AP BRS Chief : జగన్ సర్కారు బడ్జెట్ పై ఏపీ బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటంటే

గడప గడపకీ మన ప్రభుత్వంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాలకు భారీగా నిధులు కేటాయించడం ద్వారా ఈ ప్రభుత్వ రహస్య ఎజెండా అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉంది తప్ప, రాష్ట్ర గతి, ప్రగతిని ఏమాత్రం పట్టించుకోలేదనేది వాస్తవం.

AP BRS Chief : జగన్ సర్కారు బడ్జెట్ పై ఏపీ  బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటంటే
Thota Chandrasekhar
Follow us
Jyothi Gadda

| Edited By: Rajeev Rayala

Updated on: Mar 16, 2023 | 8:17 PM

అంకెల గారడీ, మాటల మాయాజాలం మినహా ఏపీ బడ్జెట్ అంతా డొల్ల. రాబోయే ఎన్నికలకు సంకేతంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చిట్టచివరి బడ్జెట్ ఇది. కనీసం ఈ బడ్జెట్లోనైనా స్పష్టమైన అభివృద్ధి నమూనాని ఆవిష్కరిస్తారని ఆశించినవారిని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం నిరుత్సాహపరిచింది. రెండు లక్షల 79వేల 279 కోట్లతో పెట్టిన ఈ బడ్జెట్లో రాష్ట్రానికి కొత్తగా దిశానిర్ధేశం చేసే అంశం ఒక్కటీ లేకపోవడం విడ్డూరంగా ఉంది.. రాష్ట్ర దిశ. దశ నిర్ధేశించే నిర్ణయాల్ని వెలువరించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 192 నైపుణ్య కేంద్రాల్ని రాష్టంలో ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పిన ఆర్థికమంత్రి, అక్కడ కల్పించిన వనరులు, అవకాశాల గురించి కూడా వివరిస్తే బాగుండేది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ఒప్పందాల నుంచి పర్యాటక ప్రాజెక్టుల వరకు ఏకరువు పెట్టి ప్రజల్ని ఊహల పల్లకీలో మంత్రి ఊరేగించారే తప్ప వాస్తవ చిత్రాన్ని ముందుంచడంలో మాత్రం వైఫల్యం చెందారు.

అప్పులతో పబ్బం గడుపుకునే స్థితికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దిగజార్చడంలో వైసీపీ సర్కార్ విజయవంతమైంది. పేదలు, మధ్యతరగతి వర్గాల బడ్జెట్ అని చెప్తూనే ప్రజల నెత్తిన అప్పుల కుప్పని వడ్డించారు. అప్పుల్లో ఏపీ నెంబర్ వన్ గా మారిందని ఇటీవలే కేంద్రం విడుదల చేసిన 78వ జాతీయ శాంపిల్ సర్వే పేర్కొంది. జాతీయ సగటు కంటే అప్పుల్లో ఏపీ సగటు 193శాతం ఎక్కువ. దానికి తగ్గట్టుగానే ఈ బడ్జెట్ లెక్కలు ఉన్నాయనేది వాస్తవం. అప్పులు తెచ్చి నడిపే పథకాలు తప్ప ఆదాయ సృష్టి అనేది జరగలేదనేది ఈ ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. రాష్ట్ర విభజన తర్వాత కీలకమైన రంగాల్ని గత రెండు ప్రభుత్వాలూ తీవ్ర నిర్లక్ష్యం చేశాయి. దానికి కొనసాగింపుగానే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో ఈ ప్రభుత్వం చెప్పలేదు. రాజధాని అభివృద్ధి వంటి అంశాల ఊసెత్తలేదు. గత బడ్జెట్లో అమరావతి మెట్రో రెండు కోట్లు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కనీస ప్రస్తావన కూడా చేయలేదు.

ఎన్నికల మ్యానిఫెస్టోని 98.5శాతం అమలు చేశామని అసెంబ్లీలో బల్లగుద్ది మరీ చెప్పిన ముఖ్యమంత్రి కేవలం 5,600 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించడం ద్వారా పేదలందికీ ఇళ్లు అనే హామీని ఎలా సాకారం చేస్తారో చెప్పాలి. ఇలాంటివి చూస్తే అబద్దాల మాటలు, ఓట్ల గాలం వేయడమే లక్ష్యంగా నీటి మూటల్ని ఈ బడ్జెట్లో ప్రభుత్వం జాగ్రత్తగా వండి వార్చిందని ఇట్టే అర్థం అవుతోంది. కాపునేస్తానికి 550 కోట్లు, కాపు సంక్షేమానికి 4,887కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. 2019లో అధికారంలోకి ఇచ్చిన తర్వాత కాపుల కోసం ఏం చేశారో ఈ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. లేదంటే కేవలం మాయమాటలతో మరోసారి కాపుల్ని మోసం చేసే కుట్ర జరుగుతోందని అర్థం చేసుకోవాలి. గడపగడపకీ మన ప్రభుత్వం పేరుతో చేసే వైసీపీ ప్రచారానికి 532 కోట్లు బడ్జెట్లో కేటాయించడం దారుణం. గడప గడపకీ మన ప్రభుత్వంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాలకు భారీగా నిధులు కేటాయించడం ద్వారా ఈ ప్రభుత్వ రహస్య ఎజెండా అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉంది తప్ప, రాష్ట్ర గతి, ప్రగతిని ఏమాత్రం పట్టించుకోలేదనేది వాస్తవం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ..