AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polavaram Project: చంద్రబాబు ఢిల్లీ టూర్.. పోలవరంపై ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ.. !

తాజా ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సానుకూల ఫలితాలను సాధించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పోలవరం, అమరావతి ప్రాజెక్టులే అజెండాగా, ఆయన ఢిల్లీ పర్యటన సాగింది. అందులోనూ అత్యంత సమస్యాత్మకంగా, చిక్కుముడిగా మారిన పోలవరం ప్రాజెక్టుపైనే సీఎం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

Polavaram Project: చంద్రబాబు ఢిల్లీ టూర్.. పోలవరంపై ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ.. !
Chandrababu Delhi Tour
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Aug 18, 2024 | 8:00 PM

Share

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడు రోజుల హస్తిన పర్యటన ముగిసింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపైనే చంద్రబాబు తన హస్తిన పర్యటనలో ఫుల్ ఫోకస్ చేశారు.  ఈ ప్రాజెక్టు భవితవ్యంపై.. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఢిల్లీ పెద్దల నుంచి చంద్రబాబుకు ఎలాంటి హామీ వచ్చిందన్న అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సానుకూల ఫలితాలను సాధించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పోలవరం, అమరావతి ప్రాజెక్టులే అజెండాగా, ఆయన ఢిల్లీ పర్యటన సాగింది. అందులోనూ అత్యంత సమస్యాత్మకంగా, చిక్కుముడిగా మారిన పోలవరం ప్రాజెక్టుపైనే సీఎం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఫైనల్‌ డీపీఆర్‌ సిద్ధం కాలేదు.. గైడ్ బండ్, డయా ఫ్రమ్ వాల్ నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా సమీక్షించిన అంతర్జాతీయ నిపుణుల బృందం మార్పులు కూడా సూచించింది. వీటన్నింటినీ సెట్‌ చేయాలంటే అంత వీజీ కాదు. అందుకే, స్వయంగా రంగంలోకి దిగారు చంద్రబాబు. రాబోయే రెండు సీజన్లలోపు డయాఫ్రమ్ వాల్ నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో… అందుకు తగ్గట్టు నవంబర్ నుంచి పోలవరం పనులు పునఃప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, కేంద్రంతో కలిసి రాష్ట్రం కూడా నిర్మాణ బాధ్యతలని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా అర్థమవుతోంది. డయాఫ్రం వాల్ నిర్మాణం ఖర్చు ఎంత? నిర్మించేది ఎవరు? ఎప్పటి లోపు పూర్తవుతుంది? మిగతా పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఇలాంటి చాలాఅంశాలకి సంబంధించి పరిష్కార మార్గాలపై చంద్రబాబు తీవ్ర కసరత్తే చేస్తున్నారు.

అమరావతికి సంబంధించి… రూ.15వేల కోట్ల రుణాన్ని ఇప్పిస్తామని ఇటీవల బడ్జెట్‌లో కేంద్రం చెప్పడంతో వాటికి సంబంధించిన నిధుల విడుదల, వాటి వినియోగానికి సంబంధించి ప్రణాళిక అమలుపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన చంద్రబాబు… పోలవరంపై మాత్రం మరింత ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కాకపోతే, అనుకున్నంత ఈజీగా అక్కడ పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే, వీలైనంత తొందరగా ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా ప్రణాళిక వేసుకున్న చంద్రబాబు… తాజా 3రోజుల ఢిల్లీ పర్యటనలోనూ ఈ అంశంపై చాలా పురోగతి సాధించినట్టుగా అర్థమవుతుంది.

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణంపైనే ప్రస్తుతం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సమయం, డబ్బు ఆదా కావాలంటే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ బాధ్యతలు పాత ఏజెన్సీకే ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, సీడబ్ల్యూసీ, పీపీఏ అధికారులతో గంటకుపైగా సమావేశమైన ఆయన… నవంబరు నుంచి ప్రారంభమయ్యే పనులను, సీజన్ నష్టపోకుండా పూర్తిచేసేందుకు సహకరించాలనీ, డిజైన్లను ఆమోదించి ముందుకెళ్లేలా చూడాలని కోరారు. నిర్మాణ సంస్థను మార్చొద్దని సీడబ్ల్యుసీ, పీపీఏ గతంలో హెచ్చరించినా గతప్రభుత్వం వినకపోవడం వల్లే ఈ నష్టం వచ్చిందని అధికారులు చెప్పడంతో… మెఘా నిర్మాణ సంస్థతోనే పనులు చేయించాలని చంద్రబాబు డిసైడైయ్యారట.

