Tirupati: ఈజీ మనీ కోసం యూట్యూబ్ చూసి దొంగనోట్ల ముద్రణ.. పోలీసుల ఎంట్రీతో..
తిరుపతి జిల్లాలో దొంగ నోట్ల ముద్రణ వెలుగు చూసింది. గత కొంత కాలంగా తిరుపతి చెర్లోపల్లి సర్కిల్ లోని ఒక ఇంట్లో ఫేక్ నోట్స్ ప్రింటింగ్ జరుగుతున్నట్లు తేలిపోయింది. పుత్తూరులో వెలుగు చూసిన ఫేక్ కరెన్సీ వ్యవహారం ఈ దందాను బయట పెట్టింది.
తిరుపతి జిల్లాలోని పుత్తూరులో పలు దుకాణాల్లో ఫేక్ కరెన్సీ చలామణి అయినట్లు గుర్తించిన పోలీసులు కూపీ లాగడంతో బయట కొచ్చింది. నకిలీ నోట్లను కరెన్సీ కౌంటింగ్ మిషన్ గుర్తించింది. పుత్తూరు లో పలు దుకాణాల్లో నొట్ల లెక్కింపు సమయంలో దొంగ నోట్లను షాప్ యజమానులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయా దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ పుట్టేజీ ఆధారంగా దొంగ నోట్లు చలామణి చేసిన వారిని పోలీసులు గుర్తించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు తిరుపతి లోని చెర్లోపల్లి సర్కిల్ లో నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్లు గుర్తించారు.
చెర్లోపల్లిలో ఉంటున్న రమేష్ ఇంట్లో ఫేక్ కరెన్సీ ముద్రించినట్లు నిర్ధారించుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముని కృష్ణారావు సహకారం తో దొంగ నోట్ల ను ముద్రించింది రమేష్ ఫ్యామిలీ. షేర్ మార్కెట్ లో నష్టాలను చవి చూసిన రమేష్, ముని కృష్ణారావు సహకారంతో ఈజీ మనీ కోసం ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే యూట్యూబ్ లో చూసి దొంగ నోట్లు ముద్రించారు.
ముని కృష్ణారావు తోపాటు రమేష్ అతని భార్య సంధ్య కుమార్తె ఇషా దొంగ నోట్ల ముద్రణకు కావలసిన వస్తువులను ఇంట్లోనే సమకూర్చుకుని ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేసినట్లు పోలీసులు తేల్చారు. తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు, రేణిగుంట ప్రాంతాల్లో వస్తువులను కొనుగోలు చేస్తూ దొంగ నోట్ల మార్పిడికి ముఠా పాల్పడింది. ఫేక్ కరెన్సీ ముద్రిస్తున్న చెర్లోపల్లి లో నివాసం ఉంటున్న ఇంట్లో దాడులు నిర్వహించిన పోలీసులు దొంగ నోట్ల ముద్రణకు అవసరమైన వస్తువులు, ప్రింటర్లు, లామినేషన్ యంత్రం, స్క్రీన్ ప్రింటింగ్, కలర్ లిక్విడ్స్, కట్ చేయడానికి సిద్ధంగా ఉన్న దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ కరెన్సీ ముఠా లోని నలుగురిని అరెస్టు చేసిన పుత్తూరు పోలీసులు ముఠాను రిమాండ్ కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..