చంద్రబాబును నమ్మడం అంటే.. పులి నోట్లో తల పెట్టడమే: సీఎం జగన్
వైసీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి.. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనన్నారు సీఎం జగన్. చంద్రబాబు పార్టీలతో జతకడితే.. తాను మాత్రం ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నానని కామెంట్ చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే అన్నారు జగన్.
సిద్ధం.. మేమంతా సిద్ధం బస్సుయాత్రల అనంతరం మలివిడత ప్రచారం మొదలుపెట్టారు సీఎం జగన్. ఇవాళ మూడు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా తాడిపత్రిలో జరిగిన సభలో పాల్గొన్న జగన్.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్రజలు చంద్రబాబును నమ్మడం అంటే.. పులి నోట్లో తలపెట్టడమేనన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని సూచించారు.
రానున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని, వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు జగన్. ప్రతిపక్షాలు జెండాలు జతకట్టుకొని వస్తున్నాయని, జగన్ ఒంటరిగా ప్రజలను నమ్ముకుని వస్తున్నాడన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని.. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మాత్రం పథకాలకు ముగింపేనన్నారు. చంద్రబాబుకు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం అలవాటేనన్న జగన్.. తాను మాత్రం ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇచ్చాన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా తాను భావిస్తానని, గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామన్నారు. గడిచిన ఐదేళ్లలో 2.70 లక్షల కోట్ల నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామన్నారు. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా పాలన సాగించామన్నారు జగన్.
మధ్యాహ్నం వెంకటగిరి త్రిభువని సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమేనన్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్ ఉందా? అని ప్రశ్నించారు. బాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని.. బొమ్మాళి అని రక్తం తాగే పశుపతిని ఇంటికి తీసుకురావడమేనని అన్నారు. 2014లోనూ ఇదే కూటమి నేతలు పలు హామీలు ఇచ్చారు. అందులో ఏ హామీని నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు తీసుకొస్తే.. తాను గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చానని అన్నారు సీఎం జగన్. చంద్రబాబు దమ్ముంటే తాను గెలిస్తే మళ్లీ జన్మభూమి కమిటీలను తీసుకొస్తానని చెప్పగలరా అని సవాల్ చేశారు. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారని.. డ్వాక్రా రుణాల రద్దు చేస్తామని చేయలేదని అన్నారు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని.. అర్హులైన వారికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని మోసం చేశారని చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు.
సాయంత్రం నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం జగన్.. తానేమీ చంద్రబాబులాగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టానని గొప్పలు చెప్పబోనన్నారు. ఈ 58 నెలల కాలంలో తన పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టానని.. వాళ్లే మార్కులు వేయాలన్నారు. తమది ఇంటింటి అభివృద్ధి అని.. చంద్రబాబుది మాత్రం గ్రాఫిక్స్ అని జగన్ విమర్శించారు. చంద్రబాబుకు ఓటేస్తే దత్తపుత్రుడు, వదినమ్మకు ప్యాకేజీలు వెళతాయన్నారు. ప్రజల కోసం తాను 130 సార్లు బటన్ నొక్కానని.. ప్రజలంతా వైసీపీ గెలుపు కోసం రెండుసార్లు ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కాలని విజ్ఞప్తి చేశారు. బీసీ నేతకు టికెట్ ఇచ్చేలా తాను తీసుకున్న నిర్ణయానికి ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి కూడా ఓకే చెప్పడంపై అభినందించారు సీఎం జగన్. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీనిచ్చారు. మూడు ప్రాంతాల్లోనూ జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..