తిరుమలలో మరోసారి విమానం చక్కర్లు.. తిరిగితే అవి పేలిపోతాయంటూ ప్రచారం..!

దేవ దేవుని లిప్తపాటు దర్శనం కోసం.. నిత్యం భక్త కోటి తరలివచ్చి తరిస్తారు. గోవింద నామ స్మరణతో.. కాలినడకన ఏడు కోండలు ఎక్కి.. స్వామివారిని దర్శించుకుంటే.. కోటిజన్మల పుణ్యఫలమని భావిస్తారు. అందుకే.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారిని దర్శించుకోవడానికి..

తిరుమలలో మరోసారి విమానం చక్కర్లు.. తిరిగితే అవి పేలిపోతాయంటూ ప్రచారం..!
Tirumala
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 07, 2023 | 6:20 PM

దేవ దేవుని లిప్తపాటు దర్శనం కోసం.. నిత్యం భక్త కోటి తరలివచ్చి తరిస్తారు. గోవింద నామ స్మరణతో.. కాలినడకన ఏడు కోండలు ఎక్కి.. స్వామివారిని దర్శించుకుంటే.. కోటిజన్మల పుణ్యఫలమని భావిస్తారు. అందుకే.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారిని దర్శించుకోవడానికి.. ప్రతిరోజూ దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. కొలిచినవారి కొంగు బంగారంగా భక్తులు విశ్వసించే కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మళ్లీ విమానం వెళ్లింది. ఆలయంపై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

కొంతకాలంగా తిరుమల కొండపై తరుచుగా విమానాలు వెళ్తున్నాయి. గురువారం మరోసారి తిరుమల కొండపై నుంచి విమానం వెళ్లింది. గత మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు విమానాలు తిరుమల శ్రీవారి దేవాలయం పైనుంచి వెళ్లడంపై.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం… వెంకటేశ్వర స్వామి వారికి పైనుంచి విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లు వంటివి వెళ్ల కూడదనే నియమం ఉంది. అంతేకాదు.. తిరుమల కొండపై దేవతలు విహరిస్తుంటారని, అందుకే అక్కడ విమానాలు తిరిగితే అపచారమనే భావన కూడా భక్తుల్లో ఉంది. అలానే.. సైన్స్‌ ప్రకారం కూడా.. ఆ ప్రాంతంలో పాజిటివ్‌ రేస్‌ ఎక్కువగా ఉండటం వలన.. విమానాలు తిరిగితే అవి పేలిపోతాయనే ప్రచారం కూడా ఉంది. బ్రిటీష్‌ వారి కాలంలో.. ఇలా రెండు విమానాలు.. ఈ ప్రాంతంలో పేలినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి.

ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం ఆనంద నిలయ గోపురంపై విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు తిరగడం నిషేధం అంటున్నారు పండితులు. తిరుమల శ్రీవారి ఆలయం మహిమాన్విత శక్తి అని.. వైకుంఠంలోని క్రీడాద్రి పర్వతాలే.. తిరుమల క్షేత్ర పర్వతాలుగా భావిస్తారు భక్తులు. ఆలయంలో శ్రీవారు దివ్య శక్తితో ఉంటారని.. అలాంటి పవిత్రమైన ఆలయంపై విమానాలు ప్రయాణించడం దోషంగా చెబుతున్నారు పండితులు. ఆలయం మీదుగా విమానాలు ఎగరకుండా చూడాలంటూ… రేణిగుంట విమానాశ్రయం అధికారులకు.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా… వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు.. తిరుమల నో ప్లై జోన్‌ కాదంటూ ఎయిర్‌ ట్రాఫికింగ్‌ అధికారులు చెబుతున్నారు.

ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరిగితే.. తిరుమల మీదుగా విమాన ప్రయాణం తప్పదు అన్నట్లుగా ఏటీసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. అయితే.. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించేందుకు.. సివిల్‌ ఏవియేషన్‌కు టీటీడీ ఎందుకు పూర్థిస్థాయిలో ప్రతిపాదన ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. ఆలయంపై మరోసారి విమానం వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. మరోవైపు.. తరచుగా విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లు తిరగడం.. తిరుగిరుల భద్రతపై ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎప్పటి నుంచో తిరుమల గిరులు.. టెర్రరిస్టుల టార్గెట్‌లో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి పుణ్యక్షేత్రమైన తిరుమలకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఇక్కడ దాడులకు తెగబడాలని ఎన్నో ప్లాన్స్‌ వేస్తున్నారు ఉగ్రవాదులు. ఈ విషయమై.. ఇప్పటికే.. కేంద్ర ఇంటెలిజెన్స్‌.. హెచ్చరికలు కూడా జారీ చేసింది. తిరుమల ఏడుకొండలకు ఉద్రవాదుల ముప్పు ఉందని, ఏ క్షణమైనా దాడులు జరగవచ్చని చెప్పింది. ఈక్రమంలోనే.. వరుసగా విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్ల సంచారం.. ఆందోళన రేపుతోంది. ఇప్పటికైనా.. టీటీడీ స్పందించి.. పక్కగా తిరుమలను నో ఫ్లై జోన్‌గా చేసి.. తమ మనోభావాలను పరిరక్షించాలని కోరుతున్నారు భక్తులు.