ఓరి దేవుడా.. పగబట్టినారా ఏందీ? ఒకే తేదీల్లో టెట్.. మెగా డీఎస్సీ.. రైల్వే RRB.. యూజీసీ NET 2025 పరీక్షలు!
రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జూన్ 6వ తేదీన ప్రారంభంకాగా.. జులై 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే సరిగ్గా ఇదే తేదీల్లో అటు తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025), దేశ వ్యాప్తంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలు, యూజీసీ నెట్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. నిరుద్యోగులపై పగబట్టినట్లు అన్నీ పరీక్షలు ఒకే తేదీల్లో నిర్వహిస్తున్నారేంటీ అని అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

అమరావతి, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జూన్ 6వ తేదీన ప్రారంభంకాగా.. జులై 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే సరిగ్గా ఇదే తేదీల్లో అటు తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) జూన్ సెషన్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. కొందరు నాన్ లోకల్ విద్యార్ధులు ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో టెట్ పరీక్షలు కూడా సరిగ్గా ఇదే తేదీల్లో రావడంతో అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు. టెట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జూన్ 18, 19, 20, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో రోజుకు సెషన్ల చొప్పున జరగనున్నాయి.
దీంతో ఏ పరీక్ష రాయాలో తెలియక తికమక పడుతున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు ఏడాది గడువు అనంతరం ఆర్‌ఆర్‌బీ రైల్వే శాఖ కూడా తాజాగా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆర్‌ఆర్‌బీ పరీక్షలు జూన్ 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. స్టేజ్ 1 పరీక్ష కూడా డీఎస్సీ, టెట్ పరీక్ష తేదీల్లోనే వచ్చాయి. ఈ మూడు పరీక్షలు చాలవన్నట్లు యూజీసీ నెట్ జూన్ సెషన్ 2025 పరీక్షలు కూడా ఈ తేదీల్లో జరుగుతున్నాయి. నెట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీ, తెలంగాణ నిరుద్యోగులపై సర్కార్ పగబట్టినట్లు సరిగ్గా ఒకే తేదీల్లో ఏకంగా నాలుగు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే యూజీసీ నెట్, టెట్, డీఎస్సీ, ఆర్‌ఆర్బీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. దీంతో అభ్యర్ధులు ఒక పరీక్ష రాస్తే మిగతా మూడు పరీక్షలు కోల్పోవల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరీక్షల తేదీల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రాలను హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేశారు. కొన్ని తేదీల్లో ఒకే రోజు టెట్, ఏపీ డీఎస్సీ, నెట్, ఆర్ఆర్బీ పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఏదో ఒకటి రాస్తే మిగతా అన్ని పరీక్షలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.