Palnadu: ముగ్గురూ కలిసి రేగ్గాయలు కోద్దామని వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
వాళ్ల ముగ్గురు స్నేహితులు.. సమీప కొండల్లో రేగి కాయలు కోసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు కలిసే కొండల్లోకి వెళ్లారు. అయితే ఇద్దరూ మాత్రం తిరిగి వచ్చారు. మూడో బాలుడు మాత్రం నీటి కుంటలో శవమై తేలాడు.. బాలుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం హాసానాబాద్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థి తన తోటి ఇద్దరూ విద్యార్ధులతో కలిసి సమీప కొండల్లోకి వెళ్లారు. రేగి కాయలు కోసుకోవడానికి వెలుతున్నట్లు స్థానికులతో చెప్పారు. ఆదివారం కావడం ముగ్గురు కలిసి వెళ్లడంతో ఒక గంటపాటు కొండల్లో తిరిగారు. ఆ తర్వాత ఆరో తరగతి విద్యార్థి ఖలీల్ తో తాము ఇంటికి వెళ్లిపోతున్నామని స్నేహితులు చెప్పారు. మీరు వెళ్లండని నేను తర్వాత వస్తానని ఖలీల్ చెప్పాడు. దీంతో స్నేహితులిద్దరూ ఇంటికి వచ్చేశారు. సాయంత్రం అయినా ఖలీల్ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు. సోమవారం ఉదయాన్నే కొండల్లోని నీట కుంటలో ఖలీల్ శవమై కనిపించాడు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బాలుడి శవమై తేలిన కుంట వద్దకు సత్తెనపల్లి డిఎస్పీ హనుమంతరావు వచ్చారు. సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలుడి మ్రుతదేహాన్ని పరిశీలించగా శరీరంపై కత్తి ఉన్నట్లు డిఎస్పీ చెప్పారు. ఘటనా స్థలంలో కత్తి కూడా లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు సంచరించిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. దీంతో గుర్తు తెలియని వ్యక్తులే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అసలు ఆరేళ్ల బాలుడిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఖలీల్ తో పాటు రేగికాయలు కోసుకునేందుకు వెళ్లిన స్నేహితులను పోలీసులు ప్రశ్నించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ఆరో తరగతి చదువుతున్న కొడకు అనుమానాస్పద స్థితిలో చనిపోవడంపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హత్యగా భావిస్తున్న పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకునేందుకు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
