Kishan Reddy: ఎన్డీఏ పాలనకు 11 ఏళ్లు పూర్తి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మోదీ అంటే ఆశామాషీ కాదు. 11 ఏళ్లలో ఒక్క అవినీతి మరక లేకుండా దేశాన్ని పాలించారంటూ ఆకాశానికి ఎత్తేశారు బీజేపీ నేతలు. దేశ రక్షణ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. మోదీ పాలన ప్రజా సేవలకు స్వర్ణయుగం అన్నారు కమలం పార్టీ నేతలు.

11 ఏళ్ల మోదీ పాలనలో దేశం అన్నిరంగాల్లో ముందుకు వెళ్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్ని వర్గాలకు సంక్షేమం అందించాలనే లక్ష్యంతో ప్రధాని పనిచేస్తున్నారన్నారాయన. కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్ల అమృత పాలనపై విజయవాడలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. అమ్మ పేరుతో ఇద్దరు నేతలు మొక్కలు నాటారు. యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు కిషన్ రెడ్డి. దేశాన్ని పేదరికం నుంచి బయట పడేసేందుకు చేపట్టిన అనేక పథకాలు క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్నాయన్నారు. డిజిటల్ ట్రాన్సక్షన్స్ ద్వారా పేదలకు సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామన్నారు. రాష్ట్రాలు బలపడేలా కేంద్రం అన్నిరకాలుగా సహాయం చేస్తుందన్నారు కిషన్ రెడ్డి.
ఉగ్రవాదులపై బ్రహ్మాస్త్రం వదిలి భారత గౌరవాన్ని కాపాడామన్నారు. హింస ఎక్కడ జరిగినా కేంద్ర ప్రభుత్వం సహించబోదన్నారు. కొవిడ్ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకుందన్నారు. వందే భారత్ రైళ్లు తీసుకువచ్చాం, ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య పెంచామన్నారు కిషన్ రెడ్డి. అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తూ దేశాన్ని అభివృద్ధి చేయడమే మోదీ వికసిత భారత్ లక్ష్యమన్నారు పురంధేశ్వరి. రాజధాని లేని రాష్ట్రం ఏపీకి ఇప్పుడు.. రాజధానితో పాటు పోలవరం లక్ష్యం నెరవేరుతుందన్నారు.