AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పచ్చని కాపురంలో ‘మద్యం చిచ్చు’.. అనాథలైన నెలల వయసున్న చిన్నారులు

ఆ ఇద్దరూ ఒకరిపైఒకరు మనుసుపడి, మనువాడారు. నిండు నూరేళ్లు తమ కాపురాన్ని పండించుకోవాలని అనుకున్నారు. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా సజావుగా సాగిపోతున్న వీరికాపురంలో మద్యం చిచ్చురేపింది. ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో తీవ్ర కలత చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది..

Andhra Pradesh: పచ్చని కాపురంలో ‘మద్యం చిచ్చు’.. అనాథలైన నెలల వయసున్న చిన్నారులు
Couple Committed Suicide In Nellore
Srilakshmi C
|

Updated on: Aug 11, 2024 | 11:23 AM

Share

నెల్లూరు, ఆగస్టు 11: ఆ ఇద్దరూ ఒకరిపైఒకరు మనుసుపడి, మనువాడారు. నిండు నూరేళ్లు తమ కాపురాన్ని పండించుకోవాలని అనుకున్నారు. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా సజావుగా సాగిపోతున్న వీరికాపురంలో మద్యం చిచ్చురేపింది. ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో తీవ్ర కలత చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో కన్నీమున్నీరైన భర్త.. భార్య లేనిదే తాను జీవించలేనని రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో అభం శుభం తెలియని ఆ చిన్నారులిద్దరూ అనాథలుగా మారారు. ఈ హృదయ విదారక సంఘటన నెల్లూరు జిల్లాలో శనివారం (ఆగస్టు 10) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

నెల్లూరు జిల్లా ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన కె నాగరాజు (23), సురేఖ(19) భార్యాభర్తలు. నాలుగేళ్ల కిందట ఇద్దరూ ప్రేమించి, వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్లు, 11 నెలల కుమారులు ఉన్నారు. నాగరాజు టైల్స్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేశాడు. సురేఖ మాగుంట లేఅవుట్‌లో ఓ బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా చేస్తుంది. చక్కగా సాగుతున్న వీరి కాపురాన్ని మద్యం చిన్నాభిన్నం చేసింది. నాగరాజు తాగుడుకి బానిసై, సంపాదించిన డబ్బంతా మద్యానికి ఖర్చు చేసేవాడు. ఈ క్రమంలో పలుచోట్ల అప్పులు చేశాడు. దీంతో కుటుంబ భారం మొత్తం సురేఖపై పడింది. మద్యం మానేయాలని, అప్పులు చేయవద్దని సురేఖ భర్తను వేడుకుంది. తీరు మార్చుకోని నాగరాజు మద్యం అలవాటును మానుకోవడానికి బదులు పుట్టింటికి వెళ్లి మద్యానికి డబ్బు తీసుకురావాలని సురేఖను ఒత్తిడి చేయసాగాడు. ఆ క్రమంలో భార్యభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులతో విసిగిన సురేఖ శనివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన రామచంద్రారెడ్డి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు పరుగుపరుగున ఆసుపత్రికి వచ్చాడు. విగతజీవిగా మారిన భార్యను చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. తనవల్లే భార్య మరణించిందని, తను లేనిదే జీవించలేనని ఆసుపత్రి పక్కనే ఉన్న విజయమహల్‌ గేటు రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సురేఖ తల్లి దీప్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భార్యభర్తలిరువురు పంతంతో క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నారు. దీంతో అభంశుభం ఎరుగని పసిపిల్లలు అనాథలుగా మారారు. అమ్మనాన్నల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసివాళ్లను చూసిన వారంతా కంటనీరు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.