Vizag MLC Election: ఎవరి ధీమా వారిదే.. వేడెక్కుతున్న విశాఖ రాజకీయం! ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పాలకప్రతిపక్షాల ఎత్తుగడలు
విశాఖ తీరంలో.. పొలిటికల్ కెరటాలు ఎగిసిపడుతున్నాయ్. ఈ స్థానంలో పెద్దలసభకు జరుగుతున్న ఎన్నికలే దీనికి ప్రధాన కారణం. ఇంతకీ, ఈ ప్లేసుకు ఎందుకంత ప్రయార్టీ? పొలిటికల్‌గా ఎందుకీ క్యూరియాసిటీ! విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్న రసవత్తర రాజకీయ క్రీడపై... ఏపీ ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఇదే...
స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడేకొద్దీ.. అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతుండటంతో… పొలిటికల్ అట్మాస్పియర్ రోజుకోవిధంగా మారుతోంది. ఎవరి వ్యూహం వారిదే.. ఎవరి ధీమా వారిదే అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ… గెలుపు వ్యూహాలు రచించడంలో బిజీగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ సీటు చేజారనివ్వొద్దని భావిస్తున్నారు జగన్. అందుకే, విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో.. వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రలోభాలకు లొంగొద్దనీ.. బెదిరింపులకు భయపడొద్దనీ… నేతలకు ధైర్యం చెప్పారు. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ సైతం.. ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. అనకాపల్లి, నర్సీపట్నం , పాయకరావుపేట ప్రాంతాల్లో పర్యటించి… పార్టీ కేడర్‌తో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. ఆత్మీయసమ్మేళనాలు ఏర్పాటు చేసి.. కేడర్ నుంచి ఓట్లను అభ్యర్థించారు.
స్థానిక సంస్థల కోటలో ఈ ఎన్నిక జరుగుతుంది. GVMC, మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు రవి బాబు, వరుదు కళ్యాణి ఓటర్లుగా దరఖాస్తు చేసుకున్నారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు చెప్పేందుకు గడువు ముగిసింది. ఎల్లుండి ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు అధికారులు.
కాగా.. రేపు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు. అయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. త్వరలోనే కూటమి అభ్యర్థిని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.. అయితే, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల మాదిరిగానే… ఎమ్మెల్సీ పదవిని కూడా గెలుచుకుంటామని పలువురు కూటమి నేతలు చెబుతుండటం విశేషం.
సోమవారం నామినేషన్ వేస్తానని వైసీపీ అభ్యర్థి బొత్స ప్రకటించగా.. కూటమి తరపున బరిలో నిలిచే అభ్యర్థి ఎవరు? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బలం లేనిచోట పోటీకి దూరంగా ఉండే అంశాన్ని కూడా కూటమి పరిశీలిస్తోందన్న ముచ్చటా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి, కూటమి ఏ వ్యూహంతో ముందుకొస్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..