AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP – Telangana: కోడి మాంసం రేటు పెరిగింది.. కానీ గుడ్డు రేటు తగ్గింది..

ఒకప్పుడు మాంసాహారం ఏ పండగకో.. ఫంక్షన్కో వండేవాళ్లు. కానీ ఇప్పుడు ముక్క లేనిదే ముద్ద దిగని పరిస్థితి. మధ్య తరగతి వాళ్లు వారానికి ఒకసారి నాన్ వెజ్ తెచ్చుకుంటుంటే.. ఉన్నత వర్గాల వారి ఇంట్లో రోజూ చికెనో.. మటనో ఉండాల్సిందే.. అలాంటి చికెన్ ధరలు ప్రస్తుతం కొండెక్కి కూర్చున్నాయి. ఎంతలా అంటే ఉన్నట్లు ఉండే రేటు డబుల్ అయ్యింది. ఏకంగా కిలో ధర రూ.300 అయ్యింది..

AP - Telangana:  కోడి మాంసం రేటు పెరిగింది.. కానీ గుడ్డు రేటు తగ్గింది..
Egg
M Sivakumar
| Edited By: |

Updated on: Feb 29, 2024 | 9:39 AM

Share

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారం వరకు కిలో చికెన్ రేటు 250-280 రూపాయల మధ్య ఉండగా.. ఇప్పుడు మరింత పెరిగి కిలో ఏకంగా 300 రూపాయలు పలుకుతుంది. మరో రెండు నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. మండుతున్న ఎండలు, వాతావరణంలో మార్పు కారణంగా కోళ్ల ఉత్పత్తి బాగా తగ్గి పోయిందని, మార్చి, ఏప్రిల్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే.. మొన్నటి వరకు 7 రూపాయలు పలికిన గుడ్డు రేటు.. ఇప్పుడు రూ.5కు దిగి వచ్చింది.

గ్రేటర్ హైదరాబాద్లో ఫిబ్రవరి 10 వరకు స్కిన్‌ లెస్‌ చికెన్ ధర కిలోకు రూ.180 నుంచి రూ.200, లైవ్ కోడి ధర రూ.120 నుంచి రూ.160 దాకా పలికింది. ఇటీవల పెరిగిన ఎండలతోపాటు మేడారం మహాజాతర నేపథ్యంలో కోళ్ల దిగుమతి భారీగా తగ్గింది. ఈనేపథ్యంలో ఒక్కసారిగా చికెన్‌కు డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరిగిపోయాయి. కిలో లైవ్ కోడి ధర కూడా రూ.180 వరకు పలుకుతుండడంతో కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. నాటుకోడి ధర రూ.380 నుంచి రూ.450 ఉండడంతో చాలామంది దానిఊసే ఎత్తడం లేదు..

కార్తీక మాసం సమయంలో చికెన్ ధర భారీగానే దిగి వచ్చింది. నెల రోజుల క్రితం వరకు కూడా కిలో చికెన్ రేటు రూ.200 లోపే ఉంది. కార్తీక మాసం సమయంలో కిలో చికెన్ రూ.130-140కే అమ్మాల్సి వచ్చింది. దాంతో చాలా మంది కోళ్ల ఫారాల యజమానులు భారీగా నష్టపోయారు. ఈ భయంతో కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. తల్లి కోళ్లను కూడా గిట్టుబాటు కాక తక్కువ ధరకే అమ్మేశారు. అప్పటి ఫలితం ఇప్పుడు కనిపించడంతో.. ఇప్పుడు వాటి ఉత్పత్తి తగ్గి.. కొరత ఏర్పడింది. దాంతో కోడి ధర కొండెక్కి కూర్చుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కిలో చికెన్ రేటు రూ.300 పలుకుతుంది. బోన్ లెస్ చికెన్ ధర రికార్డు స్థాయిలో కిలోకు రూ.500కు పైనే ఉంది. ఆదివారం వస్తే ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు..

వాతావరణంలో మార్పుల కారణంగా కోడిపిల్లలు చనిపోతాయని, చికెన్ ధరలు పెరగడానికి ఇదొక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాక కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయని.. ఇవి కూడా రేట్లు పెరగడానికి కారణమంటున్నారు. ఏటా మహాశివరాత్రి పర్వదినం తర్వాత మొదలు కావాల్సిన ఎండలు.. ఈసారి ఫిబ్రవరి రెండోవారం నుంచే ప్రారంభం కావడంతో వేడికి కోళ్లు చనిపోతున్నాయి. ఏపీలో ఎండల ధాటికి కోళ్లు చనిపోతుండడంతో అక్కడి వ్యాపారులు హైదరాబాద్, శంషాబాద్, షాద్‌ నగర్‌, మహబూబ్నగర్, తదితర ప్రాంతాల్లోని పౌల్ట్రీ ఫారాల నుంచి కోళ్లను ఎగుమతి చేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్‌లో కోళ్ల కొరత ఏర్పడుతోంది. అంతేకాక ప్రతి ఏటా వేసవిలో చికెన్, మటన్ ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ఇదే కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..