లుంగీలు కావాలని షాపుకొచ్చాడు.. సీన్ కట్ చేస్తే.. ఫోన్‌పే చేస్తానని చెప్పి.!
ఎక్కడో ఉండి మన ఖాతాల్లోని సొమ్మును కాజేసే సైబర్ నేరగాళ్ల గురించి విన్నాం.. అయితే కంటికెదురుగా ఉంటూనే మన చేతే వారి ఖాతాల్లోకి మన డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయించుకుని ఉడాయించే కేటుగాళ్ల గురించి ఇప్పుడిప్పుడే చూస్తున్నాం. ఫోన్ పే వల్ల నగదు లావాదేవీలు ఎంత సులభమో..
యర్రగొండపాలెం, సెప్టెంబర్ 07: ఎక్కడో ఉండి మన ఖాతాల్లోని సొమ్మును కాజేసే సైబర్ నేరగాళ్ల గురించి విన్నాం.. అయితే కంటికెదురుగా ఉంటూనే మన చేతే వారి ఖాతాల్లోకి మన డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయించుకుని ఉడాయించే కేటుగాళ్ల గురించి ఇప్పుడిప్పుడే చూస్తున్నాం. ఫోన్ పే వల్ల నగదు లావాదేవీలు ఎంత సులభమో, జాగ్రత్తగా ఉండకపోతే అంతే దుర్లభంగా మారుతున్నాయి. అందుకు ఉదాహరణగా ఓ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో ఓ షాపు యజమానికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అనుకున్నది ఒకటయితే.. అక్కడ జరిగింది మరొకటి.. ఓ వ్యక్తి చేసిన ఉదంతానికి షాపు యజమానికి మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.?
వివరాల్లోకి వెళ్తే.. లుంగీలు కొనేందుకు బట్టల షాపుకు కష్టమర్‌లా వచ్చాడు ఓ వ్యక్తి. షాపు యజమాని సెల్‌ఫోన్‌లోని ఫోన్ పే నుంచి తన ఖాతాలోకి 98 వేల రూపాయలు బదలాయించుకుని దెబ్బకు ఉడాయించాడు. ఇక జరిగిన మోసం తెలుసుకునేలోపే లుంగీ కోసం వచ్చిన ఆ కస్టమర్ అంగీతో సహా లాగేసుకున్నాడని తెలుసుకుని లబోదిబోమన్నాడా షాపు యజమాని.. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర బట్టల షాపుకు వచ్చిన ఓ వ్యక్తి, షాపు యజమాని బిజీగా ఉన్నట్టు గుర్తించారు. రెండు లుంగీలు కొని డబ్బులు ఫోన్ పే ద్వారా చెల్లిస్తానని చెప్పటంతో షాపు యజమాని కోటేశ్వరరావు సరే అన్నాడు. ఈ క్రమంలో మీ అకౌంట్‌కు డబ్బులు వచ్చాయి.. చూసుకోండని చెప్పటంతో యజమాని చూసుకుని.. రాలేదని చెప్పటంతో.. నేను చూస్తాను అని అతని వద్ద నుంచి సెల్‌ఫోన్ తీసుకున్న దుండగుడు చూస్తున్నట్టుగా నటిస్తూ.. తన అకౌంట్‌లోకి 98 వేల రూపాయలను బదలాయించుకున్నాడు. ఆ వెంటనే సెల్‌ఫోన్ షాపు యజమాని చేతిలో పెట్టి దుండగుడు అక్కడ నుండి చల్లగా జారుకున్నాడు. కొద్దిసేపటి తరువాత విషయం తెలుసుకున్న షాపు యజమాని కోటేశ్వరరావు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తి, ఎస్సై కోటయ్యకు జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దుండగుడిని కనిపెట్టేందుకు ప్రధాన సెంటర్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించే పనిలో పడ్డారు. అలాగే షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. లోతైన దర్యాప్తు చేయడమే కాకుండా.. నిందితుడ్ని త్వరగా పట్టుకునేలా చర్యలు చేపట్టారు.
మరిన్నిఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..