Annadi Sunitha: పసుపు సంపదతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మన్యం మహిళ.. 20 ఏళ్ల కష్టానికి దక్కిన ఫలితం!
పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పసుపు సంపదతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇరవై ఏళ్ల క్రితం ఆమె ప్రారంభించిన చిన్న కుటీర పరిశ్రమ నేడు అంతర్జాతీయ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. నాడు చిన్నగా ఆమె మొదటు పెట్టిన పసుపు ఉత్పత్తులే ఇప్పుడు ఆమెను ఉత్తమ పారిశ్రామిక వేత్తగా నిలబెట్టాయి. ఇంతకు ఆమె ఎవరూ..ఆమె విజయం వెనుక ఉన్న కృషి ఏంటో తెలుసుకుందాం పదండి..

పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం సాలూరులో అన్నాడి సునీత అనే మహిళ ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఒక చిన్న కుటీర పరిశ్రమ నేడు అంతర్జాతీయ మార్కెట్ వరకు విస్తరించింది. ఎలాంటి వ్యాపార అనుభవం లేకపోయినా జీవనోపాధి కోసం ప్రారంభించిన పసుపు ఉత్పత్తుల వ్యాపారం నేడు ఆమెను ఉత్తమ పారిశ్రామిక వేత్తగా నిలబెట్టింది. ప్రారంభించిన తొలినాళ్లలో స్థానిక గిరిజనుల సహకారంతో మన్యం ఏజెన్సీలో పసుపును సేకరించి ఆ పసుపును శుద్ధి చేసి, ప్యాకింగ్ చేసి విక్రయించడం ప్రారంభించింది. ఆ వ్యాపారంతో స్థానిక గ్రామీణ గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తూ, స్థానికంగా పసుపు సాగును ప్రోత్సహిస్తూ అంచెలంచెలుగా పరిశ్రమను విస్తరించారు. నేడు ఆమె స్థాపించిన పరిశ్రమ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో పాటు అరబ్ దేశాలకు, యూరప్ మార్కెట్‌లకు కూడా ఎగుమతులు చేస్తోంది.
ఇరవై ఏళ్ల క్రితం కుటీర పరిశ్రమగా ప్రారంభమైన ఈ పసుపు వ్యాపారం నేడు కోట్ల రూపాయల టర్నోవర్ కు చేరుకుంది. ఒక మహిళ ఒక వ్యాపారం స్థాపించి అభివృద్ధి చేయాలంటే ఎన్నో అడ్డంకులు వచ్చే ఈ రోజుల్లో అలాంటి వాటిని అన్నింటినీ అధిగమించి తాను నమ్ముకున్న నాణ్యత, నిజాయితీ సునీత పరిశ్రమను పసుపు ఉత్పత్తుల తయారీలో రారాజుగా నిలిపింది. ఆమె పడిన కష్టం చేసిన శ్రమ ఈ రోజు సునీతను ఉత్తమ మహిళ వ్యాపారవేత్తగా నిలబెట్టింది. ఆమె విజయాన్ని గుర్తించిన పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ సునీతకు ఉత్తమ పారిశ్రామిక వేత్త అవార్డును అందించి ప్రశంసించారు. సునీత మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సునీత అందుకున్న ఈ గౌరవం మన్యం ప్రాంతానికే గర్వకారణంగా నిలిపిందని పలువురు వ్యాపారులు కొనియాడుతున్నారు. గ్రామీణ మహిళలు కూడా చిన్నపాటి వ్యాపారం ప్రారంభించి పెద్ద స్థాయి వ్యాపార రంగంలో చోటు సంపాదించగలరని నిరూపించిన సునీత ప్రస్తుతం నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే యువతకు ఆదర్శంగా నిలిచారు.

ప్రస్తుతం ఆమె పరిశ్రమలో వంద మంది వరకు మహిళలు పనిచేస్తున్నారు. ఈమె వద్ద తయారయ్యే ఆర్గానిక్ పసుపు, పసుపు పొడి, కాస్మొటిక్స్‌కు విశేష డిమాండ్ ఏర్పడింది. ఆమె విజయం పలువురికి ఆదర్శంగా నిలిచింది. సునీత పరిశ్రమ ఇప్పుడు కేవలం ఒక వ్యాపారంగా మాత్రమే కాక స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఒక శక్తిగా మారింది. ఆమె స్థాపించిన ఈ పరిశ్రమ గిరిజనుల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని కొనియాడారు ఎస్టీ కమీషన్ చైర్మన్ డివిజి శంకరరావు, స్వర్ణ దంపతులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
