Chandrababu: వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఏటా మూడు పంటలు పండించేలా చర్యలు
ఏపీలో మూడు పంటల విధానంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. పక్కా ప్రణాళికలతో రైతుకు మేలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎరువుల వాడకం తగ్గించి భూసారం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.. ఇంతకీ.. మూడు పంటల విధానంపై చంద్రబాబు ఆలోచన ఏంటి?

వ్యవసాయ పనులు ఊపందుకుంటున్న నేపథ్యంలో అమరావతి వేదికగా వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆ శాఖ అధికారులతో చర్చించిన చంద్రబాబు.. కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై.. 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా చూడాలని.. అందుకు అనుగుణంగానే.. మూడు పంటల విధానం తీసుకురావాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలని చెప్పారు. అనంతపురం లాంటి జిల్లాల్లో ఏడాది కాలంలో కేవలం 4 నెలలే పంటలు సాగు చేసి, 8 నెలల పాటు భూములు ఖాళీగా వదిలేస్తున్నారని.. దీని వల్ల భూసారం దెబ్బతింటోందన్నారు. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టి.. మిగిలిన 8 నెలలు కూడా ఏదో ఒక పంట సాగు చేసే పరిస్థితులు కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే వేసవిలో జలవనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లోనూ పంటల సాగు జరిగేలా రైతుల్ని సన్నద్ధం చేయాలన్నారు.
ఖరీఫ్ పంటలపై కీలక సూచనలు చేశారు. ప్రధానంగా.. తుఫాన్ల నుంచి ఖరీఫ్ పంటలను రక్షించుకునేలా పంటకాలాన్ని ముందుకు తీసుకురావాలన్నారు. అలాగే.. వరిలో అధిక డిమాండ్ ఉన్న సన్నరకాలను పండిచేలా రైతులను ప్రోత్సహించాలని.. అంతర పంటలపైనా దృష్టి సారించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మరోవైపు.. ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి.. భూసారాన్ని కాపాడేందుకు కృషి చేయాలని.. ఎరువుల కొరత లేకుండా చూడాలని.. ఎరువులు, పురుగుమందుల వినియోగంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు సీఎం చంద్రబాబు. ఇక.. ముందస్తు పంటల సాగు కార్యాచరణ మొదలుపెట్టినట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు వ్యవసాయ శాఖ అధికారులు. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేసినట్లు గుర్తు చేశారు.