Srikakulam: బేస్ వాయిస్‌తో మహిళా ప్రొఫెసర్‌కు ఫోన్ – అవతలి వ్యక్తి చెప్పింది విని ఆమె స్టన్
శ్రీకాకుళంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ మహిళా డాక్టర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కారు. ఏకంగా పదమూడున్నర లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, సీబీఐ, ఈడీ, అధికారులు ఫోన్‌చేసి అరెస్ట్ చేయరు. ఈ విషయం తెలియక చాలామంది సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు.

డిజిటల్ అరెస్ట్, డిజిటల్ మోసాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా పోలీసులు, ప్రసార సాధనాల్లో మొత్తుకుంటున్నా… ప్రజలు ఎక్కడో ఒకదగ్గర సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతూనే ఉన్నారు. మోసాల బారిన పడేవారిలో ఉన్నత చదువులు చదువుకున్నవారు, నగరవాసులే ఎక్కువగా ఉంటున్నారు.
శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రేవతి అనే ఓ మహిళ డాక్టర్ డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగిన మోసానికి గురయ్యారు. గత నెలలో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తాము ఆశోక్ నగర్ పోలీస్ స్టేషన్, బెంగళూరు నుంచి పోన్ చేస్తున్నామని చెప్పారు. మీరు హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకున్నట్లు సీబీఐ మీ మీద కేసు నమోదుచేసిందని తెలపడంతో రేవతి భయాందోళనలకు గురయింది. ఆధార్ కార్డుతో అనుసంధానమైన ఫోన్ నెంబర్ ద్వారా మీరు మహిళలను డబ్బులు చెల్లించాలని బెదిరించినట్లు సాక్ష్యముందని నేరగాళ్లు బెదిరించారు. తాను అలాంటి మోసాలు చేయలేదన్నప్పటికి చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. సైబర్ నేరగాళ్లు మీపై విచారణ జరుగుతోందని.. మీ ఖాతాలోకి డబ్బులు కూడా జమ అవుతున్నాయని బెదిరించారు. సుప్రీంకోర్టులో మీ తరపున కేసును వాదించడానికి కొంత సొమ్ము డిపాజిట్ చేస్తే మీ అరెస్ట్ నిలిచిపోతుందని నమ్మించారు. అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బులను మేము చెప్పిన అకౌంట్లకు బదిలీచేయాలన్నారు. ఆ డబ్బుపై జెన్యూనిటీ వెరిఫికేషన్ చేసి అది జెన్యూన్ అని తేలితే తిరిగి ఇచ్చేస్తామని నమ్మించి 13 లక్షల 50వేలను కాజేశారు నిందితులు.
రేవతి అక్కౌంట్ నుంచి వేరువేరు అక్కౌంట్లకు డబ్బును బదిలీ చేయించుకున్నారు సైబర్ కేటుగాళ్లు. చివరికి తాను మోసపోయానని గుర్తించిన రేవతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న శ్రీకాకుళం వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రేవతి అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిన ఖాతాలను గుర్తించి నిందితులపై వలపన్ని పట్టుకున్నారు. ఈనెల 14న నిందితులు వేరే ప్రాంతానికి వెళుతున్నట్లుగా తెలుసుకుని వారిపై నిఘాపెట్టి విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. నిందితులను కర్ణాటక లోని మైసూర్ కి చెందిన రుమాన్ షరీఫ్, కాలికట్‌కి చెందిన నౌఫాలా షెరీన్ , కేరళకు చెందిన నజీముద్దీన్ గా గుర్తించారు. వారి దగ్గరనుంచి 6 లక్షలు నగదు, మూడు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మోసంలో భాగమైన మరో ముగ్గురు నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు. జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఈజీ మార్గంగా డిజిటల్ అరెస్ట్ మోసాన్ని ఎంచుకున్నామని పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు. ఈ కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నందుకు సీఐని, ఎస్సైలను డిఎస్పీ వివేకానంద అభినదించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




