AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఏపీ స్కూళ్లలో పెరిగిన హాజరు శాతం.. సీబీఎస్‌ఈ అఫిలియేషన్ తీసుకొచ్చే దిశగా చర్యలు..

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై అధికారులతో సీఎం విస్త్రృతంగా చర్చించారు...

CM Jagan: ఏపీ స్కూళ్లలో పెరిగిన హాజరు శాతం.. సీబీఎస్‌ఈ అఫిలియేషన్ తీసుకొచ్చే దిశగా చర్యలు..
Cm Jagan
Srinivas Chekkilla
| Edited By: |

Updated on: Oct 11, 2021 | 2:55 PM

Share

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై అధికారులతో సీఎం విస్త్రృతంగా చర్చించారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై జగన్ ఆరా తీశారు. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగా పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని అధికారులు సీఎం జగన్‎కు వివరించారు. టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయినందున వారు కూడా విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి ఆగస్టులో పిల్లల హాజరు 73 శాతంగా ఉందని, అది సెప్టెంబరులో 82 శాతానికి పెరిగిందని వివరించారు. అక్టోబరులో 85శాతం హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం హాజరు ఉందని తెలిపిన అధికారులు.

‘అమ్మ ఒడి’ పథకం స్ఫూర్తి కొనసాగాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఆ దిశగా తల్లులను, పిల్లలను చైతన్యం చేయడానికి అమ్మ ఒడి పథకాన్ని తీసుకు వచ్చామన్నారు. విద్యాకానుకను కూడా అమలు చేస్తున్నామని.. వేల కోట్లరూపాయలు ఖర్చుచేసి తొలివిడతలో 15వేలకుపైగా స్కూళ్లు తీర్చిదిద్దామని వివరించారు. అమ్మ ఒడి స్ఫూర్తి కొనసాగాలి, పిల్లలంతా బడిబాట పట్టాలని సీఎం ఆకాంక్షించారు. అమ్మ ఒడి పథకం అమలు సందర్భంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 75శాతం హాజరు ఉంచాలన్న నిబంధన పెట్టామని కోవిడ్‌ పరిస్థితులు కారణంగా ఆ నిబంధనలను అమలు చేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు.

అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ తీసుకొచ్చేదిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ​​​​​​​2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రతి హైస్కూల్‌కు కచ్చితంగా ప్లే గ్రౌండ్‌ఉండాలని స్పష్టం చేశారు.​దీనిమీద మ్యాపింగ్‌ చేసి.. ప్లే గ్రౌండ్‌లేని చోట భూ సేకరణచేసి ప్లే గ్రౌండ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేలా చూడాలన్నారు. ఈమేరకు ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

డిసెంబర్‌ నాటికి వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లేనాటికి విద్యాకానుకను వారికి అందించాలని చెప్పారు. విద్యాకానుకలో భాగంగా పిల్లలకు స్పోర్ట్స్‌ డ్రస్, రెగ్యులర్, స్పోర్ట్స్‌కి ఉపయోగపడేలా ఉండే షూ ఇవ్వాలని… స్పోర్ట్స్‌ డ్రస్, షూలను పరిశీలించిన సీఎం.. కొన్ని సూచనలు చేశారు.​ప్రతి స్కూల్‌కు నిర్వహణ ఖర్చుల కింద కనీసం రూ.1 లక్షను వారికి అందుబాటులో ఉంచాలన్నారు. మరమ్మతులతో పాటు ఏ సమస్య వచ్చినా తీర్చుకునే అవకాశం వారికి ఉంటుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ (దిశ స్పెషల్‌ ఆఫీసర్‌) కృతికా శుక్లా పాల్గొన్నారు.

Read Also.. Sunitha Boya: మరోసారి తెరపైకి సునీత బోయ.. తనకు మంచు విష్ణు న్యాయం చేయాలని డిమాండ్..