Rajya Sabha By-Elections: ఏపీలో మరో పోరు.. రాజ్యసభ ఉపఎన్నికలకు నోటిఫికేషన్‌.. రేసులో ఉన్నది ఎవరో తెలుసా..?

వైసీపీ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఉపఎన్నికలకు..నోటిఫికేషన్‌ జారీ చేసింది ఎన్నికల సంఘం. అయితే కేవలం 11 మంది ఎమ్మెల్యేల బలమున్న వైసీపీ..ఈ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టే అవకాశమే లేదు. మరి అనుకోకుండా వచ్చిన ఈ మూడు రాజ్యసభ స్థానాల పంపకంలో.. కూటమి పార్టీలు ఏ ఫార్ములాను ఫాలో అవుతాయి..? ముగ్గురు మిత్రుల మధ్య మూడు సీట్ల పంపకం ఎలా ఉండబోతోంది..?

Rajya Sabha By-Elections: ఏపీలో మరో పోరు.. రాజ్యసభ ఉపఎన్నికలకు నోటిఫికేషన్‌.. రేసులో ఉన్నది ఎవరో తెలుసా..?
Ap Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 26, 2024 | 7:49 PM

ఏపీలో మరోసారి ఎన్నికల సందడి మొదలయింది. వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన మూడు స్థానాల్లో.. ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిసెంబర్‌ 3 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు డిసెంబర్ 13. డిసెంబర్‌ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనుంది..కేంద్ర ఎన్నికల సంఘం. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య వేర్వేరు కారణాలతో తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో ఏపీ కోటాలో మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం వైసీపీ బలం 11 మాత్రమే. అందువల్ల ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమైంది. అయితే, ఈ 3 స్థానాలను టీడీపీ తీసుకుంటుందా? లేక భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేనకు కూడా అవకాశం ఇస్తుందా? అనేదానిపై చర్చ జరుగుతోంది.

రాజ్యసభ సీటును ఆశిస్తున్న గల్లా జయదేవ్‌

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భారీగా స్థానాలను గెలుచుకున్న టీడీపీకి.. ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిథ్యం లేదు. దీంతో ఈ ఉప ఎన్నిక ద్వారా పెద్దల సభలోకి మళ్లీ ఎంట్రీ అవ్వాలని భావిస్తోంది టీడీపీ. అయితే ఆ పార్టీలో రాజ్యసభ బెర్త్‌కు భారీ డిమాండ్‌ ఉన్నట్టు తెలుస్తోంది. తాను రాజీనామా చేసిన స్థానాన్ని తిరిగి తనకే కేటాయించాలని టీడీపీని కోరుతున్నారంట..తాజా మాజీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు. ఇక గుంటూరు ఎంపీ సీటును త్యాగం చేసిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా..రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీనియర్‌ కోటాలో కంభంపాటి రామ్మోహన్‌కు అవకాశం దక్కే ఛాన్స్‌ ఉందంటున్నాయి..టీడీపీ వర్గాలు. అటు జనసేనకు ఏపీ అసెంబ్లీ, మండలితో పాటు లోక్‌సభలో కూడా ప్రాతినిధ్యం ఉంది. రాజ్యసభలో కూడా ఆ పార్టీ అడుగు పెడితే మొత్తం సభలలో జనసేన ఖాతా తెరచినట్లు అవుతుందని భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ రాజ్యసభ సీటును ఆశిస్తోంది. అనకాపల్లి లోక్ సభ సీటుని పొత్తు ధర్మంలో త్యాగం చేశారు..మెగాబ్రదర్‌ నాగబాబు. దీంతో ఆయనకు ఈసారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలన్న వాదన వినిపిస్తోంది. ఇక కాకినాడకు చెందిన టీడీపీ నేత సానాసతీష్‌ అయితే తెలుగుదేశం నుండి లేదంటే జనసేన కోటా నుండి రాజ్యసభ స్థానాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది.

బీజేపీ నుంచి మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి పేరు

ఇక బీజేపీ కూడా మిత్రధర్మంగా తమకు ఒక రాజ్యసభ సీటును ఏపీ కోటా నుంచి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన పార్టీలో చేరినప్పుడే రాజ్యసభ సీటు హామీ దక్కినట్టు తెలుస్తోంది. అటు విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యేగా ఉన్న కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తోంది. అయితే మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసిన స్థానానికి..2026 వరకూ మాత్రమే గడువుంది. దీంతో ఆ స్థానానికి ఆశావాహుల నుండి పెద్దగా డిమాండ్‌ ఉండే అవకాశం లేదు. మిగిలిన రెండు స్థానాలకు జూన్‌ 21, 2028 వరకూ గడువుంది. దాంతో ఆ స్థానాలపైనే పార్టీలు ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. మరి రాజ్యసభ రేస్‌లో విన్‌ అయ్యేది ఎవరో చూడాలి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..