AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఎన్ని ప్రభుత్వాలు మారినా మారని ఏజెన్సీవాసుల తలరాత.. భార్య మృతదేహాన్ని బైక్, డోలి పై స్వగ్రామం తరలించిన భర్త

గంగన్న కుమారుడు చికిత్స పొందుతూనే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలోనే మృతి చెందాడు. కుమారుడు మృతి విషయం తెలుసుకున్న తల్లి గంగమ్మ తీవ్ర మనస్థాపానికి గురై ఆమె కూడా అనారోగ్యానికి గురైంది. దీంతో వెంటనే గంగన్న తన భార్యను తీసుకొని డోలి సహాయంతోనే చిట్టెంపాడు నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు చేర్చి అక్కడ నుండి విశాఖ ఆసుపత్రికి తరలించారు. గంగమ్మ కూడా చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మరణించింది.

Andhra Pradesh: ఎన్ని ప్రభుత్వాలు మారినా మారని ఏజెన్సీవాసుల తలరాత.. భార్య మృతదేహాన్ని బైక్, డోలి పై స్వగ్రామం తరలించిన భర్త
Dead In Doli
Gamidi Koteswara Rao
| Edited By: Surya Kala|

Updated on: Jan 17, 2024 | 3:33 PM

Share

విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భార్య మృతదేహాన్ని భర్త కొంతమేర బైక్ పై, మరి కొంత దూరం డోలిలో స్వగ్రామానికి తరలించిన హృదయ విధార ఘటన అందరినీ కలిచివేస్తుంది. ఎస్ కోట మండలం చిట్టెంపాడుకి చెందిన మాదల గంగన్న, గంగమ్మ లకు ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. అకస్మాత్తుగా వారి కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం స్వగ్రామం చిట్టెంపాడు గిరిశిఖర గ్రామం నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు రహదారి సౌకర్యం లేకపోవడంతో అతి కష్టం మీద కుమారుడిని డోలిలో క్రిందకి చేర్చి అక్కడ నుండి విశాఖ ఆస్పత్రికి తరలించారు. అయితే గంగన్న కుమారుడు చికిత్స పొందుతూనే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలోనే మృతి చెందాడు. కుమారుడు మృతి విషయం తెలుసుకున్న తల్లి గంగమ్మ తీవ్ర మనస్థాపానికి గురై ఆమె కూడా అనారోగ్యానికి గురైంది. దీంతో వెంటనే గంగన్న తన భార్యను తీసుకొని డోలి సహాయంతోనే చిట్టెంపాడు నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు చేర్చి అక్కడ నుండి విశాఖ ఆసుపత్రికి తరలించారు.

గంగమ్మ కూడా చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మరణించింది. వారం రోజుల వ్యవధిలో భార్యతో పాటు ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందటంతో కన్నీరు మున్నీరుగా రోదించాడు గంగన్న. ఇక చేసేదిలేక గంగమ్మ మృతదేహాన్ని విశాఖ ప్రైవేట్ ఆస్పత్రి నుండి స్వగ్రామానికి తరలించేందుకు సిద్ధమయ్యాడు. అందుకోసం ఎస్ కోట వరకు ఆటోలో తీసుకెళ్ళాడు. అలా మృతదేహాన్ని ఎస్ కోటలో దించి అక్కడ నుండి ఆటో డ్రైవర్ వెనుతిరిగాడు. అయితే ఎస్ కోట నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు మరో ఆటోలో తరలించేందుకు గంగన్న వద్ద డబ్బులు లేవు. దీంతో స్నేహితుడి బైక్ పైనే కూర్చోబెట్టి నానా అవస్థలు పడుతూ కొండ దిగువన ఉన్న దబ్బగుంటకి మృతదేహాన్ని తరలించాడు.

ఇవి కూడా చదవండి

అనంతరం అక్కడ నుండి కొండ మీద ఉన్న తన స్వగ్రామమైన చిట్టెంపాడుకి డోలి సహాయంతోనే సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర రాళ్లు రప్పల మధ్య అనేక అగచాట్లు పడి భార్య గంగమ్మ మృతదేహాన్ని ఇంటికి తరలించాడు. గంగన్న కష్టాన్ని చూసిన స్థానికులకు ఏడుపు ఆగలేదు. గంగన్న భార్య మృతదేహాన్ని బైక్ పై తరలిస్తుంటే స్థానికులందరూ ప్రేక్షక పాత్ర పోషించారే తప్పా ఏ ఒక్కరూ మానవత్వంతో సహాయం చేసేందుకు ముందుకు రాలేదు.

అయితే దశాబ్దాలుగా చిట్టెంపాడుకు రహదారి మార్గం లేకపోవడంతో సమయానుకూలంగా చికిత్స అందించలేక అనేకమంది మృత్యువాత పడ్డారని చెప్తున్నారు గ్రామస్తులు. ప్రస్తుతానికి గంగమ్మ అలాగే గంగమ్మ కుమారుడు కూడా సకాలంలో చికిత్స అందకే మృతి చెందారని చెబుతున్నారు స్థానికులు. ప్రస్తుతం గంగమ్మ మృతదేహాన్ని బైక్ తో పాటు డోలి పై స్వగ్రామానికి తరలించిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..