Andhra: వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్.. వచ్చే 3 రోజులు
వేడి ఉక్కపోతతో అల్లాడిన జనాలకు గుడ్ న్యూస్. ద్రోణి ప్రభావంతో రుతుపవనాలు మళ్ళీ యాక్టివ్‌గా మారాయి. దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో మరో మూడు రోజులపాటు చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

వాయువ్య ఉత్తరప్రదేశ్ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మరియు మధ్య ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు. మరోవైపు కొన్నిచోట్ల ఉక్కపోతతో పాటు ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రేపు(బుధవారం) విజయనగరం, పార్వతీపురంమన్యం, పశ్చిమగోదావరి,ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో 40- 41°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. రానున్న మూడు రోజులు వాతావరణం కింద విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరించారు.
జూన్ 11, బుధవారం:
• ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉందన్నారు.
జూన్ 12, గురువారం:
• నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
• అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
జూన్ 13, శుక్రవారం:
• తూర్పుగోదావరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి మన్యం జిల్లా సాలూరులో 43మిమీ, శ్రీకాకుళంలో 42.7మిమీ, విశాఖ జిల్లా ఆనందపురంలో 37.5మిమీ వర్షపాతం రికార్డు అయిందన్నారు. ఇవాళ(మంగళవారం) ప్రకాశం జిల్లా వేమవరంలో 40°C, కొనకనమిట్లలో 39.9°C, నెల్లూరు 39.9°C, కడప జిల్లా ఎర్రగుంట్లలో 39.8°C ఉష్ణోగ్రతలు నమోదైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..