Andhra Pradesh: అరేయ్.. యూట్యూబ్ వ్యూస్ కోసం ఎంత పని చేశార్రా..? కట్ చేస్తే.. కటకటాల్లోకి..

యూట్యూబ్ వ్యూస్ కోసం ఇద్దరు యువకులు అరుదైన వన్యప్రాణిని హతమార్చి కటకటాల పాలయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా బండిదొరవలసకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎలక్ట్రికల్ జూనియర్ లైన్మెన్‌గా పనిచేస్తున్నారు. ఇతను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం చేస్తూనే గత కొద్ది రోజులుగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నాడు.

Andhra Pradesh: అరేయ్.. యూట్యూబ్ వ్యూస్ కోసం ఎంత పని చేశార్రా..? కట్ చేస్తే.. కటకటాల్లోకి..
Crime News
Follow us
G Koteswara Rao

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 26, 2024 | 9:23 PM

యూట్యూబ్ వ్యూస్ కోసం ఇద్దరు యువకులు అరుదైన వన్యప్రాణిని హతమార్చి కటకటాల పాలయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా బండిదొరవలసకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎలక్ట్రికల్ జూనియర్ లైన్మెన్‌గా పనిచేస్తున్నారు. ఇతను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం చేస్తూనే గత కొద్ది రోజులుగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నాడు. మన్యం జిల్లా గిరిజన ప్రాంతం కావడంతో గిరిజన ప్రాంతంలో ఉండే పంటలు, వ్యవసాయంతో పాటు ఇతర అంశాలపై పలు రకాల వీడియోలు చేసి ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. ఎలక్ట్రికల్ ఉద్యోగం చేస్తూనే యూట్యూబ్ నిర్వహించడం పై తన ఉన్నతాధికారులు కూడా అలా చేయడం సరికాదని పలుమార్లు సూచించారు. అయినా నాగేశ్వరరావు మాత్రం వారి మాటలను పెడచెవిన పెట్టి తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే ఆ ప్రాంత పంటపొలాల్లో అరుదుగా కనిపించే ఉడుము స్థానికుల కంట పడింది. అయితే, ఈ ఉడుము వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని షెడ్యూల్డ్ 1 జాబితాలో ఉంది. సహజంగా దేశవ్యాప్తంగా దాదాపు అంతరిస్తున్న పరిస్థితిలోకి వస్తున్న వన్యప్రాణులను షెడ్యూల్డ్ 1 జాబితాలో ఉంచి వాటి పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతారు అటవీశాఖ అధికారులు. అలాంటి ఈ ప్రాణులను ఎవరైనా చంపితే వారి పై వన్యప్రాణుల పరిరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.

అయితే, అలాంటి చట్టాలపై అవగాహన లేని లైన్ మెన్ నాగేశ్వరరావు స్థానికుల నుండి తెలుసుకున్న సమాచారం మేరకు డిప్లొమా చేసిన తన స్నేహితుడు నానిబాబుతో కలిసి ఉడుము ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఉడుముని చూసిన నాగేశ్వరరావు వెంటనే దాని పై దాడిచేసి హతమార్చాడు. అనంతరం చనిపోయిన ఊడుముతో కలిసి కొంత సేపు సెల్ఫీలు, వీడియోలు తీసి సరదాగా గడిపాడు. ఆ తరువాత ఉడుము కూర చేసియూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. దీంతో చనిపోయిన ఊడుమును ముక్కలు ముక్కలుగా కోసి ఉప్పు, కారం, మసాలా వేసి ఆ కూరని తయారుచేసి అనంతరం ఆ కూర తిన్నాడు. ఈ ప్రక్రియ అంతా తన సెల్ ఫోన్ తో వీడియోలు తీసి ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్‌లో అప్ లోడ్ చేశాడు.

అలా అప్ లోడ్ చేసిన ఆ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి చివరకు స్టే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వారి వద్దకు చేరింది. దీంతో వెంటనే పార్వతీపురం మన్యం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు యానిమల్ సొసైటి సభ్యులు. అలా ఫిర్యాదు అందుకున్న అటవీ శాఖ అధికారులు నాగేశ్వరావు, నానిబాబులను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఉడుముని హతమార్చి కూరగా చేసి దానిని యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్లు నేరం అంగీకరించారు. దీంతో వన్యప్రాణుల పరిరక్షణ చట్టం ప్రకారం వారిద్దరిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. నిందితులిద్దరూ చదువుకున్న యువకులే అయినా చట్టాలపై అవగాహన లేకుండా ప్రవర్తించడం బాధాకరమని, ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకొని వన్యప్రాణులను కాపాడాలని కోరారు. అటవీ శాఖ చట్టాలను ఉల్లంఘించి వన్యప్రాణుల పై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..