Andhra Pradesh: అబ్బో.. పోలీసుల సన్మానం మామూలుగా లేదుగా! ఖాకీలతో పూలదండలు, మర్యాదలంటే మాటలా..

ఎవరైనా కొత్తగా కొన్న బైకులో లేదా కారులో గాయపడిన వారిని, ప్రమాదంలో ఉన్న వారిని ఎక్కించుకుని తీసుకెళ్లడం అశుభంగా పరిగణిస్తారు. కానీ ఈ ఇద్దరు యువకులు మాత్రం ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తిని కాపాడటం కంటే శుభం ఇంకేం ఉంటుందని భావించారు. అంతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తమ కొత్త వాహనంలో రక్తమోడుతున్న బాధితుడిని ఎక్కించుకుని హుటాహుటీన ఆస్పత్రికి చేర్చారు. అక్కడే ఉన్న పోలీసులు యువకుల ఔదార్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందుకే వారిని ఘన సత్కారం చేశారు..

Andhra Pradesh: అబ్బో.. పోలీసుల సన్మానం మామూలుగా లేదుగా! ఖాకీలతో పూలదండలు, మర్యాదలంటే మాటలా..
AP Police honour two men
Follow us
B Ravi Kumar

| Edited By: Srilakshmi C

Updated on: Dec 02, 2024 | 11:41 AM

ఏలూరు, డిసెంబర్‌ 2: స్టేషన్‌లో పోలీసులు సన్మానం చేశారంటే ఎవరిమైనా ఏమనుకుంటాం.. బాగా బడితే పూజ చేశారని ప్రచారం జరుగుతుంది. కాని ఇక్కడ జరిగిన సన్మానం వేరు. ఖాకీలు రొటీన్‌కి భిన్నంగా వ్యవహరించారు. ప్రజల్లో కలిసి మంచిని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చారు. ఎపుడూ కర్ణ కఠోరమైన పదాలు, అదిరింపులు, బెదిరింపులు, సెక్షన్లపై తర్జనభర్జనలు… ఇలా న్యాయం వివాదాలకు అడ్డగా ఉండే చోట ఓ పౌరుడికి ఘన సన్మానం జరిగింది. పోలీసులు ఇలా ఎందుకు చేశారో తెలియాలంటే.. అసలు కథలోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే!

గత నెల 28వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఏలూరు జిల్లా మండవల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన కాటి నిరీక్షణ బాబు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. కానుకల్లు గ్రామం వద్దకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు అతని ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోయాడు. ఆ సమయంలో అతని తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు ప్రమాద ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన నిరీక్షణ బాబుని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సాయం కోసం ఎదురుచూశారు. అదే సమయంలో మండలి గ్రామానికి చెందిన కందుల శ్యామ్, నల్లగుడ్ల రాజు కొత్తగా టాటా వెహికిల్ కొనుగోలు చేసి, విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పూజ చేయించుకుని, కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు.

అయితే వారి వాహనాన్ని ఆపిన పోలీసులు వ్యక్తికి ప్రమాదం జరిగి అపస్మారక స్థితిలో ఉన్నాడని ,ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి సాయం చేయాలని వారిని కోరారు. వెంటనే వారు ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యులను వేరే వాహనంలో ఇంటికి పంపించి, కొత్తగా కొన్న టాటా మ్యాజిక్ వెహికల్లో గాయాల పాలైన నిరీక్షణ బాబుని తీసుకుని గుడివాడ హాస్పటల్‌కు తీసుకువెళ్లారు. సకాలంలో బాధితులు ఆసుపత్రికి చేరుకోవడంతో అపస్మారక స్థితి నుంచి కోలుకొని ప్రాణాలతో బయటపడ్డాడు బాధితుడు. తెలియని వ్యక్తి ఆపదలో ఉన్నాడని తెలిసి ఏ మాత్రం ఆలోచించకుండా తమ కొత్త వెహికల్లోనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రాణాలు రక్షించడంలో చొరవ చూపిన శ్యామ్, రాజులను పోలీసులతో పాటు పలువురు అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని మండవల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి శాలువా కప్పి సత్కరించారు. అంతేకాక ఎవరైనా ప్రమాదంలో ఉన్న సమయంలో అందరూ శ్యామ్, రాజుల మాదిరి ఆలోచిస్తే ప్రమాదాల సమయంలో ప్రాణాలు కోల్పోతున్న మరెన్నో ప్రాణాలు కాపాడవచ్చని, నేటి యువతకు వీరిరువురు స్ఫూర్తిగా నిలిచారని పోలీసులు వారిని కొనియాడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.