AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. ప్రయాగ్‌రాజ్‌లో ఏపీ మంత్రుల పరీశీలన

2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలోని అధికారులు ప్రయాగ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఏర్పాట్లను అధ్యయనం చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

AP News: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. ప్రయాగ్‌రాజ్‌లో ఏపీ మంత్రుల పరీశీలన
Minister Narayana & Team
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Feb 25, 2025 | 12:22 PM

Share

2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలోని అధికారులు ప్రయాగ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఏర్పాట్లను అధ్యయనం చేస్తున్నారు. ప్రయాగ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించేందుకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆద్వర్యంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం ఉదయం ప్రయాగ రాజ్ చేరుకున్నారు. అక్కడి భారీ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు ప్రత్యేక బృందంగా ఏర్పడి, వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు.

కుంభమేళా కమాండ్ కంట్రోల్ రూం సందర్శనం

సోమవారం సాయంత్రం, మంత్రి నారాయణ బృందం కుంభమేళా అధారిటీ ఆఫీసును సందర్శించింది. ఈ సందర్భంగా కుంభమేళా ఆఫీసర్ విజయ్ కిరణ్ ఆనంద్ కుంభమేళా నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలను ఏపీ బృందానికి వివరించారు. కుంభమేళాలో జరిగే అంతర్రాష్ట్ర కదలికలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, ఘాట్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, స్వచ్ఛత, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్ల లాంటి పలు అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా, కుమార్య ఘాట్, త్రివేణీ సంగమం, మహాదేవి ఘాట్ ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలను పరిశీలించిన ఏపీ బృందం, భవిష్యత్తులో గోదావరి పుష్కరాల్లో ఇటువంటి అధునాతన పద్ధతులను అనుసరించేందుకు చర్చించింది.

స్నాన ఘాట్ల వద్ద భద్రతా పరిశీలన

అనంతరం, ప్రధాన ఘాట్‌ల వద్ద భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి అక్కడి అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. కుంభమేళా సమయంలో కోట్లాదిమంది భక్తులు గంగానదిలో పవిత్ర స్నానం చేస్తారు. అందుకే, రద్దీ నియంత్రణ, ఎమర్జెన్సీ సేవలు, వరద ప్రవాహ నియంత్రణ, డిజిటల్ సర్వీల గురించి ఏపీ బృందం లోతుగా అధ్యయనం చేసింది. ఈ పర్యటన ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, “గోదావరి పుష్కరాలు—కుంభమేళాకు సమానమైన వేడుక. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఏర్పాట్లు చేస్తాం” అని తెలిపారు.

ప్రత్యేకంగా ట్రాఫిక్ కంట్రోల్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లలో ఉత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. గోదావరి పుష్కరాలు—భవిష్యత్తు ప్రణాళిక, భక్తులకు సురక్షిత ఘాట్లు, రద్దీ నియంత్రణకు డిజిటల్ టికెటింగ్, మొబైల్ అప్లికేషన్లు.. సీసీ కెమెరాలతో పూర్తి భద్రతా పర్యవేక్షణ, వనరుల సమర్థవంతమైన వినియోగం, పర్యావరణ పరిరక్షణ చర్యలు.. లాంటి అంశాలను ఈ పరిశీలన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోంది. కుంభమేళా అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శ పుష్కరాలుగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు.

2027 గోదావరి పుష్కరాలు భక్తుల కోసం మరింత భద్రతగా, మరింత సౌకర్యంగా సాగేందుకు ప్రభుత్వం ముందస్తుగా చేపడుతున్న ఈ అధ్యయనం, రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు దోహదం చేయనుంది. ఈ పర్యటన ద్వారా ఏపీ ప్రభుత్వం పుష్కరాలను సాంకేతికంగా, నిర్వహణా పరంగా మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమైన కీలకమైన అంచనాలను సిద్ధం చేసుకుంటోంది.