Tiger Sightings: ఆ ప్రాంతవాసులను వణికిస్తున్న పెద్దపులి సంచారం.. బీకేర్‌ఫుల్.. కంట పడ్డారో..
ఏలూరు జిల్లా ఏజెన్సీలో పెద్దపులి సంచారం స్థానికుల కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. నిత్యం జనాలకు చెందిన పశువులపై దాడి చేస్తూ వాటిని హతమార్చుతుంది. ఇప్పటికే 5 ఆవులపై వరుసగా దాడి చేసి చంపేయడంతో భయంతో వణికిపోతున్నారు స్థానికులు. ఏ క్షణాన ఎటువైపు వచ్చి దాడి చేస్తుందోనని పోలాని వెళ్లాలంటే భయపడి ఇంట్లోనే గడుపుతున్నారు.

ఏలూరు జిల్లా ఏజిన్సీ ప్రాంతాలను పెద్దపులి సంచారం కలవర పెడుతుంది. రోజూ ఏదో ఒక పశువుల మందపై దాడి చేస్తూ మూగజీవాలను పీక్కు తింటుంది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులకు పులి కదలికలను గుర్తించేందుకు స్థానికంగా కెమెరాలను అమర్చారు. కెమెరాకు చిక్కిన చిత్రాల ఆధారంగా బుట్టాయగూడెం మండలం పందిరిమామిడి గూడెం, కామవరం, గుబ్బల మంగమ్మ గుడి దారి లోని అంతర్వేదిగూడెం, నాగులగూడెం ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో స్థానిక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా తిరగాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇప్పటికే ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలతో పాటు పాదముద్రల సహాయంతో పులి కదలికలను ఫారెస్ట్ అధికారులు గమనిస్తున్నారు. ఈ పులి తెలంగాణా పరిధిలోని కావడి గుడ్ల నుంచి ఏపీలోకి ప్రవేశించిందని అధికారులు భావిస్తున్నారు. ఆపులి వచ్చిన మార్గంలో తిరిగి వెనక్కు వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పులి పందిరిమామిడి గూడెం , ఇనుమూరు , గాడిదబోరు , అంతర్వేదిగూడెం పరిసరగ్రామాల పరిధిలో తిరుగుతుందన్నారు.
అందుకే రాత్రి పూట ఒంటరిగా తిరగవద్దని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. స్థానికులకు ఎక్కడైనా పులి కదలికలు కనిపిస్తే వెంటనే ఈ నెంబర్‌లకు 9505499141, 9440810223,9550902333, 9908880327 లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. పులి భయంతో అడవిలోకి పుల్లలకోసం వెళ్లాలన్నా , వ్యవసాయ పనులకు పోవాలన్నా భయం కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
