Andhra: ర్యాపిడ్ కిట్లు వచ్చేశాయ్.. రేషన్ బియ్యం తరలిస్తే ఇక అంతే.. చిటికెలో పట్టేస్తారు..
రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారా..? పేదలకు అందవలసిన బియ్యం అక్రమంగా తరలించేస్తున్నారా..? అటువంటి కార్యకలాపాలు చేస్తున్న వారి ఆటలు ఇకనుంచి చెల్లవు.. మీ భరతం పట్టే మొబైల్ రేపిడ్ కిట్లు అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.. ఆ కిట్ల ద్వారా క్షణాల్లో.. తరలిపోతున్న బియ్యం ఏంటి అనేది తేలిపోతుంది. తద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్కు పడుతుందన్నది పౌరసరఫరాల శాఖ ఆలోచన.

పేదల కోసం ప్రభుత్వం అందించే పిడిఎఫ్ బియ్యం.. రాష్ట్రంలోని వేర్వేరు పోర్టుల ద్వారా విదేశాలకు తరలిపోతోంది. పౌరసరఫరాల అధికారుల తనిఖీల్లో అనేక సందర్భాల్లో ఈ విషయం బయటపడింది. కేసులు కూడా పెట్టారు. కాకినాడ పోర్ట్ లో రేషన్ బియ్యం వ్యవహారంలో సిట్ ఎంక్వయిరీ కూడా నడుస్తోంది. ఇక విశాఖ పోర్టు నుంచి కూడా బియ్యం విదేశాలకు తరలిపోతుందనేది పౌరసరఫరాల శాఖ గట్టిగా నమ్ముతుంది. ఇటీవల తరలించేందుకు గోడౌన్లో సిద్ధంగా ఉంచిన బియ్యన్ని కూడా అధికారులు గుర్తించారు. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్‌మెంట్ ను మరింత పటిష్టం చేశారు.
అయితే.. తనిఖీ చేస్తున్న సమయంలో ఆ బియ్యంపై అనుమానం వస్తే వాటిని ల్యాబ్ కు పంపి పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే వాటిపై ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ఆ రిపోర్టు వచ్చేలోగా ఈ రవాణా సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయి అనేది.. గతంలో అనేకమంది ఎగుమతిదారులు పౌరసరఫరాల మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అయితే.. వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది.. బియ్యం పై అనుమానం వచ్చిన వెంటనే చెక్ చేసి అప్పటికప్పుడు నిర్ధారించుకునేలా ఓ సరికొత్త ప్రణాళికనూ సిద్ధం చేసింది ప్రభుత్వం. పౌరసరఫరాల శాఖ ప్రత్యేక మొబైల్ ర్యాపిడ్ కిట్లను రంగంలోకి దింపింది. 700 రాపిడ్ టెస్టింగ్ మొబైల్ కిట్లను సిద్ధం చేసింది. వాటిని పౌరసరఫరాల శాఖ అధికారులకు నుంచి ఎన్ఫోర్స్మెంట్ పటిష్టం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్..
పౌరసరఫరాల శాఖలో గత సంవత్సర కాలంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా నాణ్యమైన పోర్టిఫైడ్ రైస్ ప్రజలకు అందిస్తున్నందని.. ప్రభుత్వం అందించే బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పిడిఎస్ బియ్యం అవునో కాదో గుర్తించడానికి 700 మొబైల్ రాపిడ్ కిట్స్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ రాపిడ్ కిట్లలో పొటాషియం థయో సైనైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ బాటిల్స్ ఉంటాయని అన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే పోర్టిఫైడ్ రైస్ అయినట్లయితే.. ఈ ద్రావణాలు ఆ బియ్యంపై చల్లితే అవి ఎరుపు రంగుకు మారుతాయని.. బయట దుకాణాల్లో అమ్మే బియ్యం అయితే రంగు మారవు అని తెలిపారు. గతంలో అయితే అక్రమ బియ్యం పట్టుకున్న తర్వాత ల్యాబ్ కి పంపించడం వలన సమయం ఎక్కువగా తీసుకోవడం కోర్టులో నిరూపణ కష్టమయ్యేదని.. ఈ రాపిట్ కిడ్స్ వల్ల వెంటనే గుర్తించడానికి.. సీజ్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు మంత్రి.
