Andhra Pradesh: ఆయ్.. గోదారోళ్ల మర్యాద అంటే ఇట్లుంటది మరి.. కొత్త అల్లుడికి 100 రకాల నాన్‌వెజ్.. 100 రకాల వెజ్ వంటలు
పశ్చిమ గోదావరి జిల్లాలో దీపావళి సందర్భంగా అత్తింటికి వచ్చిన కొత్త అల్లుడికి మామగారు మరపురాని విందు ఇచ్చారు. ఇందులో ఏకంగా 100 రకాల నాన్-వెజ్ వంటకాలు, మరో 100 రకాల వెజ్, స్వీట్స్ సహా మొత్తం 200 రకాలు సిద్ధం చేశారు. పండుగప్ప, కొరమీను చేపలు, నాటుకోడి, 20 రకాల బిర్యానీలు ఈ మెనూలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గోదావరి వాసుల ఆప్యాయత, అతిథి మర్యాద గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా దీపావళి పండుగ సందర్భంగా అత్తింటికి వచ్చిన కొత్త అల్లుడికి పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం వాసులు ఇచ్చిన సర్ప్రైజ్ అస్సలు మర్చిపోలేనిది. వంద రకాల నాన్-వెజ్ వంటకాలతో సహా మొత్తం 200 రకాల వంటకాల విందుతో ఆ కొత్త అల్లుడిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. వీరవాసరానికి చెందిన తులసీ రాంబాబు దంపతులు తమ కూతురు గోవర్ధిని వివాహాన్ని విశాఖపట్నంకు చెందిన రాహుల్‌తో ఈ నెల 11న ఘనంగా జరిపించారు. పెళ్లయ్యాక తొలిసారి దీపావళి పండుగకు అత్తింటికి వచ్చిన అల్లుడు రాహుల్‌కు, మామగారు తులసీ రాంబాబు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
ఈ విందులో ఏకంగా వంద రకాల నాన్-వెజ్ వంటకాలు, మరో వంద రకాల వెజ్, పిండి వంటలు, స్వీట్లు కలిపి మొత్తం 200 రకాల వంటకాలు ఉన్నాయి. ముఖ్యంగా వంద రకాల నాన్-వెజ్ ఐటమ్స్‌ను చూసి అల్లుడు రాహుల్ ఆశ్చర్యపోయారు. పండుగప్ప, రామలు, కొరమీను, మెత్తళ్ళు, పీతలు, మెత్తళ్ళ పకోడీ, పండుగప్ప పకోడీ వంటి ప్రత్యేక రకాలు. నాటుకోడి, యాటమాంసం, రొయ్యలు, చికెన్ టిక్కా, తందూరి ప్రాన్స్, డ్రాగన్ చికెన్, మటన్ హలీమ్, స్టఫ్డ్ ఎగ్, మటన్ కీమా, మటన్ జీడిపప్పు పకోడీ వంటి అనేక వెరైటీలు ఉన్నాయి. మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, నాటు కోడి బిర్యానీ, రొయ్యల బిర్యానీ, కీమా బిర్యానీ వంటి ఇరవై రకాల బిర్యానీలు సిద్ధం చేశారు.
అలాగే తెలుగు సాంప్రదాయ వంటకాలైన బూరెలు, గారెలు, సున్నుండలు, లడ్డులు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్ పాక్ వంటి అనేక రకాల స్వీట్లు, పిండి వంటలను కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు. తులసీ రాంబాబు దంపతులు స్వయంగా అల్లుడు రాహుల్‌కు, కూతురు గోవర్ధినికి ఇన్ని రకాల వంటకాలను వడ్డించారు. ఇంతటి అద్భుతమైన మర్యాద, ఆప్యాయతను ఎప్పుడూ చూడలేదని రాహుల్ ఆనందం వ్యక్తం చేస్తూ తన మామగారికి ధన్యవాదాలు తెలిపారు. తమ గోదావరి వాసుల మర్యాద అంటేనే ఆప్యాయత అని, అందుకే తొలి దీపావళికి వచ్చిన కొత్త అల్లుడిని సర్‌ప్రైజ్ చేసేందుకు ఇన్ని రకాల వంటకాలు ఏర్పాటు చేశామని తులసీ రాంబాబు తెలిపారు. ఈ విందు తమ జీవితంలో మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆయన అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




