Devaragattu Bunni Festival: నేడే కర్రల సమరం.. బన్నీ ఉత్సవానికి సర్వం సిద్ధం.. దేవరగట్టులో ఉత్కంఠ..
Devaragattu Banni festival 2021: చూసే వాళ్లకు అది యుద్ధమే.. కానీ అక్కడ ఆచారం.. దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ క్రీడే.. కానీ అక్కడ జరిగే సీన్లు చూస్తే దడ పుట్టాల్సిందే.. అదే దేవరగట్టు కర్రల యుద్ధం. కళ్లలో భక్తి, కర్రలో
Devaragattu Banni festival 2021: చూసే వాళ్లకు అది యుద్ధమే.. కానీ అక్కడ ఆచారం.. దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ క్రీడే.. కానీ అక్కడ జరిగే సీన్లు చూస్తే దడ పుట్టాల్సిందే.. అదే దేవరగట్టు కర్రల యుద్ధం. కళ్లలో భక్తి, కర్రలో పౌరుషం. టెంకాయల్లా తలల్ని పగులగొట్టే ఆచారం. కర్నూలుజిల్లా హోలగుంద మండలంలోని దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి దసరా బన్నీ ఉత్సవాల్లో ప్రతి యేటా జరిగే సీన్ ఇది. ఈ ఏడాది కూడా కర్రల సమరానికి సై అంటూ కాలు దువ్వుతున్నారు. ఇవాళ అర్థరాత్రి దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరుగనుంది. అయితే.. ఈ దేవరగట్టు కర్రల సమరం ఉత్కంఠ రేపుతోంది. ప్రతి ఏటా జరిగే హింస ఈసారి కూడా జరుగుతుందా అనేదానిపై స్థానికుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కనీసం వంద మందికి తగ్గకుండా ప్రతి ఏటా తలలు పగులుతున్నాయి. దీనిపై మానవ హక్కుల కమిషన్ తో పాటు లోకాయుక్త కూడా సీరియస్ అయ్యాయి కర్నూలు కలెక్టర్ ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. కళ్ళెదుటే హింస జరుగుతుంటే , పోలీసులు నియంత్రించలేక పోతున్నారంటూ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయినా.. ప్రతిఏటా హింస మాత్రం జరుగుతూనే ఉంది. ఈసారి కూడా అదే జరగబోతుందో అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే బన్నీ ఉత్సవంలో పాల్గొనే 22 గ్రామాల్లో పోలీసుల అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్యను తగ్గించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది పోలీసు యంత్రాంగం. కర్రల సమరం జరిగే ప్రదేశంలో విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో లైట్లు ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి రేపు ఉదయం 6 గంటలకు ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపట్టారు.
వందల ఏళ్ల క్రితం దేవరగట్టులో వెలసిన మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం ఉత్సవ విగ్రహాలను కైవసం చేసుకునేందుకు దేవరగట్టు పరిసర ప్రాంతాలలో ఉన్న 12 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. ఉత్సవ విగ్రహాలను కైవసం చేసుకునేందుకు రెండు వర్గాల మధ్య జరిగే సమరమే కర్రల సమరం. దీనినే బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో పాల్గొనే వేలాది మంది కర్రలు చేతపట్టి కర్రలతో చివర్లో ఇనుప చువ్వ బిగించి బన్నీ ఉత్సవం ఆడుతారు. ఈ ఉత్సవంలో కొందరు మద్యం సేవించి కూడా ఆడటానికి వస్తుండటంతో హింస జరుగుతోంది. తాగిన మైకంలో బన్నీ ఆడలేక కర్రలు ఇతరుల తలపై పడుతున్నాయి. వాస్తవంగా మెజారిటీ భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. కొందరి కారణంగానే తలలు పగులుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు దేవరగట్టుతోపాటు పరిసర ప్రాంతాల్లో పండక్కి మూడు రోజుల ముందుగానే నిఘా ఉంచారు. మొత్తం పది బృందాలు.. అంటే సుమారు వెయ్యిమంది పోలీసులు బన్నీ ఉత్సవం జరిగే ప్రాంతాల్లో సోదాలు చేశారు. గుట్టలు, కొండలు, ఇళ్లలో తనిఖీలు చేసి.. వెయ్యి కర్రలు స్వాధీనం చేసుకున్నారు.
బన్నీ ఉత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి మూడు నుంచి నాలుగు లక్షలకు పైగా జనం తరలివస్తారు. ఈ నేపథ్యంలో వారికి తాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి. కలెక్టర్ కోటేశ్వరరావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్, వైద్య శాఖ, ఫైర్ సిబ్బంది అధికారులంతా అందుబాటులో ఉండేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గొడవలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలిపారు.
కాగా.. కర్రల సమరంలో గతంలో అల్లర్లకు దిగిన దాదాపు 200 మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. మరో 300 మందిపై బైండోవర్ కేసుల నమోదుకు చర్యలు చేపట్టారు. బన్నీ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నాటుసారా తయారీ కేంద్రాలు, కర్నాటక నుంచి తీసుకొచ్చే మద్యం అక్రమ నిల్వలపై నిఘా ఉంచారు.
Also Read: