Dr Uma Gavini: మనసున్న డాక్టరమ్మ.. తాను చదివిన జీజీహెచ్‌కు యావదాస్తి విరాళం.. మేము సైతం అంటోన్న పలువురు వైద్యులు
డాక్టర్ ఉమా ఇచ్చిన విరాళం.. పలువురిని స్పందింపజేసింది. ఇతర వైద్యులు సైతం మేము సైతం అంటూ ముందుకొచ్చారు. పలువురు డాక్టర్లు భారీ విరాళాలను ప్రకటించారు.
మరణించిన తర్వాత ఎవరూ ఏమీ పట్టుకుని వెళ్లరు అని అందరూ అంటారు.. అయితే రకరకాల రీజన్స్ తో కాలంతో పరుగులు పెడుతూ డబ్బులు సంపాదిస్తారు. తమ తర్వాత తరాల కోసం అంటూ అష్టకష్టాలు పడతారు.. కొందరు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా పెట్టాలన్నా మాకు ఏముంది అని చేతులు ఎత్తేస్తారు.. ఇంకొందరు.. తమకు ఉన్న దానిలోనే తమతో పాటు..అనుకుంటారు.. అయితే అరుదుగా దాన కర్ణులు కనిపిస్తారు. తాము కష్టపడి సంపాదించుకున్న యావదాస్తిని తృణప్రాయంగా దానం చేస్తారు. ఓ మహిళా వైద్యురాలు గత 50 ఏళ్లుగా కష్టపడి సంపాదించిన ఆస్తులను తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా మొత్తం గుంటూరు జీజీహెచ్ కు ఇచ్చేశారు.
గుంటూరు జిల్లాకు చెందిన ఉమా ప్రస్తుతం అమెరికాలో ఇమ్యునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నారు. మూడేళ్ళ క్రితం భర్త మృతి చెందారు. పిల్లలు లేరు.. దీంతో తన యావదాస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు. ఈ ఆస్తుల విలువ మొత్తం రూ .20 కోట్లు. ఉమా 1965 లో గుంటూరు మెడికల్ కాలేజీలో చదివారు. అనంతరం ఉన్నత విద్య పూర్తి చేసి 40 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి.. అక్కడే స్పెషలిస్ట్ డాక్టర్‌గా సెటిల్ అయ్యారు.
గత నెలలో డల్లాస్‌లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్ సమావేశాల్లో ఉమా పాల్గొన్నారు. ఆ వేదిక మీదుగా తాను మెడిసిన్ చదువుకున్న జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కనీస బ్యాంక్ బ్యాలెన్స్ కూడా దాచుకోకుండా తమకు ఉన్న మొత్తం ఆస్తిని విరాళంగా ఇచ్చేశారు. డాక్టర్ ఉమా 2008లో ‘జింకానా’ అధ్యక్షురాలిగా సేవలందించారు. ఉమా ఇచ్చిన విరాళంతో జీజీహెచ్‌లో నిర్మిస్తున్న ఎంసీహెచ్ బ్లాక్‌కు ఉమా పేరుని పెడతామని ప్రస్తావించగా.. ఉమా తన భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరును పెట్టమని కోరారు. ఉమా భర్త కానూరి రామచంద్రరావు కూడా డాక్టర్.. కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చదువుకున్నారు. ఎనస్తటిస్ట్ గా వైద్య సేవలు అందించారు. మూడేళ్ల క్రితం మరణించారు.
డాక్టర్ ఉమా ఇచ్చిన విరాళం.. పలువురిని స్పందింపజేసింది. ఇతర వైద్యులు సైతం మేము సైతం అంటూ ముందుకొచ్చారు. పలువురు డాక్టర్లు భారీ విరాళాలను ప్రకటించారు. డాక్టర్ మొవ్వా వెంకటేశ్వర్లు రూ.20 కోట్లు, డాక్టర్ సూరపనేని కృష్ణప్రసాద్, షీలా దంపతులు రూ.8 కోట్లు , తేళ్ల నళిని, వెంకట్ దంపతులు రూ.8 కోట్లను విరాళంగా ప్రకటించారు. అంతేకాదు జీజీహెచ్ లో చదువుకున్న మరికొంత మంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా తాము కూడా విరాళం ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం డాక్టర్ ఉమా కలియుగ దాన కర్ణుడు అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నారు. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా డాక్టర్ ఉమపై ప్రశంసల వర్షం కురిపించారు.
A heartwarming news. I appreciate Dr Uma Gavini Garu’s generous gesture of donating her wealth to Guntur Medical College’s MCCU. Her invaluable contribution will have an exponential impact and inspire many to share their resources for the greater good.https://t.co/6K1RXqeD2r
— N Chandrababu Naidu (@ncbn) October 6, 2022
తన సంపదను గుంటూరు మెడికల్ కాలేజీ MCCUకి విరాళంగా అందించిన డాక్టర్ ఉమా గవిని పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. మీరు చేసిన పని మరో పదిమందికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..