AP News: ఆ బిల్లు చూస్తే గుండె గుభేలే.. మూడు ఎల్‌ఈడీ బల్బులకు ఎంతొచ్చిందో తెలిస్తే.!
అతడొక గిరిజన రైతు.. మారుమూల గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు.. ఫ్యాన్ కూడా లేదు. వాడేది మూడు ఎల్ఈడి బల్బులు మాత్రమే. కానీ అతనికి గత నెలలో వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే షాక్ కొట్టినంత పని అయింది. వందల్లో రావాల్సిన కరెంటు బిల్లు..
అల్లూరి జిల్లా, సెప్టెంబర్ 7: అతడొక గిరిజన రైతు.. మారుమూల గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు.. ఫ్యాన్ కూడా లేదు. వాడేది మూడు ఎల్ఈడి బల్బులు మాత్రమే. కానీ అతనికి గత నెలలో వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే షాక్ కొట్టినంత పని అయింది. వందల్లో రావాల్సిన కరెంటు బిల్లు.. వేలల్లో వచ్చింది. ఇక ఆ వచ్చిన చాంతాడంత బిల్లును చూసి గుండె పట్టుకున్నాడు సదరు రైతు. వ్యవసాయం చేసుకుని కడుపు నింపుకునే తాను.. అంత బిల్లు ఎలా చెల్లించగలనని వాపోతున్నాడు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ స్టోరీ ఇలా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి ఏజెన్సీ జీకే వీధి మండలం కంపు మానుపాకలు గ్రామంలో నివాసం ఉంటున్నాడు కొర్రా పాండురాజు. వృత్తి వ్యవసాయం. పేద గిరిజన రైతు అయిన పాండురాజు తన ఇంట్లో.. వెలుతురు కోసం మూడు ఎల్‌ఈడీ బల్బులు తప్ప… మరే ఇతర విద్యుత్ ఉపకరణాలు వినియోగించడం లేదు. టీవీ లేదు.. ఫ్రిడ్జ్ కూడా లేదు.. ఫ్యాన్ కూడా వినియోగించడం లేదు. మూడు ఎల్ఈడి బల్బులతోనే తన జీవనం సాగిస్తున్నాడు. అది కూడా కేవలం రాత్రిపూట ఆ ఎల్ఈడి బల్బులు వినియోగించేది.
ఆ బిల్లుతో షాక్..
పాండురాజుకు ప్రతినెల.. విద్యుత్ బిల్లు 300 రూపాయలు దాటదు. యూనిట్లు కూడా పదుల్లోనే ఉంటుంది. అది కూడా గిరిజనుడు కావడంతో సబ్సిడీ కూడా వస్తుంది. అయితే.. తాజాగా పాండురాజు చేతికి అందిన కరెంట్ బిల్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వందల నుంచి ఏకంగా వేలకు వెళ్లిపోయింది ఆ బిల్లు. ఒకటి కాదు రెండు కాదు పదివేలు కూడా కాదు.. ఏకంగా 14,756 రూపాయల 51 పైసలు..! మూడు ఎల్ఈడి బల్బులకు వినియోగించిన యూనిట్లు ఎంతో తెలుసా..? అక్షరాల 1007 యూనిట్లు. అది కూడా కేవలం 22 రోజులకే..! ఎందుకంటే ఆగస్టు 15వ తేదీన బిల్లు రీడింగ్ చూసిన విద్యుత్ సిబ్బంది.. ఈనెల ఆరో తేదీన మళ్లీ బిల్లును తీసారు. వ్యవసాయంపై ఆధారపడే తాను ఈ 14 వేల బిల్లు ఎలా చెల్లించేది అంటూ తల పట్టుకున్నాడు ఆ గిరిజన రైతు.
మరో ఆందోళన..!
కరెంట్ బిల్లు ఒక్కసారిగా భారీగా రావడంతో ఆ రైతులో ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే భారీగా వచ్చిన విద్యుత్ బిల్లుతో గుండె పట్టుకున్న ఆ రైతు.. ఇప్పుడు ఆ బిల్లుతో ప్రభుత్వ పథకాలు కూడా తొలగిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నాడు. పెన్షన్, అమ్మఒడి లాంటి పథకాలు.. భారీగా పెరిగిన కరెంట్ బిల్లుతో తొలిగిపోతాయేమోనని భయపడుతున్నాడు ఆ గిరిజన రైతు. అయితే ఈ బిల్లు వ్యవహారంపై అధికారులు వెరిఫై చేస్తున్నారు. అధికారులు కాస్త కనికరిస్తే.. ఈ గిరిజన పేద రైతు కష్టం తీరినట్టే..!