AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DARSI TDP: ఈ సీటు యమా హాట్ గురూ..! మారుతున్న సమీకరణాలు.. నిలిచేదెవరు.. గెలిచేదెవరు?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అభ్యర్దులను ప్రకటించిన టీడీపీ అధిష్టానం దర్శిలో మాత్రం అభ్యర్ధిని ఖరారు చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తోందట. దీంతో దర్శి టీడీపీ సీటుకు డిమాండ్ పెరిగిపోయిందట‌. ఇక్కడ టీడీపీ టికెట్‌ కోసం అరడజను మంది అభ్యర్ధులు క్యూలో ఉన్నారట.

DARSI TDP: ఈ సీటు యమా హాట్ గురూ..! మారుతున్న సమీకరణాలు.. నిలిచేదెవరు.. గెలిచేదెవరు?
TDP
Fairoz Baig
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 23, 2024 | 5:25 PM

Share

దర్శి సీట్‌ యమహాట్‌ గురూ..! అంటున్నారట తెలుగుదేశం పార్టీ క్యాడర్‌.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అభ్యర్దులను ప్రకటించిన టీడీపీ అధిష్టానం దర్శిలో మాత్రం అభ్యర్ధిని ఖరారు చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తోందట. దీంతో దర్శి టీడీపీ సీటుకు డిమాండ్ పెరిగిపోయిందట‌. ఇక్కడ టీడీపీ టికెట్‌ కోసం అరడజను మంది అభ్యర్ధులు క్యూలో ఉన్నారట. నిన్నటి వరకు దర్శి టికెట్‌ను జనసేనకు కేటాయిస్తారన్న కారణంగా టీడీపీ నుంచి ముందుకు రాని అభ్యర్ధులు, ఇప్పుడు ఈ సీటు టీడీపీకే అని తేలిపోవడంతో ఆశావహులు పోటీ పడుతున్నారట. మరి చంద్రబాబు ఎవరికి ఇక్కడ అభ్యర్ధిగా నిర్ణయిస్తారోనని క్యాడర్‌లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొందట.

దర్శి నియోజకవర్గం. పశ్చిమ ప్రకాశం జిల్లాలో కీలకమైన ఈ నియోజకవర్గంలో ఇటు వైసీపీకి, అటు టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. గత 60 ఏళ్ళుగా ఇక్కడ ఒకసారి పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యే తిరిగి గెలుపొందిందే లేదట. ప్రతి ఎన్నికల్లో కొత్త వ్యక్తిని ఎన్నుకోవడం ఈ నియోజకవర్గంలో ఆనవాయితీగా వస్తోంది. అప్పుడెప్పుడో 1955, 1962 ఎన్నికల్లో మాత్రం దిరిశెల వెంకటరమణారెడ్డి మాత్రమే రెండుసార్లు గెలుపొందారు. ఆ తరువాత ఎంతమంది వచ్చినా ఏక్‌బార్‌కా సుల్తాన్‌ అన్నట్టుగానే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మాజీ ఎమ్మెల్యేకు టికెట్‌ ఇచ్చింది వైసీపీ అధిష్టానం.

ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో ఈసారి టీడీపీ, జనసేన పొత్తులో ఈ టికెట్‌ను జనసేనకు కేటాయిస్తారని భావించారు. అయితే తాజా పొత్తుల్లో భాగంగా జనసేన దర్శి సీటును వదులుకోవడంతో ఇక్కడ టికెట్‌ కోసం టీడీపీ నేతల మధ్య పోరు తీవ్రస్థాయిలో నడుస్తోందట… తాజాలు, మాజీలు పోటీలు పడీ మరీ అధిష్టానం దగ్గర కర్చీఫ్‌లు వేస్తున్నారట. ప్రస్తుతం వైసీపీ అభ్యర్ధి ఖరారు కాగా, టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉందట.

కాపు సామాజిక వర్గం కీలకం…

ఈ నియోజకవర్గంలోని దర్శి పట్టణంలో కాపు సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తుంటాయట. దర్శి పట్టణంలో కాపులు ఎక్కువగా ఉంటే గ్రామాల్లో రెడ్డి, ఆ తరువాత మాదిగ, కమ్మ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దర్శి నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు 39 వేలు ఉంటే, మాదిగ 37, కమ్మ 24, యాదవ 22, కాపు 21, మాల 15, ముస్లిం 12, రజక 8, వడ్డెర 7, మిగిలినవారు ఇతర బిసి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. పల్లెల్లో ఒక్క రెడ్డి సామాజిక వర్గం మినహా మిగిలిన సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఇరుపార్టీలవైపు దాదాపు సరిసమానంగా ఉంటారట.