2022లో డయాఫ్రం వాల్ దెబ్బతిన్నప్పుడు మరమ్మతులకోసం టెండర్లు పిలిస్తే… 29వేల చదరపు మీటర్ల వాల్ పనులను 390కోట్లతో చేయడానికి పాత కాంట్రాక్ట్ సంస్థ సంసిద్ధత వ్యక్తంచేసింది. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ 73వేల క్యూబిక్ మీటర్ల పని చేయాలి. మరి, నాటి ధరలతో, అదే ఏజెన్సీతో పనులు కొనసాగిస్తే.. నిర్మాణం ఆలస్యం కాకుండా ఉంటుందని అధికారులంతా అభిప్రాయపడ్డారట. ప్రభుత్వంపై అదనపు భారం పడకూడదన్న ఉద్దేశంతో పాత ఏజెన్సీ మెఘాతోనే పనులు కొనసాగించాలన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, ఇంతవరకు రెండో డీపీఆర్‌ను కేంద్రం ఖరారు చేయలేదు.2014-19 మధ్య చంద్రబాబు హయాంలో 55,656 కోట్లకు కేంద్రజలసంఘం ఆమోదించింది. తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ 47,725.74 కోట్లకు సిఫార్సు చేసింది. ఆ నిధులను ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో తొలిదశ నిధులు అంటూ 41.15 మీటర్ల స్థాయి పునరావాసాన్ని, భూసేకరణను, కట్టడాలు, కాలువల విషయంలో యథాతథ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని 31,625 కోట్ల రూపాయలకు కేంద్ర జలసంఘం సిఫార్సు చేసింది. ఆ నిధులతో పోలవరం పూర్తిచేయడం ఇప్పుడు సాధ్యం కాదు. ధ్వంసమైన కట్టడాల నిర్మాణానికి అదనపు నిధులు అవసరం. ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. ముఖ్యంగా మోడీ, అమిత్‌షాలతో సమావేశాల్లో పోలవరం గురించే చంద్రబాబు వివరించి.. వాళ్ల ఆమోదం తీసుకున్నట్టు సమాచారం. పోలవరాన్ని పూర్తిచేసే బాధ్యత తమదేనన్న హామీని మరొకసారి కేంద్రపెద్దల నుంచి పొందారట ముఖ్యమంత్రి.

అమరావతి, పోలవరం కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఎక్కడా ఆలస్యం కాకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని అధికారులతో చంద్రబాబు స్పష్టం చేశారట. ఎక్కడ ఆలస్యం జరిగినా జోక్యం చేసుకోవడానికి కేంద్రమంత్రులు ఉన్నారని, అవసరమైతే తానూ మాట్లాడతాననీ చెప్పారట ముఖ్యమంత్రి. దీంతో, ఈ నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు పునః ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా డయాఫ్రం వాల్ నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తోంది కాబట్టి… అది పూర్తి అయితే మిగతా పనులను అత్యంత వేగంగా చేసే అవకాశం ఉందని భావిస్తోంది. కేవలం రెండు సీజన్ లోపే డయాఫ్రం వాల్ ను పూర్తి చేయాలన్న టార్గెట్‌ని నిర్మాణ సంస్థకి ఇచ్చిందట ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి ప్రణాళిక ప్రకారం పనులు జరిగితే, రెండు సీజన్ల తర్వాత కుడి, ఎడమ కాలువల తో పాటు ప్రాజెక్టు నిర్మాణ ఉద్దేశాన్ని సంతృప్తిపరిచే విధంగా కార్యక్రమాలన్నీ పూర్తవడం ఖాయం. చూడాలి మరి, ఏం జరుగుతుందో.