Atmakur bypoll: రికార్డు స్థాయిలో పోలింగ్.. ముగిసిన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల ఓటింగ్..
ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 64.17శాతం పోలింగ్ నమోదైంది. ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీకి ఈవీఎంలను తరలించారు. ఈనెల 26న ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితం వెల్లడి కానుంది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు అధికారులు. సాయంత్రం 6 గంటల వరకు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 131 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ క్యాంలు, మైక్రో అబ్జర్వర్‌లను ఏర్పాటు చేసి, ఎలాంటి అక్రమాలు జరుగకుండా పోలింగ్ నిర్వహించామన్నారు అధికారులు. 1,339 మంది పోలింగ్ సిబ్బంది, 1,100 మంది పోలీస్ సిబ్బంది, మూడు కంపెనీల కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించామన్నారు. 38 ఫిర్యాదులు వచ్చాయని, అన్నింటినీ పరిష్కరించామని వెల్లడించారు.
ఈ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా ఒక చిన్న ఘటన కలకలం రేపింది. AS పేట మండలం తిమ్మనాయుడుపల్లి పోలింగ్ కేంద్రంలో గొడవ జరిగింది. బీజేపీ అభ్యర్థి భరత్‌కు, వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి బాబాయ్‌కి మధ్య వాదులాట జరిగింది. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఇరు వర్గాలవారు బయటకు వెళ్లారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఒక్క ఘటన మినహా అంతా ప్రశాంతంగా జరిగింది.
ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు అధికారులు. మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. వైసీపీ నుంచి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో ఉండగా టీడీపీ పోటీ చేయలేదు. బీజేపీ నుంచి జి.భరత్ కుమార్, బీఎస్‌పీ నుంచి ఎన్.ఓబులేసుతో పాటు మరో ఐదుగురు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈనెల 26న ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం వెల్లడి కానుంది.