AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగపూర్ ను తలపించనున్న మరో ప్రాంతం మన ఏపిలోనే రెడీ అవుతుందో.. ఎక్కడో తెలుసా?

సింగపూర్‌ను తలపించనున్న మరో ప్రాంతం మన ఏపిలోనే రెడీ అవుతుందో.. విజయనగరం జిల్లా భోగాపురం, కొత్త విమానాశ్రయం, పెట్టుబడులతో సింగపూర్‌ను తలపించేలా అభివృద్ధి చెందుతోంది. ఐటీ పార్క్, హోటళ్ళు, రిసార్టులు, బీచ్ ఫ్రంట్ ప్రాజెక్టులు పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. భోగాపురం ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రముఖ పర్యాటక, వ్యాపార కేంద్రంగా మారబోతుంది.

సింగపూర్ ను తలపించనున్న మరో ప్రాంతం మన ఏపిలోనే రెడీ అవుతుందో.. ఎక్కడో తెలుసా?
Andhra Pradesh
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Jul 26, 2025 | 11:43 AM

Share

కొద్ది నెలల క్రితం వరకు పల్లెటూరుగా ఉన్న విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతం ఇప్పుడు భూతల స్వర్గంగా మారనుంది. విశాఖకు దాదాపు కలిసి ఉన్న భోగాపురంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలో విమానాశ్రయ నిర్మాణం పూర్తికానుండగా విమానాశ్రయానికి అనుసంధానంగా వేల కోట్ల పెట్టుబడులతో పలు ప్రాజెక్ట్స్ నిర్మాణం సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో సాగరతీరం ఉండటం ఒక సదవకాశంగా మారింది. ఇక్కడ ఉన్న సముద్రతీరంలో పర్యాటకులను ఆకర్షించేందుకు బీచ్ ఫ్రంట్ రిసార్టులు, హోటళ్లు, ఫుడ్ కోర్టుల నిర్మాణానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ సమీపంలో జీఎంఆర్ సంస్థ 500 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తుండగా, 100 కోట్లతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణం కూడా ప్రారంభమైంది. 150 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.

భీమిలిలో తాజ్ హోటల్ నిర్మాణం కూడా త్వరలో ప్రారంభమవ్వనుంది. ఇప్పటికే ప్రతిష్టాత్మక ఒబెరాయ్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం సాగుతుండగా, మరొక 36 గదులతో కూడిన రిసార్టు నిర్మాణం కూడా ప్రణాళికలో ఉంది. డిపిఆర్ ల ప్రకారం ఇందులో స్విమ్మింగ్ పూల్, మీటింగ్ హల్ తో పాటు, వందమందికి సరిపడేలా ఫంక్షన్ నిర్వహించేలా సౌకర్యాలు ఉన్నాయి. ఈ పనులు మరో ఆరు నెలల్లో పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఐటీ రంగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పారిశ్రామిక అభివృద్దిలో భాగంగా విమానాశ్రయానికి సమీపంగా 100 ఎకరాల్లో ఐటీ పార్క్ నిర్మాణం జరగనుంది. అదనంగా 23 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్, 10 ఎకరాల్లో లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి.. ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.. ఎప్పుడంటే?

భోగాపురం పరిసరాలను పర్యాటక భూతల స్వర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందుతున్నాయి. సమీపంలోని సాగరతీరంలో వినోద కేంద్రాలు, సాంస్కృతిక కార్యక్రమాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.ఈ ప్రాజెక్టులు విమానాశ్రయం పూర్తయ్యే సమయానికి 2026 జూన్ నెల నాటికి లేదా 2027 వ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవ్వన్నీ కూడా విమానాశ్రయ నిర్మాణం పై ఆధారపడి ఉన్నాయి. విమానాశ్రయానికి అనుసంధానంగా 15 లింక్ రోడ్లు నిర్మించనున్నారు. విశాఖ తీర రోడ్డును ఆరు లైన్లుగా విస్తరించే యోచన కూడా ఉంది. ఆనందపురం, తగరపువలస మధ్య కొత్త టౌన్‌షిప్‌లు ఏర్పడనున్నాయి.

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో సీ ప్లేన్ ప్రాజెక్టులను పునరుద్ధరించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ వంటి ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్రలోని సాగరతీరంలో సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. ఇవి పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించనున్నాయి. ఈ సర్వీసులు 2026-2027 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కేంద్ర సీ ప్లేన్ పాలసీ ఆమోదం పై ఆధారపడి ఉంటుంది. దీంతో పాటు విమానాశ్రయం చుట్టూ ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులు కూడా ప్రణాళికలో ఉన్నాయి. విమానాశ్రయం సమీపంలో 500 ఎకరాలలో ఏరో సిటీ నిర్మాణం ప్రణాళికలో ఉంది. ఇందులో వాణిజ్య కేంద్రాలు, హోటళ్లు, కార్యాలయాలు ఉంటాయి.ఈ ప్రాజెక్టు విమానాశ్రయం పూర్తయిన తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చెందనుంది. దీంతో పాటు భోగాపురంలో ఏవియేషన్ హబ్, పైలట్ శిక్షణా కేంద్రం, విమాన మరమ్మతుల కేంద్రం, అధునాతన టౌన్‌షిప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ ప్రాజెక్టులకు అదనంగా 500 ఎకరాల భూమిని కూడా కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఇక్కడకి కొద్ది దూరంలో మధురవాడలో అదానీ గ్రూప్ 21,844 కోట్లతో వైజాగ్ టెక్ పార్క్ మరియు డేటా సెంటర్ నిర్మాణం చేపట్టింది. ఇది భోగాపురం విమానాశ్రయంతో అనుసంధానంగా ఉండనుంది. ఈ ప్రాజెక్ట్ ఐటీ రంగ అభివృద్ధికి దోహదపడనున్నది. ఎయిర్ పోర్ట్ సమీపంలోనే చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం 2023లో శంకుస్థాపన జరిగింది. ఇది సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాజెక్టు 2025-2026 నాటికి పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయితే వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి మరింత దోహదపడుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.