విశాఖలో మూడు చెక్ పోస్ట్‌లు.. 24/7 నిఘా
ఎన్ఫోర్స్మెంట్లో రాజీ పడేది లేదని, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని.. అవకతవకలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే పౌర సరఫరాల విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నామన్నారు. బియ్యం తీసుకొచ్చే వాహనాలను నిరంతరం తనిఖీ చేయడానికి విశాఖ పోర్టు ప్రాంతంలో మూడు అంతర్గత చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గాజువాక గేట్ వే సి.ఎఫ్.ఎస్. షీలా నగర్ వద్ద, శ్రవణ్ సి.ఎఫ్.ఎస్. షీలా నగర్ వద్ద, బిపిఎల్ ఇంటిగ్రల్ సి.ఎఫ్.ఎస్. పెదగంట్యాడ లలో మూడు చెక్పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటికే అవి పని చేయడం ప్రారంభించాయని చెప్పారు. ఈ చెక్ పోస్ట్ లు 24 గంటలు మూడు షిఫ్టుల్లో పని చేస్తాయని.. 33 మంది సిబ్బందిని నియమించామని మంత్రి తెలిపారు.
ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకునేలా..
కాకినాడ పోర్టులో గతంలో జరిగిన అక్రమ రవాణా జరిపిన వారిపై చట్ట పరమైన చర్యలు.. వాహనాలు సీజ్ చేయడం జరిగిందని అన్నారు. మన దేశానికి సంబంధించిన పీడీఎస్ రైస్ మన పోర్టుల నుండి అక్రమ రవాణా జరగకూడదని.. అందుకే చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని.. ఈ విధానం కాకినాడలో విజయవంతంగా అమలు చేశామన్నారు. రాష్ట్రంలో 4 కోట్ల 42 లక్షల మందికి క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రైస్ కార్డులు అందించడం జరిగిందని, 89% మంది వీటి ద్వారా రైస్ తీసుకుంటున్నారని తెలుస్తుందన్నారు. వినియోగదారులకు బియ్యం సంబంధించిన సమస్యలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాష్ట్రంలోని 29,752 చౌక ధర దుకాణాలలో ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకునే అవకాశం ఉందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 5 లక్షల 35 వేల క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుంటే.. ఈ ప్రభుత్వం గత 14 నెలలో 245 కోట్ల విలువైన 5 లక్షల 65 వేల క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 230 క్రిమినల్ కేసులు పెట్టామని.. కోర్టులలో విచారణ జరుగుతుందన్నారు. విశాఖపట్నంలో కూడా అలాంటి బియ్యం అక్రమ రవాణా జరగకుండా కంటైనర్ పోర్టు సందర్శించి సమావేశాలు నిర్వహించి హెచ్చరించడం జరిగిందన్నారు. న్యాయంగా, సక్రమంగా జరిపే వ్యాపారానికి ఆటంకాలు కలుగకుండా సహకరిస్తామని అప్పుడే తెలిపామన్నారు. ఎన్ఫోర్స్మెంట్ పటిష్టంగా అమలు చేస్తామని కఠినంగా కూడా వ్యవహరిస్తామని మంత్రి పేర్కొన్నారు.
అది ప్లాస్టిక్ బియ్యం కాదు.. పోర్టిఫైడ్ బియ్యంలో పోషక విలువలు..
పోర్టిఫైడ్ రైస్ అంటే 100 కేజీల బియ్యం లో ఒక కేజీ మల్టీ విటమిన్ మిక్స్, ఐరన్ తో కూడిన రైస్ కలుపుతారని.. అన్నారు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్. వీటి పై ప్రజల్లో ప్లాస్టిక్ బియ్యం అనే అపోహ ఉన్నదని, నిజానికి బియ్యాన్ని పిండి చేసి దానిలో దాన్లో మల్టీ విటమిన్ మిక్స్ కలుపుతారన్నారు. ఇది సాధారణ బియ్యం కంటే పోషక విలువలు కలిగిన ఆహారం అని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




