AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష.. ప్రాజెక్టుల నిర్మాణాలపై అధికారులకు కీలక ఆదేశాలు..

Andhra Pradesh Cm: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు..

Andhra Pradesh: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష.. ప్రాజెక్టుల నిర్మాణాలపై అధికారులకు కీలక ఆదేశాలు..
Jagan
Shiva Prajapati
|

Updated on: Oct 01, 2021 | 6:13 PM

Share

Andhra Pradesh Cm: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సహా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టు దిగువ కాపర్ డ్యాం పనులు, కెనాల్స్‌ కనెక్టివిటీ తదితర అంశాలపై చర్చించారు. అలాగే ఆర్ అండ్ ఆర్ పనులపైనా సమీక్ష జరిపారు. కాగా, ప్రాజెక్టు పనుల ప్రగతిని ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు వివరించారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సిన నిధులకు సంబంధించిన వివరాలను సీఎం కు అందజేశారు. పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సిన డబ్బులు రూ.2,033 కోట్లకు పైనే ఉందని అధికారులు తెలిపారు. దీనికి స్పందించిన సీఎం.. రీయింబర్స్‌మెంట్ నిధులను కేంద్రం నుంచి వెంటనే తెప్పించుకునేలా ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎప్పటికప్పుడు రీయింబర్స్‌ అయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని తగిన చర్యలు తీసుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు.

గ్యాప్‌ 3 కాంక్రీట్‌ డ్యామ్‌ పనులను పూర్తి చేశామని సీఎంకు అధికారులు వివరించారు. ఎగువ కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్ నాటికి కాల్వల ద్వారా నీరందించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. దిగువ కాపర్‌ డ్యామ్‌ పనులను నవంబరు నాటికి పూర్తి చేసి, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) పనులను ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇతర ప్రాజెక్టుల ప్రగతినీ సీఎం జగన్ పరిశీలించారు. నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తయ్యాయని, నవంబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే, అవుకు టన్నెల్‌ నిర్మాణ పనుల్లో గణనీయ ప్రగతి సాధించామని అధికారులు వివరించారు. ఫాల్ట్‌జోన్‌లో తవ్వకాలు జరిపి, పటిష్టపరిచే కార్యక్రమాలను చురుగ్గా చేపడుతున్నామన్నారు. వచ్చే ఆగస్టు నాటికి టన్నెల్‌ పూర్తిచేసి ఆ టన్నెల్‌ ద్వారా నీటిని ఇవ్వగలుగుతామని తెలిపారు అధికారులు. కాగా, పనుల్లో ఆలసత్వం ఉండొద్దని, ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

వెలిగొండ ప్రాజెక్టు పనులపై.. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ పనులలో వేగం పెంచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వంశధార స్టేజ్‌ – 2 ఫేజ్‌ – 2 పనులన్నింటినీ కలిపి వచ్చే మే నెల నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అయితే, నిర్దేశించుకున్న సమయానికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. నేరడివద్ద బ్యారేజీ నిర్మాణంకోసం కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. ఒడిశా రాష్ట్రంతో చర్చలకోసం అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి తోటపల్లి బ్యారేజీ కింద పూర్తిస్థాయిలో నీళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎంకు అధికారులు వివరించారు. మహేంద్ర తనయను పూర్తిచేయడంపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ పనులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలన్నారు.

గులాబ్‌ తుపాను, అనంతర వర్షాల కారణంగా ఎక్కడైనా ఇరిగేషన్‌ కాల్వలు దెబ్బతింటే వాటిని బాగుచేయడానికి సత్వర చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కొల్లేరు వద్ద గోదావరి, కృష్ణా డెల్టాలలో రెగ్యులేటర్‌ నిర్మాణ పనులను ప్రాధాన్యాతా క్రమంలో చేపట్టాలని సీఎం ఆదేశించారు. తాండవ ప్రాజెక్టు విస్తరణ, కృష్ణా నదిపై బ్యారేజీల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలన్నారు. తాండవ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లను పిలిచామన్నా అధికారులు. తొలివిడత టెండర్ల ప్రక్రియలో అధికంగా కోట్‌ చేసిన పనులకు సంబంధించి మరోసారి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లామని అధికారులు తెలిపారు.

ఈ సమీక్షా సమావేశానికి జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్, సీఎస్‌ సమీర్‌ శర్మ, జలవనరుల శాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also read:

నడిరోడ్డుపై గర్భిణీ ప్రయాణిస్తున్న కారుని 40 నిమిషాలు ఆపేసిన పోలీసులు.. అసలు ఏం జరిగిందంటే ..??

Ravichandran Ashwin: దినేష్ కార్తీకే అసలైన అపరాధి.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు.. అశ్వి‎న్‎కు అండగా మాజీలు

Maa Elections 2021: ‘మా’ ఎన్నికల సమరం.. సూపర్ స్టార్ కృష్ణను కలిసిన మంచు విష్ణు ప్యానల్..