AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Land Festival: గిరిపుత్రులు చేసుకునే భూదేవి పండుగ.. ఎలా చేస్తారో తెలుసా..?

పండుగులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తుంటారు. అయితే ఇతర పండుగలకు భిన్నంగా ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని ప్రత్యేక పండుగలు జరుగుతాయి. వాటిలో ప్రధానమైనది భూదేవి పండుగ. ఈ పండుగ అక్కడ నివశించే గిరిజనుల జీవన శైలి, వారి ఆచారాలకు అనుగుణంగా సాగుతుంటుంది. భూమి, నీరు , గాలి, అగ్ని , ఆకాశం ఈ పంచభూతాలను దైవ సమానంగా భావిస్తూ వేల సంవత్సరాల క్రితం నుంచి భారతీయులు వాటిని పూజిస్తున్నారు. కానీ కాలక్రమంలో..

Land Festival: గిరిపుత్రులు చేసుకునే భూదేవి పండుగ.. ఎలా చేస్తారో తెలుసా..?
Tirumala Kunta Tribals Land Festival
B Ravi Kumar
| Edited By: |

Updated on: Sep 12, 2023 | 4:14 PM

Share

ఏలూరు, సెప్టెంబర్ 12: పండుగులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తుంటారు. అయితే ఇతర పండుగలకు భిన్నంగా ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని ప్రత్యేక పండుగలు జరుగుతాయి. వాటిలో ప్రధానమైనది భూదేవి పండుగ. ఈ పండుగ అక్కడ నివశించే గిరిజనుల జీవన శైలి, వారి ఆచారాలకు అనుగుణంగా సాగుతుంటుంది. భూమి, నీరు , గాలి, అగ్ని , ఆకాశం ఈ పంచభూతాలను దైవ సమానంగా భావిస్తూ వేల సంవత్సరాల క్రితం నుంచి భారతీయులు వాటిని పూజిస్తున్నారు. కానీ కాలక్రమంలో కొన్ని ఆచారాలు దాదాపుగా కనుమరుగయ్యాయి. అయితే గిరిజన ప్రాంతాల్లో మాత్రమే ప్రకృతిని కొలిచే ఆచారాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదివాసీలకు బయటి ప్రపంచంలోని కొత్త పోకడలతో సంబంధం లేదు, కొత్త టెక్నాలజీతో వారికి పని లేదు, వారు నమ్ముకున్న బతుకు దెరువే వారికి దైవంతో సమానం. తమకు అన్నం పెడుతున్న భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అడవితల్లి ఆ గిరిజనులకు అమ్మలా కనిపిస్తుంది. చాలా మంది రైతులు తొలకరి చినుకులు కురవగానే ఎద్దులు, నాగలితో దుక్కిదున్ని వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. కానీ ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గిరిజనులు మాత్రం మొదటగా భూమాతకు పూజ చేసిన తర్వాతే పనులు ప్రారంభిస్తారు.

