Andhra Pradesh: ఆరోగ్య శ్రీ పథకంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్.. ఇక నుంచి లబ్ధిదారుల ఖాతాలోకే..
Arogya Sri: ఆరోగ్యశ్రీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని మరింత చేరువ చేస్తోంది. ఇక నుంచి నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే..
Arogya Sri: ఆరోగ్యశ్రీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని మరింత చేరువ చేస్తోంది. ఇక నుంచి నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే డబ్బు పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నాడు ఆరోగ్యశ్రీ చికిత్స, అమలు తీరుపై కీలక సమీక్ష జరిపారు సీఎం వైఎస్ జగన్. నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి డబ్బు, అక్కడ నుంచి ఆస్పత్రికి ఆటోడెబిట్‌లో చెల్లింపులు జరగాలని ఆదేశించారు సీఎం. ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా ఈ ప్రక్రియ కొనసాగాలని సూచించారు. పేషెంటు డిశ్చార్జి అయ్యే సమయంలో కన్సెంటు ఫారం స్వీకరణ, పేషెంటు, బ్యాంకు, ఆస్పత్రి మధ్య కన్సెంటుతో కూడిన ఫారం ఇవ్వాలన్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఈ విధానంలో చాలా వరకు పొరపాట్లను నివారించే అవకాశం ఉంటుందన్నారు.
కేవలం ఆరోగ్యశ్రీ, దానికింద కార్యకలాపాల కోసం ఏడాదికి దాదాపు 4 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని అధికారులు తెలిపారు. గతేడాది ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రానికి అందింది 223 కోట్లు అని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది 360 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్టు అధికారులు చెప్పారు. ఆరోగ్యశ్రీలో 2,446 ప్రొసీజర్లు కవర్ అవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో దీనిపై నిరంతర అధ్యయనం చేయాలని, అవసరాల మేరకు మరింత మంచి చేయడానికి ప్రొసీజర్ల సంఖ్యను పెంచాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించామని అధికారులు తెలిపారు. వైద్యులు, వైద్య సంఘాలతో చర్చిస్తున్నామని చెప్పారు. వారం రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం.