ప్రజలంతా ఒక దారిలో ఉంటే ఉన్మాదిలా మారిన జగన్ ఇంకో దారిలో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతితో జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తోన్న చంద్రబాబు.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాజధాని పోరాటం తన కోసం కాదని భావితరాల కోసమని అన్నారు. రాయలసీమకు వ్యతిరేకంగా ఉన్నామని ప్రచారం చేస్తున్నారు.. మరి కియా పరిశ్రమను పెనుకొండకు ఎవరు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వలన పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయని ఆయన విమర్శించారు.
కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తానని తాను గతంలో కూడా చెప్పానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇప్పుడు హైకోర్టును కూడా మూడు ముక్కలు చేస్తామని అంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి కోసం ఆందోళనలు చేస్తే జైలుకు పంపుతున్నారని.. రాజధాని కోసం జైలుకు వెళ్లేందుకు కూడా తాము సిద్ధమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తన పర్యటనను పెయిడ్ ఆర్టిస్టులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బాబు ఫైర్ అయ్యారు. అమరావతి కావాలో విశాఖపట్నానికి వెళ్తారో ప్రజలే తేల్చుకోవాలని ఆయన అన్నారు.
విశాఖపట్నంలో రాజధాని పెడుతామంటూ 151మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని.. ఆ ఎన్నికల్లో మీరు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఇక రాష్ట్రంలో ఎవరూ పండుగ చేసుకునే వాతావరణంలో లేరని.. భోగిమంటల్లో జీఎన్ రావు కమిటీ నివేదికలను తగలబెట్టండి అంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తాను ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటాను కాబట్టి మరో 25 ఏళ్లు బతికే ఉంటానని బాబు పేర్కొన్నారు.