శభాష్ షోయబ్.. వయస్సు చిన్నదైనా మనస్సు పెద్దది.. అంతలా ఏం చేశాడంటే!
ఈ రోజుల్లో రోడ్డుపై బంగారం దొరికితే ఎవరైనా ఏం చేస్తారు.. గుట్టుచప్పుడు కాకుండా దాచేస్తారు. తన పంట పండిందని సంబరాలు చేసుకుంటారు. అయితే ఆ బుడతడు అలా ఆలోచించలేదు. వయస్సు చిన్నదైనా పెద్ద మనస్సుతో రోడ్డుపై బంగారం పోగొట్టుకున్న వారి గురించి ఆలోచించాడు. 7 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు రోడ్డుపై దొరికితే గప్‌చుప్‌గా ఇంటికి తీసుకుపోలేదు.

ఈ రోజుల్లో రోడ్డుపై బంగారం దొరికితే ఎవరైనా ఏం చేస్తారు.. గుట్టుచప్పుడు కాకుండా దాచేస్తారు. తన పంట పండిందని సంబరాలు చేసుకుంటారు. అయితే ఆ బుడతడు అలా ఆలోచించలేదు. వయస్సు చిన్నదైనా పెద్ద మనస్సుతో రోడ్డుపై బంగారం పోగొట్టుకున్న వారి గురించి ఆలోచించాడు. 7 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు రోడ్డుపై దొరికితే గప్‌చుప్‌గా ఇంటికి తీసుకుపోలేదు. నేరుగా పోలీస్ స్టేషన్‌లో అప్పగించి పోగొట్టుకున్న వారికి ఇవ్వాలని కోరాడు. బాలుడి నిజాయితీకి అబ్బురపడిన పోలీసులు ఆ చిన్నారిని అభినందించి ప్రశంసించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో రోడ్డుపై 7 లక్షల రూపాయల విలువైన బంగారు నగల సంచి ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ళ బాలుడు షేక్ షోయబ్‌కు దొరికింది. గుడ్లూరు మండలం పూరేటిపల్లికి చెందిన కూరాకుల గోపి అనే వ్యక్తి కూరగాయాలను సంచిలో వేసుకునే క్రమంలో బంగారు నగలు ఉన్న బ్యాగు జారి కింద పడిపోయింది. గోపి ఈ విషయాన్ని గమనించకుండా వెళ్ళిపోయాడు. బంగారు నగలు ఉన్న సంచి కందుకూరు మక్కా మసీదు ప్రాంతంలో నివాసం ఉంటున్న 13 ఏళ్ల షోయబ్ కంట పడింది. సంచిని తెరిచి చూస్తే బంగారు నగలు కనిపించాయి. వెంటనే తన కుటుంబ సభ్యులకు విషయం తెలిపి, సంచి దొరికిన చోట విచారించారు.
అయితే ఎవరూ ముందుకు రాకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళి నగల సంచిని అప్పగించారు. కొద్దిసేపటికి బంగారు నగలు పోగొట్టుకున్న గోపి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు. పోలీసులు సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా బంగారు నగలు పోగొట్టుకున్న వ్యక్తి గోపి అని నిర్ధారించుకుని నగలు అప్పగించారు. బాలుడు పెద్ద మనసుతో దొరికిన 7 లక్షల రూపాయల విలువైన బంగారు నగలను పోలీసులకు అప్పగించడాన్ని కందుకూరు సిఐ కె. వెంకటేశ్వరరావు అభినందించారు. అంతేకాదు షోయబ్‌కు రివార్డు అందించారు.
కందుకూరు పట్టణంలో దొరికిన 7 లక్షల రూపాయలు బంగారు ఆభరణాలను నిజాయితీగా పోలీసులకు అప్పగించిన షోయబ్‌ను కందుకూరు ఆర్య వైశ్యులు అభినందించి ఘనంగా సన్మానించారు. మంగళవారం(జూన్ 10) కందుకూరు ఆర్య వైశ్యుల ఆధ్వర్యంలో సత్యసాయి జువెలర్స్ యజమాని కాకుమాని ప్రవీణ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. షోయబ్ ఇంటికి వెళ్ళి బాలుడి కుటుంబాన్ని స్ధానికుల సమక్షంలో వెండి చిత్రపటం, వెండి చైన్, వెండి పెన్ను, నోట్ పుస్తకాలు అందజేశారు. చిన్నతనంలోనే నిజాయితీగా తనకు దొరికిన ఏడు లక్షల రూపాయలు బంగారు ఆభరణాలు పోలీసులకు అప్పగించడం అభినందించదగ్గ విషయమని ప్రవీన్‌కుమార్ అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా ఆర్య వైశ్యులందరూ షోయబ్ ను అభినందిస్తున్నామని తెలిపారు. చదువుతోపాటు సంస్కారం నేర్చుకోవడం షోయబ్ ను చూసి ప్రతి ఒక్కరూ ఇలాగే నిజాయితీగా ఉండాలని పలువురు కోరారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..