అయితే దర్శి పట్టణం గణనీయంగా ఉన్న కాపు సామాజికవర్గం ఓటర్లు మాత్రం కలిసికట్టుగా ఉంటూ ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించుకుంటే అదే పార్టీకి గంపగుత్తగా మద్దతిస్తారని సమాచారం. దీంతో వీరు ఎవరికి మద్దతిస్తే ఆపార్టీ అధికారంలోకి వస్తుందన్నది ఓ అంచనాగా ఉందట. అంతేకాకుండా ఇక్కడి కాపు సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే…

గతంలో టీడీపీకి కంచుకోట

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి దర్శిలో పదిసార్లు ఎన్నికలు జరిగితే ఐదు సార్లు టీడీపీ, మూడు సార్లు కాంగ్రెస్‌, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మద్దిశెట్టి వేణుగోపాల్‌ విజయం సాధించారు. టీడీపీ నుంచి కదిరి బాబూరావు పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కదిరి బాబూరావు ఓడిపోయిన తరువాత అధికార వైసీపీలో చేరిపోయారు. అంతకు ముందు 2014లో టీడీపీ నుంచి శిద్దా రాఘవరావు గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో శిద్దా రాఘవరావు ఒంగోలు ఎంపిగా టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోవడంతో ఆ వెనువెంటనే వైసీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీకి ఇక్కడ నాయకత్వం లోపించింది.

టీడీపీ నుంచి రేసులో మాజీ మంత్రి శిద్దా…

దర్శి నియోజకవర్గంలో కమ్మ, యాదవ, కాపు సామాజికవర్గాల ఓటర్లు ఎక్కువగా టీడీపీలో ఉన్నారు. 2014లో టీడీపీ, బిజెపి ఉమ్మడి అభ్యర్దిగా పోటీ చేసిన శిద్దా రాఘవరావుకు జనసేన మద్దతు లభించడంతో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా లభించాయి. దీంతో ఇక్కడ టీడీపీ గెలుపు సాధ్యమైంది. ప్రస్తుతం కూడా ఇదే కాంబినేషన్‌లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా జనసేన పార్టీ తమ అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలని నిన్నటివరకు కోరింది. అయితే తాజాగా పొత్తుల్లో భాగంగా జనసేన దర్శి సీటును వదులుకోవాల్సి రావడంతో ఇక్కడ టీడీపీ నేతలు పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది.

దీంతో ఇక్కడ టికెట్‌ కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. వారిలో ప్రథమంగా ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. శిధ్దా రాఘవరావు 2014 ఎన్నికల్లో దర్శి నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టి దర్శిలో ఎన్నడూ లేని విధంగా 3 వేల కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేశారట. దీంతో దర్శిలో అభివృద్ది అంటే శిద్దాకు ముందు శిద్దాకు తరువాత అన్నట్టుగా చెప్పుకుంటారట. అంతలా దర్శిలో శిద్దా రాఘవరావు పాతుకుపోయారంటారు.

అయితే 2019 ఎన్నికల్లో అనూహ్యంగా శిద్దా రాఘవరావును టీడీపీ అధిష్టానం ఒంగోలు పార్లమెంట్‌కు ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయించింది. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శిద్దా రాఘవరావు ఆ తరువాత అధికారపార్టీ వైసీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి దర్శి టికెట్‌పై పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా తిరిగి టీడీపీ గూటికి చేరి, పార్టీ టికెట్‌పై దర్శి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అందుకు ప్రస్తుతం టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయనున్న మాగుంట రాఘవరెడ్డి కుటుంబం నుంచి కూడా దర్శి నుంచి శిద్దా అయితే బాగుంటుందని టీడీపీ అధిష్టానానికి సూచించినట్టు వినికిడి. ఈ నేపధ్యంలో శిద్దా రాఘవరావు కూడా టీడీపీలో చేరి దర్శి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

2014 సీన్‌ రిపీట్‌…

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, టీడీపీ నుంచి శిద్దా రాఘవరావులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి శిద్దా రాఘవరావు గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో దర్శి నుంచి ఈ ఇద్దరూ పోటీకి దూరమయ్యారు. కుటుంబ కారణాలతో బూచేపల్లి పోటీకి దూరంగా ఉంటే, ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ నుంచి బరిలో దిగిన శిద్దా రాఘవరావు దర్శి నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం లేకపోయింది. దీంతో 2019లో వీరిద్దరూ పోటీకి దూరం కావడం కాకతాళీయమే అయినా తిరిగి 2024 ఎన్నికల్లో ఈ ఇద్దరి పోటీ కాంబినేషన్‌ రిపీట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ టికెట్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి అధిష్టానం ఖరారు చేసింది. మరో రెండు రోజుల్లో టీడీపీలో చేరేందుకు శిద్దా రాఘవరావు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే దర్శి నుంచి టీడీపీ అభ్యర్ధిగా శిద్దానే టీడీపీ అధిష్టానం ప్రకిటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో దర్శిలో 2014 సీన్‌ రిపీట్‌ కానుందని స్థానికులు చెప్పుకుంటున్నారు. అయితే ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…