Andhra Pradesh: గుండె నొప్పి నివారణకు క్యాప్సూల్… పేటెంట్ దక్కించుకున్న బాపట్ల వాసి
గుండె నొప్పితో చాలా మంది ప్రాణాలు కొల్పోతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున గుండె నొప్పితో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తెల్లవారుజామున గుండెనొప్పి నివారణకు క్యాప్సూల్ రూపొందించిన బాపట్ల వాసికి పెటేంట్ దక్కింది.
గుండె నొప్పి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెనొప్పికి కారణాలు కనుగొని చికిత్స చేసేందుకు అనేక విధానాలను అమలు చేస్తున్నారు. అయితే సాధారణంగా గుండెనొప్పి తెల్లవారు జామున వస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు ప్రత్యేక మందులను కనుగొన్నారు. అయితే అవి గుండెనొప్పిని తగ్గించేందుకు సమర్థవంతంగా పనిచేయడం లేదన్న విషయాన్ని గుర్తించి అందుకు తగిన విధంగా క్యాప్సూల్‌ను రూపొందించిన బాపట్ల వాసికి పెటేంట్ దక్కింది.
తెల్లవారుజామున గుండె నొప్పి రావడానికి ప్రధాన కారణం కాటెకోలమైన్…. మానసిక, శారీరక ఒత్తిళ్లకు లోనైనప్పుడు కాటెకోలమైన్ విడుదలవుతున్నట్లు గుర్తించారు. అయితే కాటెకోలమైన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే మందులు కూడా ఉన్నాయి. కాటెకోలమైన్‌ను ఎదుర్కొనేందుకు డిల్టియాజెమ్ హైడ్రోక్లోరైడ్, ప్రొప్రొనాలోల్ హైడ్రోక్లోరైడ్ మందులను ఉపయోగిస్తున్నారు. అయితే ఇవి తీసుకున్న కొద్దీ గంటల్లోనే శరీరంలోకి విడుదల అవుతాయి. కానీ కాటెకోలమైన్ మాత్రం తెల్లవారుజామునే విడుదల అవుతోంది. దీంతో మందు తీసుకున్న కాటెకోలమైన్ కారకాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతుంది. దీంతో తెల్లవారుజామున గుండెనొప్పితో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే బాపట్ల ఫార్మసీ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్ సాయి కిషోర్, పరిశోధన విద్యార్ధులు వంశీక్రిష్ణ, వాణీ ప్రసన్నలతో కలిసి ఒక క్యాప్సూల్‌ను తయారు చేశారు. డిల్టియాజెమ్ హైడ్రోక్లోరైడ్, ప్రొప్పొనాలోల్ హైడ్రోక్లోరైడ్ మందులను పిల్లెట్ల రూపంలోకి మార్చి వాటిని జీరో సైజ్ క్యాప్సూల్లో నింపారు. ఈ క్యాప్సూల్ కు హైడ్రోజల్ ప్లగ్ ను అమర్చారు. ఈ ప్లగ్ క్యాప్సూల్ తీసుకున్న ఐదు గంటల తర్వాత మందును విడుదల చేస్తోంది. దీంతో రాత్రి తొమ్మిదిగంటల సమయంలో భోజనం తిన్న తర్వాత క్యాప్సూల్ తీసుకొంటే రాత్రి రెండు గంటల తర్వాత క్రమంగా మందు విడుదల అవుతోంది. దీంతో తెల్లవారుజామునే విడుదలయ్యే కాటెకోలమైన్‌ను ఈ మందులు సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి. తద్వారా తెల్లవారుజామున వచ్చే గుండెనొప్పి మరణాలను తగ్గించవచ్చు. ఈ క్యాప్సూల్ రూపొందించిన వీరికి పెటేంట్ కూడా దక్కింది. ఈ నెల 25న పెటేంట్‌ను కేంద్ర ప్రభుత్వం అందజేసింది. దీంతో వీరిని బాపట్ల ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు చెందిన పలువురు అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి