Cyclone Ditwa: ముంచుకొస్తున్న ముప్పు.. ఏపీ, తమిళనాడుకు రెడ్ అలర్ట్.. శ్రీలంకలో 50మంది మృతి..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం దిట్వా తుఫానుగా మారి భారత్ వైపు దూసుకొస్తుంది. శ్రీలంకలో బీభత్సం సృష్టించిన ఈ తుఫాను, నవంబర్ 30న తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకే అవకాశం ఉంది. వాతావరణ శాఖ భారీ వర్షాల నేపథ్యంలో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దిత్వా తుఫానుగా మారి వేగంగా తీరాల వైపు కదులుతోంది. ఈ తుఫాను శ్రీలంకలో బీభత్సం సృష్టించింది. తుఫాన్ వల్ల 50 మందికి పైగా మరణించగా.. అనేక మంది గల్లంతయ్యారు. ఇప్పుడిది భారత్‌వైపు దూసుకొస్తుంది. ఈ తుఫాను నవంబర్ 30 తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ నివేదిక ప్రకారం.. దిత్వా తుఫాను గత 6 గంటల్లో గంటకు 7 కి.మీ. వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోంది.
భారీ వర్షాల హెచ్చరికలు
తుఫాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. నవంబర్ 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి తీరప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నవంబర్ 29 నుండి డిసెంబర్ 1 వరకు ఏపీ, యానాం, రాయలసీమ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నవంబర్ 30న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, తీరప్రాంత రాయలసీమలో అతి భారీ వర్షాలు ఉంటాయి. కేరళలో 29న భారీ వర్షాలు, అలాగే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 29, 30న ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రెడ్ – ఆరెంజ్ అలర్ట్
భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. పుదుచ్చేరి, కడలూరు, మైలాడుతురై, విల్లుపురం, చెంగల్‌పట్టు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా నవంబర్ 30న తమిళనాడు, ఏపీకి రెడ్ అలర్ట్ ఇష్యూ చేశారు. ఏపీలోని తిరుపతి, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తమిళనాడు, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, రాణిపేట్ తదితర జిల్లాలు, కారైకల్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు శ్రీలంక ఎదుర్కొంటున్న ఈ సంక్షోభ సమయంలో మానవతా సహాయం అందించడానికి భారత్ ముందుకొచ్చింది. ఆపరేషన్ సాగర్ బంధును ప్రారంభించింది.
విమాన సేవలకు అంతరాయం
ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో నవంబర్ 29న వెళ్లా్ల్సిన అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ తమ విమాన సేవలకు అంతరాయాలు ఏర్పడవచ్చని హెచ్చరించింది. దిట్వా తుఫాను కారణంగా దక్షిణ రైల్వే నవంబర్ 28, 29 తేదీలలో పలు రైళ్లను రద్దు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
