AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: చోర కళను ప్రదర్శిస్తూనే భక్తిని చాటుకున్న దొంగలు – ఏం చేశారంటే..?

తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలంలో జరిగిన చోరీ కేసులో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూసాయి. కేవీబీ పురం మండలం ఆరె గ్రామంలో ఒక ఇంటిని కొల్లగొట్టిన దొంగలు దైవభక్తిని కూడా చాటుకోవడం విశేషం. దేవుడి పట్ల భయం, భక్తి ఉందని ఈ దొంగలు సైతం నిరూపించారు. ఇంటికి తాళాలు వేసి ఈనెల 23న షిర్డీ యాత్రకు వెళ్లిన టిడిపి నేత ప్రకాష్ రావు ఇంట్లో ఈ నెల 25 రాత్రి చోరీ జరిగింది. బీరువాలో భద్రపరిచిన 125 సవర్ల బంగారు ఆభరణాలు, 5 కేజీల వరకు వెండి, రూ. 10 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు.. తమ చోరకళతో పాటు భక్తిని కూడా చాటి వెళ్లడం కూడా విశేషం.

Tirupati: చోర కళను ప్రదర్శిస్తూనే భక్తిని చాటుకున్న దొంగలు - ఏం చేశారంటే..?
Theft In A Home
Raju M P R
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 28, 2025 | 11:35 AM

Share

కేవీబీ పురం మండలం ఆరె గ్రామంలో ఉంటున్న ప్రకాష్‌రావు, శ్రీదేవి దంపతులు షిర్డీ వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రకాష్‌రావు, శ్రీదేవి షిర్డీకి వెళ్లారు. కాగా లండన్‌లో ఉండే ఈ దంపతుల కొడుకు, కోడలు నెల రోజుల కిందట సొంతూరు వచ్చారు. కోడలు సొంత చెల్లెలకు పెళ్లి జరుగుతుండడంతో పెళ్లి కోసం చెన్నైలోని ఒక బ్యాంకు లాకర్ నుంచి బంగారు నగలను ప్రకాష్ రావు ఇంటికి తెచ్చి పెట్టారు. పెళ్లి అయ్యాక కొడుకు, కోడలు లండన్ వెళ్ళిపోగా ప్రకాష్ రావు, శ్రీదేవి తిరిగి బంగారు నగలను బ్యాంకు లాకర్ లో పెట్టకుండానే దైవదర్శనం కోసం షిర్డికి వెళ్లిపోయారు. బంగారు నగలను తిరిగి బ్యాంక్ లాకర్‌‌లో పెట్టాలనుకున్నా ఆరోగ్యం సహకరించక పోవడంతో ఇంట్లోనే ఉంచారు. అయితే రెండు నెలల క్రితమే షిర్డీ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రకాష్‌రావు, శ్రీదేవి దంపతులు షిర్డీకి వెళ్లగా.. వారు అక్కడ ఉండగానే ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి గేటు తాళాలు పగలగొట్టి మెయిన్ డోర్‌ను బ్రేక్ చేసిన దొంగలు ఇంట్లోకి వెళ్ళి బీరువాలు, కబోర్డ్స్‌లో భద్రపరిచిన నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయం ప్రకాష్‌ రావు తమ్ముడు యుగంధర్‌ నాయుడు ఇంటికి వెళ్లి చూడటంతో తెలిసింది. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడటంతో దొంగలు పడ్డారని అర్థమైంది. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీం సాయంతో ఆధారాలు సేకరించారు.

ఇంట్లో అణువణువు గాలించి.. అన్ని గాలించిన దొంగలు.. పూజగదిలో ఉన్న విలువైన వస్తువులను మాత్రం తాకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. పూజ రూమ్‌లోని వినాయకుడు, వెంకటేశ్వరుడు, లక్ష్మీ అమ్మవార్ల వెండి చిత్రపటాలను మాత్రం తాకకుండా.. వెండితో తయారు చేసిన పూజా సామాగ్రిని మాత్రం దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగతనానికి వచ్చిన దొంగల ముఠా ఇలా పూజా గదిలో ఉన్న దేవుడి విగ్రహాలను వదిలి వెళ్ళడంతో పోలీసులు అవాక్కయ్యరు. దొంగలకు దైవభక్తి కూడా ఎక్కువగానే ఉందనుకున్నారు.

అప్పటికే కావాల్సిన అంత బంగారు నగలు, నగదు దొంగలకు దొరికిందనుకున్నారెమో గానీ ఇంట్లో మరో బెడ్ రూమ్‌లో దాచి ఉంచిన 5 కిలోల వెండిని గుర్తించకుండానే దొంగలు వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే ప్రకాష్ రావు దంపతులు షిరిడి నుంచి సొంతూరు కు చేరుకున్నారు. ఈ మేరకు ప్రకాష్ రావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. గ్రామంలో ఎక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు ఎవరన్న దానిపై నిఘా పెట్టారు. ఇది తెలిసిన వారి పనే అయి ఉంటుందని ప్రకాష్ రావు పోలీసులకు చెప్పడంతో దొంగతనం కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..