భూమి పండగ ఇలా నిర్వహిస్తారంటే

ఈ పండగ జరుపుకునేముందు గ్రామ ప్రజలు గ్రామ సభ ఏర్పాటు చేసుకుని పండగ తేదీ నిర్ణయిస్తారు. ఆ రోజు ఉదయాన్నే మగవారు గ్రామ శివారులో ఉన్న చెట్టువద్దకు వంట సామాగ్రితో బయలుదేరతారు. కార్యక్రమం ప్రారంభించేముందు గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి నవధాన్యాలు సేకరిస్తారు. ఆ ధాన్యాలను ఒక చోటకు చేర్చి గ్రామపెద్దల సమక్షంలో కులదైవానికి పూజ చేస్తారు. పూజ చేసే సమయంలో భూమికి రంద్రం చేసి కోడిని రంద్రం నుంచి ఇంకో రంద్రం ద్వారా బయటకు తీస్తారు. అలా మూడు సార్లు తీసిన తర్వాత కోడిని దేవతకు అర్పిస్తారు. అనంతరం గ్రామానికి పొలిమేర బయట ఉన్న కొండదేవతకు వరాహాన్ని బలి ఇస్తారు. అక్కడినుంచి తీసుకువచ్చిన అనంతరం అందరూ సమానంగా వాటాలు వేసుకుంటారు. ఆరోజు సగం మాంసాన్ని సహపంక్తి భోజనాలకు వాడి, మిగిలినది కుటుంబాల వారీగా పంచుకుంటారు. ఆ రోజు వంట మొత్తం మగవారు చేస్తారు. కూర ఒక్కటే వండుతారు. అన్నం మాత్రం ప్రతి ఇంటి నుంచి అందరూ తీసుకువచ్చి వడ్డించుకుని తింటారు. అనంతరం గిరిజన సంప్రదాయం ప్రకారం నృత్యాలతో సాయంత్రం నుంచి తెల్లవారేవరకు ఆట కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ప్రతి పండుగా ఆదివాసీలు ఎంతో ఆర్భాటంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. గ్రామంలో సేకరించిన నవధాన్యాలు గ్రామస్తులందరికీ పంచుతారు. ఆ ధాన్యాన్ని ఇంట్లో వారి కులదైవాలకు సమర్పించి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.

భూమి పండగ జరిగే మూడు రోజుల పాటు పురుషులంతా కలసి విల్లంబులు చేతబూని సంప్రదాయక వేట కోసం అడవిబాట పడతారు. ఇదే సమయంలో మహిళలు పండగ నిర్వహణకు కావాల్సిన ఖర్చుల నిమిత్తం గ్రామ సమీపంలోని రహదారుల వద్దకు చేరుకుని సంప్రదాయ రేల నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ, వచ్చీపోయే వాహనాలను ఆపుతూ డబ్బులు వసూలు చేస్తారు. కొన్ని గ్రామాల మహిళలు గుంపులుగా మండల కేంద్రాలకు వచ్చి దుకాణాల వద్ద కూడా డబ్బులు అడుగుతారు. ఇలా మూడు రోజుల పాటు వసూలైన నగదుతో పూజకు కావాల్సిన సామగ్రి కొనుగోలు చేసి పండగను వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఉదయం అడవికి వేటకు వెళ్లిన పురుషులు సాయంత్రానికి ఇళ్లకు చేరుకుంటారు. వేటలో భాగంగా ఏదైనా జంతువును వేటాడితే దానిని గ్రామస్తులంతా కలసి సమాన వాటాలుగా పంచుకుంటారు.

ఇవి కూడా చదవండి

సందడి అంతా మహిళలదే …

పురుషులు వేటకు వెళ్ళిన వారు విజయంతో తిరిగి రావాలని మహిళలంతా ప్రతి ఇంటి నుంచి విప్పపూలు తీసుకొని ఆకులతో ఏడు మూటలు కడతారు. దానికి ఒక పొడవాటి తాడు కట్టి మహిళలు పరిగెడతారు. ఎవరైతే విప్పచెట్టుపైకి ఆ మూటను విసిరి వేస్తారు వాళ్ళే విజయం సాధించినట్లు. ఆపై మహిళలు గెద్దటా కొండూరు బాల, ముంజాట వంటి విభిన్న ఆటలు ఆడతారు. పండుగ రోజు గ్రామస్తులంతా అంబలి బుర్రలు బద్దలు భుజాన పెట్టుకొని విల్లు చేతపట్టి ఊరి పొలిమేర వరకు చేరుకుంటారు. అక్కడ తమ ఆయుధాలు ఒక చోట పెడతారు గ్రామ పటేలు ఆయుధపూజ నిర్వహిస్తారు. ఆపై మహిళలతో కోడిగుడ్డును బాణంతో గురి పెట్టి పగలగొట్టి స్తారు. ఆధునిక యుగంలో అంతరించిపోతున్న ఆదివాసీల పండుగలను మన్యంలో ఇంకా కొనసాగిస్తూ తమ సంస్కృతిని వారు కాపాడుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.