ఈమె ప్రమేయం ఉంది.
ఎన్నిసార్లు హెచ్చరించినా, కేసులు పెట్టినా తీరు మారకపోవడంతో చివరికి నగర బహిష్కరణే మార్గమని భావించిన పోలీసులు అదే నిర్ణయాన్ని అమలు చేశారు. ఈమెతోపాటు 19 మందిని సిటీ నుంచి బహిష్కరించారు. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న గంజాయి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు ఈ నగర బహిష్కరణ అస్త్రాన్ని బయటకు తీశారు.
మరోసారి వీళ్లు గంజాయి కేసుల్లో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని సీపీ క్రాంతి రాణా టాటా వార్నింగ్ ఇచ్చారు. నగర బహిష్కరణకు గురైన వారిలో సారమ్మ అనే మహిళ ఉండడం.. తొలిసారిగా ఓ మహిళపై సీరియస్ యాక్షన్ ఉండడం చర్చనీయాంశమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..