Markapur: అలిగిన బాలినేని.. సీఎం జోక్యంతో చివరి నిమిషంలో సభకు.. చివరకు ఆయన చేతుల మీదగానే
‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ నిధులను విడుదల చేసేందుకు సీఎం జగన్ మార్కాపురం వచ్చారు. ఈ క్రమంలోనే బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది. హెలిప్యాడ్ వద్దకు వెళ్తుండగా బాలినేనిని పోలీసులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి...

ఆయన మాజీ మంత్రి. సీనియర్ ఎమ్మెల్యే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంచి మాస్ లీడర్. ముఖ్యమంత్రి జగన్‌కు దగ్గరి బంధువు. అందరూ శీనన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయనే ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీవివాస్ రెడ్డి. అలాంటి వ్యక్తి సొంత జిల్లా మార్కాపురంలో జరిగిన సీఎం జగన్ సభకు గైర్హాజరయ్యారు. ఇందుకు పెద్ద రీజనే ఉందండోయ్. సీఎం వస్తుంటే జిల్లా నాయకులు, అధికారులు వెళ్లి రిసీవ్ చేసుకోవడం సాంప్రదాయం. ప్రొటోకాల్ కూడా. ఈ క్రమంలోనే సీఎం హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లేందుకు వాహనంలో వచ్చారు బాలినేని. అయితే ఆయన్న వాహనం దిగి నడిచివెళ్లాలని పోలీసులు సూచించారు.
దీంతో బాలినేని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ.. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. మంత్రి ఆదిమూలపు సురేష్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా.. ఆయన పట్టించుకోలేదు. సీఎం సభకు కూడా వెళ్లకుండానే వెళ్లిపోయారు. బాలినేని సభకు రాకుండా వెళ్లిపోవడంతో సీఎం జగన్ ఆరా తీసినట్లు తెలిసింది. విషయం తెలిసిన వెంటనే బాలినేనితో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. ఏకంగా ముఖ్యమంత్రి నుంచి కాల్ రావడంతో.. హుటాహుటిన సభావేదిక వద్దకు వచ్చారు బాలినేని. చివరకు ఆయన చేతుల మీదగానే వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల బటన్ నొక్కించారు జగన్. దీంతో కథ సుఖాంతమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
